Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 47

    శ్రీశ్రీగారికి లక్షమంది  తెలిసినవాళ్ళుంటారు. అంతమందినీ పిలవగలమా? పిలవాలని ఉందా ? లక్షమందిలో  మీరొకర"ని  ఒక పెద్దమనిషి (మా స్వంత మనిషే. నేను కోరి తెచ్చుకున్న వ్యక్తి) అన్నాడు.

    "శ్రీశ్రీగారిని  తెలిసినవాళ్ళు లక్షమందేనా  ఉన్నారు ? ఈ మాటతోనే  మీ తెలివితేటలు  తెలుస్తున్నాయి. ఆవిడకి  స్వంతం అని చెప్పుకునే వాళ్ళకన్నా  మేమేమీ తోసిపోము.

    ఈ ఇంటిలోనూ, ఫంక్షన్ లోనూ  కలుసుకొనే  హక్కు  మాకూ వుంద"ని అన్నాను.

    "అదే లేదంటున్నాం" అని అన్నారా వ్యక్తి.

    శ్రీశ్రీగారు బాధపడి, "ఒంటిమీద  తెలివుండే  మాట్లాడుతున్నారా ? దానికి దాని పిల్లలకీ  హక్కు లేకపోవడం ఏమిటి?" అని అడిగారు.

    మాటా మాటా పెరిగింది.

    'ఆస్తిపాస్తుల  కోసం ఆశపడి  ఇక్కడెవరూ  తిష్ట వేసుక్కూర్చుని  గడ్డి తినడంలేదు. ఈ కార్యక్రమం సవ్యంగా సాగాలి" అన్నాను.

    "ఆశపడ్డా  లాభంలేదు. అది జరిగిపోయిన  కథ. ఆవిడ పెంపుడు కూతురి పేరిట ఆస్థి అంతా రాసేసింది" అన్నారు వాళ్ళు.

    శ్రీశ్రీగారు  నిశ్చేష్టులైపోయారు.

    నేనేమీ ఆశ్చర్యపడలేదు. కారణం_ఆ గేంగ్  సంగతి  నాకు  బాగా తెలిసిందే. వాళ్ళని భస్మాసుర హస్తం అని నాకు తెలుసు.

    శ్రీశ్రీగారు  మాత్రం "ఇదంతా  ఎప్పుడు జరిగింది? నాకో మాట అయినా నా ముసల్ది చెప్పలేదే" అన్నారు.

    వారి మాటలకి  ఎవరూ  జవాబు చెప్పలేదు. "మొత్తం  ఎనిమిది మంది కన్నా భోజనాలకి హెచ్చు కార"ని మళ్ళీ మొదలు పెట్టారు.
    ఇక అక్కడ వుండి  అవమానం  పొందేకన్నా  వదిలేసి  రావడమే మేలని మా బైజూని  తీసుకొని  బయలుదేరి  పోయాను. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.

    నేను గేటు దాటకుండానే  శ్రీశ్రీగారు  కూడా వచ్చేసి "పద నేనూ వచ్చేస్తాను. పోదాం" అన్నారు.

    అప్పుడు నేను, చూడండి. మిమ్మల్ని  తీసుకువెళ్ళిపోవడానికి  కారణం కూడా నేనేనని నన్ను తిడతారు ప్లీజ్_రాకండి" అన్నాను.

    "ఎవరిష్టానికి వారిని  వదిలేసినందువల్లే  ఇంత దూరం వచ్చింది. ఈ ఇంటితో నాకిక సంబంధంలేదు. నా కోసం ఉన్న ముసల్ది కూడా వెళ్ళిపోయింది. పద మనింటికి  పోదాం. అందరూ కలిసి  నాకూ నా కొడుకుకీ  అన్యాయం చేశారు. ముసిల్ది కూడా  ఇలా చేస్తుందని  అనుకోలేదు" అన్నారు.

    "ఆవిడ్ని  అనకండి. ఆవిడేమీ  చెయ్యలేదు" అన్నాను.

    అలా మాట్లాడుతూ మేము నడుచుకుంటూ  ఇరవై  గజాల  దూరం కూడా వెళ్ళలేదు. ఇద్దరు పరుగెత్తుకువచ్చి, "మీరిలా  వెళ్ళిపోవడం  బాగులేదు సార్!" అన్నారు.

    "సరోజా  వెళ్ళిపోవడం  బాగుందా? దానికి  ఈ ఇంటితో  సంబంధం లేనప్పుడు  నాకూ లేదు" అన్నారు శ్రీశ్రీగారు.

    "అలాగంటే  కాద"ని  వాళ్ళు కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు.

    "మీరు వెళ్ళండి. సరోజని వదిలేసి వస్తాన"ని  చెప్పేశారు  శ్రీశ్రీగారు. ఆ నాలుగు రోజులూ, ఉదయం బైజూ, ఆయనా వెళ్ళి వచ్చేవారు. మొత్తంమీద ఆ కార్యక్రమం  సక్రమంగానే  జరిగింది.


                                                శ్రీశ్రీ మతిభ్రమణం


    శ్రీశ్రీగారు ఆవిడ వియోగంతో  కొంతకాలం  మనసులోనే  బాధపడ్డారు. నేను మాటలతో  పన్లతో  మరపించేదాన్నని  అనుకోడం వరకే  అనుకుంటాను. ఆయన మహానుభావులు! గుండె నిబ్బరం ఎక్కువే. కానీ చివరికి తనతో ఒక్కమాటైనా  చెప్పకుండా తన కొడుక్కి (బైజుకి) ఆవిడ అన్యాయం  చేసిందని  మాత్రం  ఆఖరివరకూ వాపోయారు.

    ఆ ఇంటికి మాకూ క్రమేపీ  రాకపోకలు  తగ్గిపోతూవచ్చాయి. అయినా వారికి ఆ ఇంటిమీద మోజు ఎక్కువే. వీధి వరండాకి  ఆనుకొని వున్న కుడివైపు రూముని  తన బెడ్రూమ్ చేసుకున్నారు.

    (అది  రవణమ్మగారి ఏర్పాటే. టెలిఫోన్, వారి బీరువా, మంచం, టేబుల్...అన్నీ చక్కగా అమర్చివుంచిందావిడ. చుట్టూ కొబ్బరిచెట్లతో  బ్రహ్మాండమైన  వెలుతురూ  గాలీ కూడా ఆ గదికి వుండేవి)

    మధ్యాహ్నం పూట వెళ్ళి  ఒక్కోసారి  భోజనంచేసి  ఆ గదిలోనేపడుకొని వస్తూ వుండేవారు. అదికూడా  అట్టేకాలం సాగలేదు.

    ఒకరోజు  చిన్నబోయిన  ముఖంతో  వచ్చారు. నేను ఇట్టే కనిపెట్టేశాను. వారు వీధిలోకి  వెళ్ళివస్తే  ముఖభావంగా చూసే అర్ధం చేసుకొనేదాన్ని. చాలాసేపు  బ్రతిమాలుకున్న  తర్వాత విషయం చెప్పారు.

    ఈ ముందు ఇంటితోపాటు  ఆ గదికూడా  ఇస్తే అద్దె ఎక్కువవస్తుంది. అందువల్ల ఆ గది కూడా ఖాళీచేసి  ఇచ్చేస్తున్నామని  అన్నారుట. నా గుండెలో  కత్తి దింపినట్టు అయ్యింది. వెంటనే తమాయించుకొని, "పోతేపోయింది మీరెందుకండీ  బాధపడతారు? మీకేం ఖర్మమండీ_ఇంతపెద్ద  ఇల్లువుంది. ఇది మీదికాదా? మీ కోసం అవస్థపడుతూ ప్రాకులాడుతున్నవాళ్ళని వదిలేసి, ఎందుకండీ  ఆ ఇంటికోసం  అవస్థపడతార"ని నేను ఏడుస్తూనూ,కోపంగా కూడా అన్నాను.

    ఈ మాటలు  విన్న మా పిల్లలు కూడా, "ఇక అక్కడికి వెళితే ఒప్పుకోం అప్పా! అక్కడికి వెళ్ళి  మనస్సు పాడుచేసుకోవద్ద"ని  మొండి పట్టుపట్టారు.

    స్టూడియోకి  వెళ్ళే  తోవలో  బుద్ధిపుట్టినప్పుడు  నెలకోసారో  రెండు సార్లో  వెళ్ళేవారు. రోజూ వెళ్ళానన్నా నేను బాధపడేదాన్నికాను. ఆయన బాధ ఏమిటో అర్ధం చేసుకున్న నాకు తెలుసు. ఆ ఇంటిమీద, తన ప్రతీ రక్తపు బొట్టూ ధారపోశారు. అంటే_డబ్బు  విషయంలో_ నయాపైసా దగ్గర్నుండీ వారి కష్టార్జితమే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS