"చాలా బాగున్నాయి. కానీ......"
"కానీ గానీ చెప్పకు. బాగున్నాయి అన్నావు. దట్స్ గుడ్......" అంటూ డ్రాయర్ లోంచి చిన్న పెట్టె తీశాడు.
అందులోంచి ఎర్రరాళ్ళ నెక్లెస్ ని తీసి స్వయంగా అవంతి మెడలో పెట్టాడు మనోహర్.
"ఇవన్నీ ఏమిటి మనోహర్" అంది అవంతి.
మనోహర్ అవంతికేసి నిశితంగా చూశాడు.
"ఉన్మాదంలో పడి కొట్టుకుపోతున్న నన్ను కళ్ళు తెరిపించి నన్ను మనిషిని చేశావు. అందుకే నిన్నో చక్కని లాయర్ గా తీర్చిదిద్ది రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను" అన్నాడు.
"నువ్వు నాకు చేయబోయే హెల్ప్ కి తిరిగి నేను రుణం తీర్చుకోలేనని నాకు తెలుసు. మనోహర్ జన్మ జన్మలకీ నీకు రుణపడే వుంటాను నిజం చెప్పాలంటే నీలాంటి స్నేహితుడు నాకు దొరకడం ఏ జన్మలోనో నేను చేసుకొన్న పుణ్యంగా భావిస్తాను. నాకిప్పుడు నిన్ను విడిచి వెళ్ళాలనిపించడం లేదు" అంది.
అతను ఆమె చెక్కిళ్ళని చేతులతో మృదువుగా రాశాడు.
"నిన్నో ప్రశ్న అడగనా?" అన్నాడు.
"అడుగు"
"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?"
అతనడిగిన ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడింది.
"ఏమంటున్నాడతను?"
"ప్రేమ! ప్రేమ!! ప్రేమ!!! తను అతన్ని ప్రేమించడమా? ఓ మనిషిని ప్రేమించాలని కానీ, ఓ మనిషి జీవితంలో చోటు కావాలనికానీ ఏనాడూ తను కోరుకోలేదు.
అతనికేం చెప్పాలి?
"మాట్లాడవే?" అడిగాడు మనోహర్.
"నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు మనోహర్. నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకు వెర్రి అభిమానం. అంతే! ఆ ఇష్టాన్నీ, ఆ వెర్రిఅభిమానాన్ని నువ్వే పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు" అంది.
"గుడ్ ఆన్సర్. సో యూ ఆర్ గోయింగ్ టుడే" అన్నాడు మాట మారుస్తూ.
"ఊ....."
"రిజల్ట్సు రాగానే బయలుదేరిరా. మిగిలిన పనులు పూర్తి చేస్తాను. బై ది బై ఈ పర్స్ అట్టిపెట్టుకో. మళ్ళీ నువ్వు ఇబ్బంది పడకూడదు" అన్నాడు పర్స్ ని ఆమెకి అందిస్తూ.
ఆమె మనసు అతనిపట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది.
మనోహర్ ఓ సారి థియేటర్లోకి వెళ్ళి తన పనులు చూసుకొని వచ్చాడు.
బోయ్ తీసుకొచ్చి అవంతికోసం అతను కొన్న చీరల పాకెట్లు కారులో పెట్టాడు.
హోటల్లో ఇద్దరూ కలిసి భోజనం చేశారు.
తనకోసం అతనంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొంటుంటే అవంతికి గుండెలో ఏదో తియ్యని బాధ కలుగుతోంది.
లైసెన్స్ కూలీ సామానంతా తీసుకెళ్ళి కంపార్టుమెంటులో వుంచాడు.
ప్లాట్ ఫారమ్ మీద అతని పక్కనే నించుంది అవంతి.
రైలు కదలడానికి అట్టే సమయం లేదు. అవంతి భుజంపైన చెయ్యి వేశాడు మనోహర్.
"అనుకొన్నానే కానీ నువ్వు వెళ్ళిపోతుంటే చాలా వెలితిగా ఫీలవుతున్నాను" అన్నాడు.
అవంతి కళ్ళు తడి అయ్యాయి. అతని వేపుకు తిరిగింది. అక్కడ జనం వున్నారన్న సంగతి కూడా విస్మరించి అతని నుదురుపైన ముద్దు పెట్టుకొంది.
రైలెక్కి విండో దగ్గరకొచ్చి కూర్చుంది. అతను ఆమె చేతిపైన చేతిని వేశాడు.
రైలు కదిలింది.
రైలుతోపాటే అతను నడుస్తున్నాడు. తన చేతిపైన వున్న అతని చేతిపైన తన రెండో చేతిని వేసింది అవంతి.
రైలు వేగాన్ని అందుకొంది.
అవంతి చేతిని గాలిలో విసిరింది. అతను ప్లాటు ఫారమ్మీద నడిచి వస్తూనే వున్నాడు.
ఆమె కళ్ళకి అతనింకా మనక మనకగా కనిపిస్తూనే వున్నాడు.
రైలు వేగాన్ని పూర్తిగా అందుకొంది.
అవంతి భారంగా కళ్లు మూసుకుంది.
అతనిలోని అనుభూతిని చెరిగిపోకుండా ఆమె తన గుండెల పైన ముద్ర వేసుకొంది.
కళ్లు విప్పి చూసి చీకట్లో పరుగు తీస్తోన్న రైలుని చూసి.....
"మళ్ళీ ఎప్పుడో?" అనుకొంది. అలా అనుకొన్న ఆ క్షణంలో ఆమె హృదయం సన్నగా మూలిగింది.
27
రిక్షా దిగుతోన్న అవంతిని చూసి గోవిందరాజులు మొహం వికసించింది.
"ఏమ్మా కులాసా కదూ, పరీక్షబాగా రాశావా!" అని అడిగాడు.
"చాలా బాగా రాశాను నాన్నా" అంది అవంతి.
అవంతి లోపలకొచ్చింది.
రిక్షావాడు సామాను లోపల పెట్టగానే వాడికి పర్స్ లోంచి రెండు రూపాయల కాగితాన్ని తీసి అందించింది. అది తీసుకొని వాడు వెళ్ళిపోయాడు
క్రితంసారి చూసిన దానికన్నా తండ్రి బాగా నీరసపడిపోయాడు. అనారోగ్యంతో బాధపడుతోన్న రోగిష్టిలా చెప్పకపోయినా కనిపిస్తున్నాడు.
కళ్ళల్లో ఉంది ప్రాణం. ఆ కళ్ళనించి ఆ ప్రాణం ఎప్పుడెగిరిపోతోందోనన్నట్టుగా ఉంది.
గాలిలో అస్థిపంజరం కదులుతున్నట్టుగా వున్నాడాయన.
అసలా మనిషి తిండి తింటున్నాడా లేదా అన్న అనుమానం కలిగింది అవంతికి.
ఒంటరి జీవి. వేళకి చూసే నా అనే మనిషిలేని వ్యక్తి గోవిందరాజులు.
"నువ్వు చాలా పాడైపోయావు నాన్నా?" అంది దిగులుగా అవంతి.
