Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 46


    అతని కనుకొలకులలో నీరు ఉబికింది.
    "ఇప్పటికి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. సాహితి మృత్యువుతో పోరాడుతున్నది. మానవత్వం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది సమ్రాట్?" హేళనగా అంది అనూష.
    "అనూషా! నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? మన కళ్ళకు కనిపించని, చెవులకు వినిపించని సాక్ష్యాలు కూడా ఉంటాయి. అవి బయటపడనంతకాలం నాలాంటి వాళ్ళు కొందరు బలిపశువులవుతారు. నిజం ఎప్పటికైనా బయట పడుతుంది. అప్పుడైనా నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి" అంటూ నిస్పృహగా వెనుదిరిగాడు సమ్రాట్.


                             *    *    *    *


    సమ్రాట్ తన గదిలో వున్న రాక్స్ నుంచి పుస్తకాలు అన్నింటినీ తీసి నేలమీద గుట్టగా పడేశాడు.
    అంతకుముందే తెచ్చి వుంచిన పెట్రోల్ డబ్బా మూతతీసి వాటిమీద చల్లాడు. లైటర్ తీసి వాటికి ముట్టించాడు.
    అతనిలో దహించుకుపోతున్న ఆవేశానికి నిదర్శనంగా గదిలో మంటలు ఉవ్వెత్తున లేచాయి.
    ఈ హఠాత్సంఘటనకు విస్తుపోయాడు విశ్వనాథ్.
    "ఏరా! నువ్వు చేసిన పనేమిటి? మతిగాని పోయిందా?" విశ్వనాథ్ కొడుకుని నిలేశాడు.
    సమ్రాట్ మౌనం వహించాడు.
    "నిన్నేరా పిలిచేది! ఇదెవరైనా చూస్తే నా పరువేం కాను?" విశ్వనాథ్ ముఖం కోపంతో జేవురించింది. వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నంలో మునిగిపోయాడు.
    "ఇప్పటివరకూ పరువు గురించి ఆలోచించే నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇక నావల్ల కాదు. నేను చేయవలసిన పనే చేస్తున్నాను. దయచేసి నా దారికి అడ్డు రాకండి!" వేదాంత ధోరణిలో ఉన్నాయి సమ్రాట్ మాటలు.
    "ఇంతలోనే నీకేమయిందిరా? నీకిష్టం లేని పనేమన్నా చేశామా? నీ మనసు నెవరైనా కష్టపెట్టారా?"
    "నాకేమీ రాలేదు. ఇక నుంచి నేను కాగితం మీద కలం పెట్టడం లేదు. నా సాహిత్యాన్ని అమ్మదలచుకోలేదు. ఇప్పటివరకు నేను రాసినవన్నీ తగులబెట్టా. దుకాణాల్లో ఉన్న నా పుస్తకాలను తిప్పి పంపమని కబురుపెట్టాను. ఆపైన వాటిని కూడా నామరూపాలు లేకుండా తగలబెడతాను!" ఆవేశంగా అన్నాడు సమ్రాట్.
    "ఒరే! ఒరే! నీకు పిచ్చిగానీ పట్టిందా? మన వ్యాపారం పాడుచేస్తానంటావేంటిరా?" విశ్వనాథ్ ఆందోళన పడ్డాడు.
    "నాన్నా! సాహిత్యాన్ని అమ్ముకోవచ్చు. అలా అని మన వ్యాపారాభివృద్ధి కోసం జీవితాలనే బలి తీసుకోవలసిన పనిలేదు!"
    "అంటే నీ ఉద్దేశం?"
    "నాకిష్టం లేకపోయినా నా నవలల మధ్య మధ్య ఘోస్టు రైటర్ల చేత నీతిమాలిన, అశ్లీలతతో కూడిన సాహిత్యాన్ని రాయించి యువతరాన్ని ఆ మత్తులో ముంచి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కాని అవి చదివి చాలామంది చెడిపోయారు. చివరికి సురేఖ, గౌతమి, కళ్యాణి ఆత్మహత్యలు చేసుకున్నారు. అటు ప్రజలు, ఇటు పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. వద్దు నాన్నా! వద్దు! ఆ నెత్తురు కూడు మనకొద్దు!" సమ్రాట్ గొంతు బొంగురుపోయింది.
    "పిచ్చివాడా! నీ సాహిత్యం చదివేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారనుకోవడం భ్రమ. సాహిత్యం చదివి, సినిమాలు చూసి మనుషులు చెడిపోతారనుకోవడం పొరపాటు. అదే నిజమైతే రామాయణ, భారత, భాగవతాదితర పురాణ గ్రంథాలు భారతీయ భాషల్లో అనేకం ఉన్నాయి. అవన్నీ చదువుతున్నా అప్పటికీ, ఇప్పటికీ మనిషిలో ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు. రాదుకూడాను! మరి అలాంటప్పుడు కాలక్షేపానికి చదివే నీ సాహిత్యం ఎవరిమీద ఏ ప్రభావం చూపించగలదు? నువ్వు నిశ్చింతగా ఉండు. పోలీసు కేసులూ, గట్రా నేను చూసుకుంటాను" అతని భుజంమ్మీద చేయివేసి అనునయంగా అన్నాడు విశ్వనాథ్.
    "జీవితంలో నేను ఓడిపోయాను. అలసిపోయాను. నాలో రాయాలనే కోరిక కలగడంలేదు. నిర్మాణాత్మకమైన విషయాలమీదకు మనసు పోవడం లేదు. ఇంకెలా రాయమంటారు? రాయడం నావల్ల కాదు నాన్నా!" నిస్పృహ ధ్వనించింది సమ్రాట్ స్వరంలో.
    "బావుందిరా! నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను తిరస్కరించడంతో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నావు. మానవ ప్రయత్నం చేశావు, ఫలించలేదు. నిరుత్సాహపడితే ఎలారా?"
    "నాన్నా! ఆరోజు అనూష మీద కరపత్రాలు వేయించింది నిజంగా ఆనందేనా?"
    విశ్వనాథ్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.
    "చెప్పండి నాన్నా!" సమ్రాట్ రెట్టించి అడిగాడు.
    "అదంతా నీకోసం నేను సృష్టించిందేరా! అనూష కోటీశ్వరుని కూతురు. తెలివితేటలు కలది. నీకు సరిజోడీ అనుకున్నాను. వాళ్ళిద్దరి మనసులూ విరిచేయడానికి ఆ కరపత్రాలను నేనే వేయించాను. అనూష నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుందనుకున్నాను. నా అంచనా తప్పింది. అసలుకే మోసం వచ్చినట్టు సాంతం నీ దగ్గిర పనిచేయడం మానేసింది."
    "అదే నాన్నా మీరు చేసిన తప్పు! మీ అంచనా అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తప్పింది! అనూషను నేనెప్పుడూ ప్రేమించలేదు!"
    "వ్వాట్!" విశ్వనాథ్ తెల్లబోయాడు.
    "అవును, నాన్నా! నేనామెను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. నేను ఆశలు పెంచుకున్నది సాహితిపైనే. కాని ఎందుచేతనో బిందుమాధవి మా ఇద్దరి మధ్య అగాధంగా నిలచింది." సమ్రాట్ గొంతులో విషాదం గూడుకట్టుకుని వుంది.
    బిందుమాధవి పేరెత్తగానే విశ్వనాథ్ ముఖంలో రంగులు మారాయి.
    "మరచిపో! నా మాట విని ఆ పిల్లని మరచిపోరా! నా శరీరంలో ప్రాణం వుండగా ఆ పిల్లతో నీ పెళ్లి జరగనివ్వను!" విశ్వనాథ్ పళ్ళు పటపటలాడాయి.
    అనేక విషాదకరమైన మలుపులతో కథలు రాసిన సమ్రాట్, తన జీవితంలో ఏం జరుగుతుందో ఊహించలేకపోయాడు.
    రెండు మనసులను విడదీయాలంటే, పనిగట్టుకుని శ్రమ తీసుకోవలసిన పని లేదనుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS