"సంగీతం నేర్చుకోవడం తప్పుకాదే. హరిత గొంతు తీయగా, తీగలా సాగుతుంది. సాధనలో గొప్పగా రాణిస్తుంది. సంసారంలో పడినా అభిరుచులు మారలేదన్న మటా. మరి అల్లుడికి ఎందుకు ఇష్టంలేదో! సంగీతం ఇష్టపడని వాళ్ళు ఎవరయినా వుంటారా" అనుకున్నాడు కృష్ణారావు.
ఏడున్నరకి వచ్చింది హరిత.
అనుకోకుండా అమ్మా, నాన్నను చూసేసరికి ప్రాణం లేచివచ్చినట్టుగా అయింది హరితకు. వాళ్లని విడిచి, వాళ్లని చూడకుండా ఇరవయినాలుగు రోజులు గడిచిపోయాయి. సంతోషంతో తల్లిని ఓచేత చుట్టేసి, ఓ చెయ్యి తండ్రి భుజంమీద వేసింది.
"యిన్ని రోజులు నేను లేకుండా ఎలా వున్నారు మమ్మీ."
"మగడి దగ్గర హాయిగా కాపురం చేసుకొంటున్న నిన్ను తలుచుకొంటూ, రేపో, మాపో మాకు మనుమణ్నో, మనుమరాలినో ఇస్తావని కలలుకంటూ..... " అంటుంటే తల్లి గొంతు గాద్గదికంగా కాగా తండ్రి కళ్లు చెమర్చినట్టుగా అయ్యాయి.
వేడివేడిగా టీ చేసిచ్చి గబగబా కుక్కరు పెట్టేసింది పొయ్యిమీద.
వంటింటిలో చక్రంలా తిరుగుతూన్న కూతుర్ని చూసి -
"చూశారా? పెళ్లి కాకముందు దీనికి ఒక్కపనీ చేతనయ్యేది కాదు. ఇప్పుడు చూడండి ఎన్నో ఏళ్ల అనుభవమున్న దానిలా ఎలా చేస్తూందో" అంది హేమలత భర్తతో ఆశ్చర్యంగా, ఆనందంగా.
"అప్పుడంటే చేసి పెట్టేందుకు అమ్మని నువ్వున్నావు. ఇక్కడెవరున్నారు చేయడానికి? అత్తారింటికి వచ్చాక అన్ని పనులూ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా."
"అవును! జీతం బత్తెంలేని పనిమనిషిగా అత్తారింటికి పంపిస్తే ఆటోమేటిక్ గా పనులెందుకురావు?" మంటగా అనుకొంది హరిత.
ఎనిమిదిన్నర కల్లా వంట అయిపోయింది.
ఇంకా రాలేదు కమలాకర్.
రాత్రి పొద్దుపోతే తనకు అన్నం అరగదని అత్తగారు భోంచేసి పడుకొంది. అల్లుడొచ్చాక భోంచేస్తామని అతడి కోసం చూస్తూ కూర్చొన్నారు కృష్ణారావు దంపతులు.
తొమ్మిదయింది.
ఇంకా రాలేదు కమలాకర్.
వియ్యపురాలి మాటలు గుర్తువచ్చి "సంగీతం నేర్చుకోవడం అతడికిష్టం లేకపోతే మానేయకూడదూ? సంసారం తరువాతే ఏ సంగీతాలైనా సాహిత్యాలైనా!" అంది హేమలత కూతుర్ని మందలిస్తున్నట్టుగా.
"బాగుంది మమ్మీ! అతడికి నేను ఊపిరి పీల్చుకోవడం కూడా ఇష్టముండదు. మానేయమంటావా?' చురుగ్గా అడిగింది హరిత.
"వికటకవిలా అవేం మాటలే?"
"వికటకవిని కాదు! వున్న వాస్తవం అది. నేనేం మరమనిషిని కాదు, మీటలు నొక్కితేనే పనిచేయడానికీ మానడానికీ! మనసూ, ప్రాణమూ వున్న మనిషిని! నాకు తోచింది చేసే స్వతంత్ర్యాన్ని నేనెందుకు పోగొట్టుకొంటాను?"
"ఆడపిల్లవి! అణుకువ, అణిగిమణిగి వుండడం నేర్చుకోకపోతే సంసారం ఎలా చేస్తావే?"
"నాకీ బానిస లక్షణాలే బోధించకని లక్షసార్లు చెప్పాను! భార్యభర్తలంటే ఇద్దరూ సమానం. ఒకరు ఎక్కువా, ఒకరు తక్కువా కాదు! ఎవరు ఎవరికీ అణిగిమణిగి వుండక్కరలేదు! భార్యను సమానమైన మనిషిలా, ఒక మనసున్న మనిషిలా చూడడం నేర్చుకొమ్మని అతడికి చెప్పేబదులు నన్ను అణిగిమణిగి వుండమని చెప్పేదేమిటి?"
"అతడు ఆఫీసు నుండి వచ్చేసరికి నువ్వు ఇంట్లో వుడడం లేదని, అందుకే అతడు బయట తిరగడం నేర్చుకుంటున్నాడని, అందువల్ల వేరే దురభ్యాసాల పాలైనా ఆశ్చర్యంలేదని అంటూంది మీ అత్తగారు దీనికి నీ సమాధానం?"
సహృదయుడైన పురుషుడైతే ఆ కాస్సేపూ ఏదో సత్కాలక్షేపం చేస్తూ నిరీక్షిస్తాడు. సహృదయత అన్నది ఏ కోశానా లేనిమనిషి అతడు! దురభ్యాసాలు ఒక గంటసేపు నేను ఇంట్లో కనిపించనంత మాత్రాన రావు! అవేవో మొదటినుండి వున్నవే వుంటాయి! ఒక పురుషుడు త్రాగుబోతు, తిరుగుబోతు, జూదరి అయ్యాడంటే అది తల్లి పెంపకంలో లోపమేగాని మధ్యలో వచ్చిన భార్య లోపం కాదు!" అత్తగారు వినాలని పెద్ద గొంతుకతో అరిచినట్టుగా అంది హరిత.
రివ్వున బాణంలా వచ్చింది అత్తగారు "పెళ్ళికాక ముందు మగపిల్లలకు లక్ష వ్యవహారాలుంటాయి! పెళ్లయ్యాక కూడా అవి అలాగే సాగుతున్నాయంటే - అది తప్పకుండా భార్య లోపమే! మగణ్ణి దిద్దుకోవడం చాతకాక పోతే నువ్వేం ఆడదానివే?"ఆవేశంగా అరిచింది.
