"నమ్మమని చెప్పటంలేదు సార్! వినండి. నా మాటల్లో నిజానిజాలు మీకే తెలుస్తాయి. మీలాంటి తెలివిగలవారిని అబద్ధాలు చెప్పి నమ్మించగలనా సార్! ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి సార్!"
"సరే చెప్పు."
"మీరు మమ్మల్ని విడిచిపెట్టిం తరువాత వరసగా మూడురోజులు స్టేషనుకి వచ్చి మీకు కనపడి వెళ్ళాం కద సార్! నాలుగోరోజు వస్తుండగా బాస్ గాడు మా యిద్దరినీ పట్టేసి ఒక గదిలో కట్టేసి పడేశాడు సార్!"
"ఆ..."
"అంతేకాదు సార్! బాస్ గాడు ఈ వూళ్ళోనే వున్నాడు."
"ఉన్నాడు సరే నమ్ముతున్నాను. అయితే ఏంటి?"
"వాడు మిమ్మల్ని పట్టుకుని బంధించాడు. అప్పుడు వాడేమన్నాడో తెలుసా సార్! మమ్మల్ని అన్నం నీళ్ళు లేకుండా మాడ్చి చంపుతాడట. మీకు తరుచూ ఫోను చేసి మిమ్మల్ని పెడదోవ పట్టించి మీకు పిచ్చి పట్టించి ఆపై మీ ఉద్యోగం వూడేలా చేస్తాడుట. ఎందుకంటే మీరు వాడి స్థావరం దండెత్తి వాడి బాస్ పదవి వూడగొట్టి వాడి ముఠాని కకావికలం చేశారుట...
"ఆ..."
"అంతేకాదు సార్! కోటీ యాభై లక్షల రూపాయల విలువగల వజ్రాలు వాడి దగ్గరే వున్నాయట...
"ఆ...!"
"మిమ్మల్ని ఫూల్ చేస్తూ..."
"బాష్టర్డ్!"
"నన్నేనా సార్ తిట్టింది?"
"నిన్ను కాదు. ఆ బాస్ గాడిని...వాడు పావుగంట క్రితం నాకు ఫోనుచేసి..." బాస్ గాడు ఏమన్నది ఆ తర్వాత తనేం మాట్లాడింది వివరంగా చెప్పాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
చెప్పి...
"బాస్ గాడిని బోల్తా కొట్టించాను. మీ ఇద్దరూ ఇంకా నా కస్టడీలోనే వున్నట్లు వాడు నన్ను తప్పుదోవ పట్టించబోయాడు కదా! అప్పుడు నేను తెలివిగ మాట మార్చేశాను. కాని అసలు విషయం మీ గురించి చెప్పలేదు" అంటూ ఇంకా వివరంగా చెప్పాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించారు సార్! ఎంతయినా మీది పోలీసు బుర్ర అయ్యో..."
"నన్ను మెచ్చుకునేవాడివి మెచ్చుకోక మధ్యలో యీ ఆక్రందన దేనికయ్యా!"
"నేను రాంసింగ్ తప్పించుకునే ప్రయత్నంలో నేను వాళ్ళ కళ్ళు గప్పి పారిపోయి రాగలిగాను. రామ్ సింగ్ దొరికిపోయాడు.
మీ సాయం తీసుకుని రామ్ సింగుని విడిపించేలాగా చేసి బాస్ గాడి పనికూడా పట్టేటట్లు చేద్దామనుకున్నాను. మీకు ఫోను చేసి వెంటనే చెప్పబోతుంటే మీరు వివరాలు అడిగి ఇంత ఆలస్యం చేశారు.
అదిగోండి సార్ వాళ్ళు కారు దిగి నా దగ్గరకి పరుగెత్తుకుంటూ వస్తున్నారు. నేను ఫోను చేస్తున్నది సూపర్ బజార్ పక్కసందులోంచి. అక్కడికి మీ మంది మార్ బలంతో వచ్చి నన్ను_
అమ్మో...రక్షిం...అబ్బా...చండి__సా...ర్!" ఆ తరువాత విజయ్ మాటలు వినపడలేదు. రకరకాల గొంతుల వాళ్ళ తిట్లు "దోరికావురా నా కొడకా! మా కళ్ళుగప్పి పారిపోదామనే!" అన్న కర్కశమైన గొంతుకతో మాటలు ధబ్ మన్న శబ్దం దభీ దభీ అంటూ గుద్దుల శబ్దం వినపడి ఆ తర్వాత నిశ్శబ్దం అయిపోయింది ఫోన్.
ఆతృతగ "విజయ్! విజయ్ నేనొస్తున్నా!" అన్నాడు. ఆపై మరింత ఆతృతగా "హలో హలో" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
అవతలనుంచి నో రెస్పాన్స్.
టకీమని రిసీవర్ ని క్రెడిల్ మీద వుంచి టక్ మంటూ కుర్చీలోంచి లేచాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"హరియప్. ఇక్కడున్నట్లు వెళ్ళాలి మంది మార్బలం జీపు రెడీ చెయ్యి" అన్నాడు ఆజ్ఞాపిస్తూ.
"ఎక్కడికి సార్" అయోమయంగా అడిగాడు అహోబిలం.
"జీపులో వెళుతూ చెపుతాను పద హరియప్."
హెడ్ కానిస్టేబుల్ అహోబిలం, ఇన్ స్పెక్టర్ వర్ధనరావు రూమ్ లోంచి బయటికి పరుగు తీశారు.
నాలుగే నాలుగు నిముషాల తర్వాత_
పోలీసు జీపు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరింది.
22
నాకు నవ్వాగలేదు.
నవ్వి నవ్వి బలవంతాన నవ్వాపుకున్నాను.
"అదేంటి భాయ్! అంత యాక్షన్ చేస్తూ అన్ని అబద్ధాలు ఆడావ్! అసలే ఆ ఇన్ స్పెక్టర్ కి తలతిక్క. ఎప్పుడు మెడమీద తలకాయ వుంటుందో, ఎప్పుడు తలకాయ మోకాల్లోకి దిగుతుందో తెలియదు. రేపు మన బండారం ఖర్మకాలి బయట పడితే..."
