గోవిందరాజులు నవ్వాడు.
"పెద్ద వయసు కదమ్మా. తిన్నా ఒంటికి పట్టదు. పడుకుంటే కంటికి నిద్రరాదు. నా ఆశలన్నీ నీమీదనేకదమ్మా. అందుకే నేనింకా బతుకున్నాను నువ్వు ప్లీడరమ్మవయితే నీ దగ్గరే పని చెయ్యాలన్న కోరికతోనే నీ తండ్రి ఇంకా బతికున్నది" అన్నాడు గోవిందరాజులు.
ఆయన మాటలకి అవంతికి గుండెలో చెయ్యిపెట్టి కెలికినట్టయింది.
తనంటే ఎంత ప్రాణం ఆ ముసలి ప్రాణానికి?
గోవిందరాజులు అవంతిని నిశితంగా పరిశీలించి చూశాడు.
అవంతిలో చెప్పలేనంత మార్పు కనబడుతోంది.
బోలెడంత నాగరికంగా కానవస్తోంది.
మనిషి దబ్బపండు ఛాయలో మిలమిలమని మెరుస్తోంది.
ఆమె మెడలోని నెక్లెస్ ని, ఆమె దగ్గరున్న వస్తువుల్ని చూసి కాస్త ఆశ్చర్యం వేసింది ఆయనకి.
తను పంపే సామాన్యమైన మొత్తం హాస్టల్ కి, కాలేజీ ఫీజులకి చాలీ చాలదని ఆయనకి తెలుసు. ఇవన్నీ ఎలా కొన్నదో అర్థంకాలేదాయనకి.
"అమ్మా, ఇవన్నీ ఎక్కడివి!" అడిగాడు.
"నావే నాన్నా" అంది.
తండ్రి వాడి గురించి అడుగుతాడని ఆమెకిముందే తెలుసు. అంచేత ఆయన అడిగితే ఏ విధమైన సమాధానం చెప్పాలో ముందే ఆలోచించిపెట్టుకొంది అవంతి. నమ్మలేనట్టుగా వున్న ఆయన చూపుల్ని చూసి అన్నది అవంతి.
"నీకు చెబితే నువ్వు కోప్పడనంటే చెబుతాను నాన్నా?" అంది.
ఆమె ఏం చెప్పబోతోందో ఆయనకి తెలీదు.
కానీ తెలుసుకోవలసిన అవసరం మాత్రం ఎంతైనా వుంది. కారణం అవంతి ఆడపిల్ల. మహానగరంలో ఒంటరిగా వుంటూ చదువుకొంటున్న విద్యార్థిని అవంతి.
కొన్ని క్షణాలపాటు కూతురుకేసి సావధానంగా చూసి, "చెప్పు, మరేం ఫరవాలేదు. నా బిడ్డ రత్నమని నాకు బాగా తెలుసు. నేను నిన్ను మందలించే పని చేస్తావని నేనెప్పుడూ అనుకోనమ్మా?" అన్నాడు.
అవంతికి ఏడుపొస్తోంది 'ఎంత మంచివాడు తనతండ్రి' అనుకుంది.
"నేను పార్ట్ టైం ఉద్యోగం చేసేదాన్ని నాన్నా? ఇక్కడ నీ పరిస్థితి నాకు పూర్తిగా తెలుసు. ప్రతిదానికీ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టంలేక, నేనక్కడ చిన్న ఉద్యోగం చేసేదాన్ని? అంది.
"ఉద్యోగం చేశావా! ఏమిటమ్మా అది!"
అవంతి తండ్రికేసి చూసింది. తను తండ్రికి అబద్దం చెబుతోంది. అలా చెప్పవలసి వచ్చినందుకు ఆమె గుండె మండిపోతోంది. అబద్దం చెప్పడం అంటే ఆమెకి అసహ్యం. కానీ రేపు తను చెపట్టబోయేవృత్తిలో వృత్తిపరంగా తన క్లయింట్ ని కాపాడేందుకు కొన్ని విషయాలలో కోర్టులలో బొంకక తప్పదు. అది వేరు. కానీ.....
కానీ ఇప్పటి పరిస్థితి వేరు.
నిజాన్ని చెబితే ముసలిప్రాణం ఒక్కసారిగా ఎగిరిపోతుంది.
తండ్రిని దూరం చేసుకుని దిక్కులేనిదానిగా, బతికినన్నాళ్ళూ తను ఒంటరిగా బ్రతకగలదా!
అందుకే అబద్ధం చెపుతోంది.
అదీ ఆయనకు నచ్చే విధంగా చెప్పాలి.
"ఓ పత్రికాఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేశాను నాన్నా? సాయంత్రం నాలుగ్గంటల నించీ, ఏడు గంటల వరకూ పని" అంది.
ఆ మాటల్ని ఆయన విశ్వసించాడు. తృప్తిగా నవ్వాడు. "మంచి పని చేశావమ్మా, ముందు చూపుతో నువ్వు చేసిన పనికి నేను మెచ్చుకుంటున్నానమ్మా. నీ చదువు పాడవకూడదనే కానీ నాకు వేరే విధమయిన ఆంక్షలు లేవు తల్లీ"
మనోహర్ తనకిచ్చిన పర్స్ లో రెండు వేలున్నాయి.
ఆ డబ్బుని తండ్రి చేతిలో పెట్టింది. అంత డబ్బుని ఒక్కసారిగా చేత్తో పట్టుకొని ఎరగడు గోవిందరాజులు.
కూతురు మంచి ప్రయోజకురాలవుతుందన్న నమ్మకం ఆయనకి బలంగా కలిగింది.
"రేపు పరీక్ష పాసయ్యాక బార్ కౌన్సి ల్ కి కట్టడానికి, లైబ్రరీ బుక్స్ కీ కోటు, గౌను అన్నిటికీ కావాలికద నాన్నా? దాని కోసం కొంత డబ్బుని అక్కడే బాంక్ లో వేశాను నాన్నా? మీరు నిశ్చింతగా ఉండండి" అంది.
తన పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకొన్న బిడ్డకావడంచేతనే ముందుచూపుతో అలా ఉద్యోగం చేసి వుంటుందని గోవిందరాజులు నమ్మాడు.
పదిగంటలకు గోవిందరాజులు కోర్టుకి వెళ్ళిపోయాడు.
అవంతికి మాత్రం చాలా బోరుగా వుంది. నగర జీవితానికి అలవాటుపడిన ఆమెకి ఒక్క నిమిషం గడవడంలేదు.
తండ్రిని చూసేనన్న తృప్తి మినహాయించి మరేమీ మిగలలేదు ఆమెకి.
ఆ వూళ్ళో వుండలేనేమో అనిపించింది అవంతికి. కనీసం కాస్సేపు ముచ్చటించేందుకు మరో మనిషి కూడా లేడు.
రమణి, కుసుమ, శ్యామలా ఏం చేస్తున్నారో!
మనోహర్ ప్రతిక్షణం గుర్తుకొస్తున్నాడు.
అతనలా మారతాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
బడలికగా వుండడం చేత మంచంపైన వాలిపోయింది.
నిద్ర రావడంలేదు, ఓ పుస్తకం చేతిలోకి తీసుకొని పడుకొని చదవడం మొదలుపెట్టింది.
గోవిందరాజులు చాలా సంతోషంగా ఉన్నాడు.
భోజనం చేస్తూ చెప్పాడు.
"అందరూ నిన్ను అడుగుతున్నారమ్మా నిన్ను జూనియర్ గా తనకిమ్మంటే తనకిమ్మని పెద్ద ప్లీడర్లు పోటీ పడుతున్నారు" అని.
అవంతి నవ్వింది.
"నిన్ను మా ప్లీడరుగారి దగ్గరికి తీసుకెళతానమ్మా ఇంటి దగ్గర తోచకుండా కూర్చుని ఏం చేస్తావు? కోర్టు తెరిచేలోగా పనికొంత నేర్చుకోవచ్చు"
