Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 46


    "అమ్మదొంగా! ఎంతసేపైంది నువ్విక్కడికొచ్చి" పైకెత్తుకున్నాడు.


    "ఇందాకొచ్చాను. నువ్వు ముద్దు పెట్టకుండా వెళ్ళిపోతుంటే పిలిచానన్నమాట..." నీరసంగా పదాల్ని కూడగట్టుకుంటూ చెప్పింది. "మరేమో డాక్టర్ అంకుల్ చెప్పాడు"


    "ఏమని?"


    "నాకేం కాదని."


    "అలాగా గుడ్" చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు.


    "వెళ్ళి ఆడుకో" రూపాని దించి తల మరెటో తిప్పుకున్నాడు.


    అప్పుడు చూశాడు శశాంక జాకీ కనుకొలకుల్లో నిలిచిన ఓ నీటి బొట్టుని...


    "రూపకేమయింది" శశాంక అడుగుతుంటే మాట మార్చబోయాడు.


    కాని పట్టువదలక "చెప్పు జాకీ" అన్నాడు శశాంక.


    "అమ్మ బ్రతకడానికి కావలసిన ప్రేమను పంచగలదు. కనీస జీవితాన్ని ఇవ్వగలదే తప్ప, ఖరీదైన జబ్బుల విషయంలో ఏం చేయగలదు శశాంకా... పుట్టుకతోనే గుండె జబ్బున్న రూప గుండె వాల్వ్స్ డామేజ్ అయ్యాయంటారు డాక్టర్లు. వీలైనంత త్వరగా పెరంబూరులో గాని, నెల్లూరులో గాని ఆపరేట్ చేయకపోతే బ్రతకదు. ఇది ఈ ఆశ్రమంలో అందర్నీ కలచివేస్తున్న సమస్య. అప్పటికీ అమ్మ ప్రభుత్వపరమైన సహాయం కోసం చాలా ప్రయత్నాలు చేసింది..."


    సమస్య చాలా రొటీన్ అయినా మామూలుగా విని ఊరుకోలేదు శశాంక. "ఆ డబ్బును నేను సర్దుతాను."


    శశాంక అప్రయత్నంగా అనలేదని రుజువైపోయింది అతడి కళ్ళల్లోని సంకల్పాన్ని గమనించగానే.


    "కానీ..."


    "అమ్మతో చెప్పు... ఏర్పాట్లు చేయమను."


    "అంత డబ్బు..."

    
    "ఎంతయినా ఫర్వాలేదు జాకీ... ఓ లక్ష కావాలా"


    ఏ ధైర్యంతో శశాంక హామీ ఇస్తున్నదీ జాకీ ఊహించలేకపోతున్నాడు.


    మనిషి మనసుకి కొలబద్ద అతడు చేసే పనులే అన్న సూత్రమే నిజమైతే ఇక్కడ అసంకల్పితంగానైనా శశాంక అరుదైన ఓ గొప్ప నిర్ణయంతో జాకీ దృష్టిలో మహాత్ముడై పోయాడు...


    జాకీ ఇంకా నిశ్చేష్టత నుంచి తేరుకోకముందే బయలుదేరుతూ "ఇక్కడే వెయిట్ చేస్తూండు... ఫోన్ చేస్తాను" అనేసి వెళ్ళిపోయాడు.


                               *    *    *    *


    "వెల్ కమ్. మొత్తానికి దామోదర్ సాధించాడు" అంది సోఫియా ఇంటిలో అడుగుపెట్టిన శశాంకని చూస్తూ...


    "ఏ విషయంలో?"


    "నిన్ను గాలించమన్నాను... అర్జెంటుగా ఓ పనుండి"


    "వచ్చింది నా అంతట నేనుగా."


    "దెన్ ఇట్స్ రియల్ సర్ ప్రైజ్" కాంక్షగా అతడి కళ్ళలోకి చూసింది "చెప్పు"


    "ఎందుకు నన్ను రప్పించాలనుకున్నావో ముందు నువ్వు చెప్పు" ఆమె 'స్లిప్' ని అవకాశంగా తీసుకున్నాడు.


    "గుడ్... క్రమంగా వ్యవహారదక్షతని సంపాదించుకుంటున్నావు" ఓ క్షణం ఆగింది. అతని ముఖ కవళికలని గమనిస్తూ... "మరేంలేదు, తీగను లాగబోయి మొత్తం డొంకను కదిలించావు... అదే... కుమార్ దాదాని లొంగదీసుకునే ప్రయత్నంలో సాధించిందేమీ లేకపోయినా జయచంద్రని ఎలర్ట్ చేశావు"


    విభ్రమంగా చూశాడు ఎంత వేగంగా అండర్ వరల్డ్ రాకెట్స్ పనిచేసేదీ తెలుసుకుని... అంతకన్నా అతన్ని ఎక్కువ నిశ్చేష్టుడ్ని చేసింది తనను నీడలా వెంటాడుతూ తన ప్రతిచర్యనీ గమనించ గలుగుతున్న సోఫియా విజిలెన్స్...


    చెప్పింది మరికొన్ని గంటల్లో జయచంద్ర షిప్ లో పంపబోయే కన్ సైన్ మెంట్ గురించి.


    "కారణం ఏమన్నా కానీ నీ భార్యని హత్య చేయించింది జయచంద్రే అని ఈ పాటికి నువ్వూ గ్రహించి వుంటావు కాబట్టి. ఈ కన్ సైన్ మెంట్ మొత్తం నువ్వు సాధించగలిగితే మన ఇద్దరి పగ తీరినట్టవుతుంది."


    తన పగకిలాంటి ఖరీదు కడుతున్న ఆమె నేర్పుకి తన ప్రతీకార వాంఛని అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్న సోఫియా తెలివికి అభినందనగా చూస్తూ అన్నాడు "జయచంద్ర నా ప్రత్యర్థి అని తెలిసిన నేను నిజానికి తలపడాల్సింది అతడితోనే కాని, ఇలాంటి వ్యవహారంలో తల దూర్చడం అర్థం లేదు."


    "అక్కడే పొరపాటుపడుతున్నావు. కుమార్ దాదా విషయంలో కూడా ఇలాగే తొందరపడ్డావు. చెట్టును సమూలంగా కూల్చగలిగే అవకాశం లేనప్పుడు కొమ్మలతో వేట ప్రారంభించాలి శశీ" ఎనలెటికల్ గా చెప్పుకు పోయింది. "శశాంకా... మొదలు నరకడం అంత సులభమే అయితే ఇంత బలగమున్న నేను ఇన్నాళ్ళూ తాత్సారం చేసేదాన్నా. శాఖోపశాఖలుగా విస్తరించిన ఓ అండర్ వరల్డ్ కింగ్ ని రోడ్డు పట్టించాలీ అంటే ముందు శాఖల్ని కత్తిరించాలి. సేనల్ని దెబ్బతీశాకనే శత్రు రాజు శిరస్సు ఖండించగలిగేది. సేనలంటే - సర్కారులు, కుమార్ దాదాలు కాదు... చీకటి సామ్రాజ్యానికి స్తంభాలుగా మారే ఇలాంటి కన్ సైన్ మెంట్స్... అవును శశీ... లక్షల్లో నష్టాన్ని అనుభవంగా మాత్రమే తీసుకునే 'డాక్స్' కోట్ల నష్టమే ఎదురైతే చచ్చుబడి పోతారు. ఇవే మా గేంగ్స్ కి సంబంధించిన ఆయువు పట్లు..." సోఫియా అంతటితో ఆగిపోలేదు... తన ప్రియుడు రమేష్ ఇలాంటి ఓటమితోనే మతిభ్రమించి ఎలా నాశనమైపోయిందీ, దానికి జయచంద్ర ఎలా కారణమైందీ కూడా సంక్షిప్తంగా చెప్పింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS