"ఒసేయ్! ఒసేయ్! నీకూ పిల్లలు వున్నారే! కాస్త మంచీ చెడ్డా ఆలోచించవే." ఆవేదనగా అన్నాడు రామానుజాచారి.
"నాకూ పిల్లలు వున్నారని బానే గుర్తుచేశారు. పుట్టిన ఏడుగురిలో ఆరుగురి ఆడపిల్లలని, వాళ్లకి మీరే తండ్రి అని పాపం మర్చిపోయినట్టున్నారు!" వ్యంగ్యంగా అంది వకుళాంబ.
మాటకిమాట తెగులు, వీడికి నాచు తెగులు అన్నట్లు వకుళాంబ లాంటి వాళ్ళతో మాట్లాడేకన్నా, మౌనంగా వుండటం ఉత్తమమైన పని. ఆ విషయం బాగా తెలుసు కాబట్టే ప్రతి చిన్నా పెద్దా విషయానికి మౌనంగా సర్దుకు పోతుంటాడు రామానుజాచారి. భార్యతో పోట్లాడి నెగ్గటం సాధ్యంకాదని ఆయనకి తెలుసు. పోట్లాడేకన్నా ఆమెతో సర్దుకుపోయి మరొక రకంగా ఆ విషయం చూద్దామని అనుకున్న రామానుజాచారి "అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్? నావల్ల కాదు బాబూ! మీ పాట్లేవో మీరు పడండి అని చెప్పి ఐదువందలూ ఇచ్చిరానా?" అన్నాడు.
"అయ్యో! మీ తెలివి బండలుగానూ! ఐదువందలూ తిరిగిఇచ్చి రమ్మన్నానా!" సాగదీసుకుంటూ అంది వకుళాంబ.
ఈ తఫా కాస్త కోపం వచ్చింది రామానుజాచారికి.
"అయితే ఆ డబ్బులు మింగుదామంటావా?" కోపాన్ని బలవంతంగా దిగమ్రింగుకుంటూ.
"అఖ్కర్లేదు. మనం బస్సులోనే మామూలుగా వెళదాం." కావాలంటే ముందు అక్కడికి వెళదాం. రక్షించ గలిగితే ఆ అబ్బాయిని రక్షించ గలుగుతాం. మనకి నాలుగు డబ్బులు మిగులుతాయి. మానవప్రయత్నంగా మనం చేద్దాం. మనం ఎంత ప్రయత్నం చేసినా దైవ నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుంది."
వకుళాంబ ఈ మాటలు అనంగానే కొంతలో కొంత సంతోషించాడు రామానుజాచారి.
"బస్సులో ప్రయాణమయి వెళ్ళి ముందుగా ఆ అబ్బాయి దగ్గరకి వెళదాం అంది. ఆ ఒక్క మాట చాలు. భగవంతుడా! భార్య నోటికి దడవటం తప్ప, తెలిసీ తెలిసీ ఎవరికీ ఏ చిన్న అపకారమూ చెయ్యలేదు. నా తప్పుని మనసారా క్షమించి ఆపదలో వున్న ఆ పిల్లవాడిని ఎలా అయినా కాపాడు తండ్రీ! ప్రతిరోజూ నూరు ప్రదక్షిణాలూ అలా నూటొక్క రోజు నీ గుడిచుట్టూ తిరిగి చేస్తాను. అంతకన్నా ఈ అభాగ్యుడు ఏమీ చెయ్యలేడు." అంటూ భగవంతుడిని వేడుకున్నాడు రామానుజాచారి.
ఆ తరువాత,
వకుళాంబ ఇష్టానుసారమే ఆవిడ చేతికి ఐదువందలు ఇవ్వటమే కాక, బస్సులో బయలుదేరాడు రామానుజాచారి.
అప్పుడు సమయం.
ఉదయం పదీ పది.
21
బస్సు వేగంగా ముందుకు దూసుకుపోతోంది.
ఆ బస్సులోనే ప్రయాణం చేస్తున్నాడు రామానుజాచారి తన కుటుంబంతో.
తన సీటులో నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నదే కాక, మధ్య మధ్యలో ఒక కునుకు కూడా తీస్తున్నది వకుళాంబ.
రామానుజాచారి కొడుకు "పట్నం వెళ్ళిన తరువాత అమ్మను కాకాపట్టి ఏం కొనిపించుకుందామా" అని ఆలోచిస్తున్నాడు.
కాబోయే పెళ్ళికూతురు, రామానుజాచారి పెద్దకూతురు అయిన శ్రీమహాలక్ష్మి పట్నంలో తను చూడబోయే పెళ్ళికొడుకుని తలచుకుని, పగటికలలు కంటూ మురిసిపోతున్నది. ఆ అమ్మాయి కళ్ళముందు పెళ్ళికొడుకు పాత సినిమాల్లో ఎన్.టి.ఆర్. లాగా దర్శనమిస్తున్నాడు.
ఆ బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు అందరు ప్రయాణీకులు అంతో ఇంతో ఉత్సాహంగానే వున్నారు.
ఓ ప్రక్క రామానుజాచారి, తప్పు చేసిన వాడిలాగా పరిపరివిధాల తపిస్తూ "భగవంతుడా! నా మూలంగా పసిపిల్లవాడి ప్రాణాలు పోతే నాజన్మకి ఇంక నిష్కృతి లేదయ్యా! నువ్వే కాపాడాలి నన్ను." అనుకుంటూ అదేపనిగా వాపోతున్నాడు.
