"మీ మధ్య ఏం జరిగింది?"
"బంధం తెగిపోయింది."
"వివరంగా చెప్పు మనూ!"
"ఆ పిల్ల ఛాయ లేదూ? ఆమె ఎక్కడెక్కడి కబుర్లో ప్రోగేసుకువచ్చి రజని మనసు విరిచింది. ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి చేసిన అవమానం........ ఓహ్?" భరించలేని వేదనతో నుదురు రాచుకున్నాడు. తరువాత అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పాడు.
పారిజాత ఏడుస్తూ మనోహర్ కాళ్ళమీదపడిపోయింది "మనూ! నావల్ల నువ్వు రజనిని పోగొట్టుకోడానికి వీల్లేదు. నేను అన్ని సంగతులూ చెబుతాను! ఆమె మనసు మార్చుకొనేలా చేస్తాను. నన్ను తీసుకెళ్ళి వాళ్ళింటిముందు దిగబెట్టు."
"అక్కరలేదు. నేను ఆమెను దేబిరించే హీనస్థితిలో లేను. రజని ముఖంమీద కొట్టినట్టుగా నాకు నువ్వున్నావు చాలు." మనస్సు చివుక్కుమంది పారిజాతకు. రజని మీద ప్రతీకారంతో తనకు దగ్గరవుతున్నాడుగాని ప్రేమతో కాదు! రజనికంటే అందమైన భార్యను పొందాలన్న స్వార్ధంతో తప్ప తను కావాలనిపించి కాదు. ఇప్పుడు ఏమైతే నేమి? మనూ ఏ ఉద్దేశ్యంతో తనను వివాహం చేసుకోవాలనుకున్నా అది జరగదే. గిరిధర్ తోతన పెళ్ళి నిశ్చయం చేసింది కోమలమ్మత్త! పైగా తను ఏ పరిస్థితిలోనూ మనూని కోరనని కోమలమ్మత్తకు మాటిచ్చింది.
పారిజాత భుజాలచుట్టూ చేతులుచుట్టి ఆమెచెంపకు తన చెంపరాస్తూ. మృదుస్వరంతో, "పారూ! తొలివలపు అనేది నీవల్లే కలిగినా అది నీతో పంచుకోడానికి నాకు అమ్మా, అంతస్తూ అడ్డువచ్చాయి. దాన్ని నాలోనే అదిమివేశాను. నిన్ను ముద్దుపెట్టుకున్న దానికి పరిహారంగా నీకు మీనాన్న ఆత్మ శాంతిగా వెళ్ళిపోవడానికి సాయం చేశానని తృప్తిపడ్డానేగాని, నిజానికి అది పరిహారం కాదు. నీమెడలో మూడుముళ్లు వేసి నాదాన్ని చేసుకున్నప్పుడే దానికి పరిహారం చెల్లించినట్టవుతుంది.
కంపరంగా అతడి చేతులనుండి తప్పించుకుని దూరంగా నిలబడింది పారిజాత "సమయం మించిపోయింది మనూ! నిన్ను గిరిధర్ కు ఇవ్వడానికి అత్త మాట ఇచ్చేసింది. ఒక మంచిరోజున ఏ గుళ్ళోనో ఓ నాలుగయిదు వందల ఖర్చుతో పెళ్ళి చేయడానికి నిశ్చయించింది. నీకు నేనున్ననాడు అంతస్తు పెంచే భార్యకోసం పరిగెత్తావు! ఈరోజు నాకోసం నువ్వొస్తే నీకు నేను లేను!" అంది పారిజాత.
మనోహర్ స్థాణువయ్యాడు. తనశక్తినంతా కొల్లగొట్టి నట్టుగా నీరసంగా "ఏమిటి? నిన్ను గిరిధర్ కు యిస్తానని మాట ఇచ్చిందా? ఎప్పుడు? ఈసంగతి ఇంత గుట్టుగా యెందుకుంచింది?" అన్నాడు.
"గిరిధరే ఆ పెళ్ళి అయ్యేదాకా ఎవరితో చెప్పొద్దన్నాడు! అతడి తలిదండ్రులకు కూడా ఈ సంగతి తెలియదు."
"అదేమిటి?"
"అత్తరంగనాధం మామయ్యను పిలిచి నన్ను గిరిధర్ కు చేసుకొమ్మని అడిగింది. నాకూ నీకూ సంబంధముందని నానాదుర్బాషలాడి వెళ్ళాడాయన. ప్రొద్దున్నే గిరిధర్ వచ్చి నన్ను పెళ్ళి చేసుకోడానికి తనకిష్టమేనని పెళ్ళయ్యేదాకా ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు!"
"మాట ఇచ్చిందా? ఎవరినడిగి ఇచ్చింది? గుట్టు చప్పుడు కాకుండా నీ పెళ్లి దాటించాలనుకోవడంలో ఆవిడ స్వార్ధం ఎంత ఉందో తెలుసా? ఎలాగో నీ పీడ వదిలించుకోవాలని ఆవిడ తాపత్రయం.
"ఆవిడ ఏ ఉద్దేశ్యంతో ఇచ్చినా నేను కట్టుబడాల్సిందేగా మనూ"
"ఎందుకు కట్టుబడాలి? ఎవరినడిగి ఇచ్చింది మాట?"
"ఎవరినో అడగటం ఏమిటి? నన్నే అడిగింది?"
"అమ్మ దగ్గర ఎన్ని ఎత్తులున్నాయో నాకు తెలుసు. మంచిగా నాటకమాడి నిన్ను బుట్టలో వేసుకొంది. కొడుకు జీవితంలో నీ ఛాయ కూడా పడకుండా దూరంగా పంపించేయాలనుకొని ఈ కుట్రపన్నింది. ఆవిడ కుట్ర సాగడానికి వీల్లేదు."
"కుట్ర అని నే ననుకోవడంలేదు. నాకిప్పుడు పెళ్ళి అవసరం ఉంది. ఎంత త్వరగా పెళ్ళి చేసుకొని భర్త అనే వాడి నీడన చేరిపోతే అంత నిశ్చింత నాకు. ఈ నిందలతో, ఈ అవమానాలతో బ్రతుకు బరువు చేసుకోవడంకంటే అత్తమాటను నిలబెట్టడమే నాకు శ్రేయస్కరంగా కనిపిస్తోంది."
"నీకు కావలసింది పెళ్ళే కదా? ఆ పెళ్ళి నాతో జరుగుతున్నప్పుడు నీకింకా సంతోషంకాదా?"
"నీతో పెళ్ళికి అంగీకరించడానికి నాకు రెండు అభ్యంతరాలున్నాయి మనూ!"
"అభ్యంతరాలా?" మనోహర్ దెబ్బతిన్నట్టుగా చూశాడు.
