Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 47


    ఇద్దరూ షెడ్డుకు చేరుకున్నారు.

 

    డ్రైవర్ తో చెప్పి రెండు కాఫీలు తెమ్మంది. డ్రైవర్ ప్లాస్కులోంచి కాఫీ తెచ్చి పెట్టాడు.

 

    ఇద్దరూ కాఫీ తాగడం ప్రారంభించారు.

 

    "ఈ ప్రాజెక్ట్ పని సాఫీగా జరిగిపోతోంది. తరుణ్ గాడి చావు కబురు వినేస్తే ఇక నన్ను ఇబ్బంది పెట్టే సమస్యే వుండదు" అంది.

 

    తరుణ్ తో ఆమెకున్న వివాదం, అందుకు గణపతిరాజుని నియమించడం అన్నీ ఆ సమయంలో గుర్తొచ్చాయి ఆయనకి.

 

    "ఇంకా పనికాలేదా?"

 

    "లేదు. వాడు విషయం తెలిసి పారిపోయాడు"

 

    "ఎక్కడున్నాడో తెలిసిందా?"

 

    "ఆఁ! నిన్న రాత్రే గణపతిరాజు ఫోన్ చేశాడు విమలాబాయి ఆశ్రమంలో వున్నాడట వాడు"

 

    "మరిక ఏమిటి ఆలస్యం?"

 

    "ఆడపిల్లల సదన్ లో రహస్యంగా వున్నాడట - ఈరోజో రేపో పని పూర్తి చేస్తానని, డబ్బు రెడీగా వుంచమని ఫోన్ చేశాడు" అన్నది ఆమె.

 

    "అంతా రహస్యంగానే జరుగుతోందా?"

 

    "ఆఁ!"

 

    "తరుణ్ తో నీకు వివాదమున్న విషయం టౌన్లో కొందరికయినా తెలుసా?" అడిగాడు దాసు.

 

    "తెలుసనుకుంటాను! పేపర్లో నా మీద వ్యాసం రాశాడు గదా! మొదట్లో పోలీసులకి చెప్పి వాడి భరతం పడదామనుకున్నాడు. కానీ అలా చేయడానికి కొంత యిబ్బంది వుంది. ఆ తర్వాత గణపతిరాజుకు పని అప్పజెప్పాను. అతనేమో యింకా...."      

 

    ఆమె ఏదో చెప్పుకుపోతోంది. దాసు అక్కడితో ఆగిపోయాడు. సరితాదేవి అడ్డు ఎలా తొలగించుకోవాలో ఆయనకి

తెలిసిపోయింది.

 

    తనమీదకి అనుమానం రాకుండా ఎలా పని ముగించాలో ఫ్లాష్ అయింది. ఆయన ఉత్సాహంగా ఆమెని చూసి నవ్వాడు.

 

                              *    *    *    *    *

 

    ఉదయాన్నే నిద్రలేచాడు గణపతిరాజు. ఆశ్రమమంతా తిరిగి ఏది ఎక్కడుందో తెలుసుకున్నాడు.

 

    ఆశ్రమంలో భయాందోళనలను కలిగిస్తే అందరూ దిక్కు తోచకుండా బయటికి పరిగెడతారు. ఆ సమయంలో తరుణ్ కూడా వస్తాడు. అప్పుడు అటాక్ చేస్తే తప్పించుకునే అవకాశం వుండదు. కత్తులతో రెండు మూడు పోట్లు పొడిస్తే తరుణ్ హరీమంటాడు. సరితాదేవి ఇస్తానన్న డబ్బు తీసుకుని ఈ కేసు చప్పబడేవరకూ ఎటైనా చెక్కేయాలి. ఇదీ అతని ప్లాన్. 

 

    తరుణ్ ని చంపడానికి సాయంకాలమైతే అనువుగా వుంటుంది. గందరగోళంలో అందరూ వున్నప్పుడు తను పని ముగించేయచ్చు. అంత వరకూ తన ప్లాన్ ని అమలు చేసేందుకు చుట్టుపక్కల పరిసరాల గురించి తెలుసుకోవాలని అతను బయల్దేరాడు.  

 

    ముందుగా వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతడు ఊహించినదానికంటే ఎక్కువమందే వున్నారు. వీళ్ళంతా భయంతో బయటికి పరిగెడితే, ఆ గందరగోళంలో ఒక మర్డర్ ఏమిటి రెండు మూడు మర్డర్లు చేసినా తెలుసుకునే నాధుడు వుండడు.

 

    వృద్ధుల ఆశ్రమం మొదట ఓ వృద్ధుడు కుర్చీలో కూర్చుని ఏవో పుస్తకాలను చూస్తున్నాడు. ఆయన అక్కడ ఇన్ ఛార్జ్.

 

    "బావున్నారా?" అంటూ రెండు చేతులూ జోడించాడు గణపతిరాజు.

 

    ఆ వినయానికి ఎంతో మురిసిపోయిన ఆ వృద్ధుడు సగం లేచి - "రండి - రండి అంటూ ఆహ్వానించాడు.

 

    గణపతిరాజు గత కొన్నిరోజులుగా అక్కడ వుండబట్టి వాళ్ళిద్దరికీ ముఖ పరిచయం వుంది.

 

    గణపతిరాజు ఆయనకెదురుగా వున్న మరో కుర్చీలో కూర్చున్నాడు.

 

    "అంతా సౌకర్యంగా వుందా?" ఆ వృద్ధుడు అడిగాడు.

 

    "ఆఁ! అంతా బావుండబట్టే కదా యిక్కడ తిష్ట వేశాం"   

 

    "ఈ ఆశ్రమ వాతావరణం అలాంటిది. ఎవర్నీ కదలనివ్వదు" అన్నాడు ఆయన.

 

    "అవునండీ! బయట వాహనాల రొదతో, శబ్దాలతో  నిండిపోయిన టౌన్ లలో వుండి వుండి విసిగిపోయిన నాలాంటివాడికి ఇక్కడ స్వర్గంలో వున్నట్లుగా వుంది" ఎవరితో ఎలా మాట్లాడాలో గణపతిరాజుకి వెన్నతో పెట్టిన విద్య.

 

    "అంతా విమలాబాయి కృషి"

 

    "ఇలాంటి ఆశ్రమాల్లో కూడా ఎన్నో జరిగిపోతున్నట్లు మనం పేపరులో చదువుతూనే వున్నాం కదా! ఇక్కడ అలాంటి సమస్యలు ఏవీ వున్నట్టు లేదు" అటూ ఇటూ చూస్తూ తన సందేహం వెలిబుచ్చాడు.

 

    "ఆ సర్వేశ్వరుడి దయవల్ల అంతా ప్రశాంతంగా వుంది" అన్నాడు ఆ వృద్ధుడు.

 

    "పోనీలెండి. అదే కావలసింది. ఆశ్రమాలల్లో కూడా బాంబులు, బరిశెలు పెడుతున్నారట - ఎవరికీ అనుమానం రాదని"

 

    "బాంబులా?" ఆ వృద్ధుడు భయంగా అడిగాడు.

 

    "ఆఁ బాంబులే. ఇక్కడున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏవయినా అనుమానంగా వున్న వస్తువులు కనబడితే ముట్టుకోవద్దని మీ వృద్ధులందరికీ చెప్పండి"

 

    వృద్ధుడు ఆలోచనలో పడిపోయాడు.

 

    జాగ్రత్తగా వుంటే మంచిదనిపించింది.

 

    అందుకే సెక్యూరిటీ చూసే వృద్ధుల్ని పిలిచి ఈ విషయం అందరికీ తెలియజేయమన్నాడు.  

 

    "ఆశ్రమాల్లో కూడా బాంబులు పెడుతున్నారట. జాగ్రత్తగా వుండమమనండి మనవాళ్ళని. ట్రాన్సిస్టర్ లాంటివి కనపడితే వెంటనే తెలియజేయమనండి"

 

    సెక్యూరిటీవాళ్ళు ఈ సంగతిని అందరికీ చెప్పడం ప్రారంభించారు.

 

    తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి అక్కడ్నుంచి లేచాడు గణపతిరాజు.

 

    బాంబుకంటే ప్రమాదకరమైంది భయం. తను వత్తి వెలిగించాడు. సాయంకాలానికి పేలిపోతుంది.

 

    అప్పుడే వృద్ధుల్లో కలకలం బయల్దేరింది.

 

    గణపతిరాజు బయల్దేరడాన్ని చూసి ఇన్ చార్జ్ అన్నాడు "అప్పుడే వెళ్ళి పోతున్నారేమిటి బాబూ? మరికాసేపు కూర్చోండి"

 

    "లేదండీ - అలా వెళ్ళొస్తాను. అనాథ మహిళా సదన్ ఇన్ ఛార్జ్ ఎవరు?" అనడిగాడు.

 

    "మౌనిక అనే అమ్మాయి బాబూ! చాలా మంచి అమ్మాయి" చెప్పాడాయన.

 

    "అక్కడ ఈ మధ్య ఎవరికయినా పాము కరిచిందా?"

 

    "నాకంత సరిగ్గా తెలియదుగానీ మౌనికనే పాము కరిచిందని విన్నాను"

 

    అంటే తన ఊహ కరక్టేనన్న మాట.

 

    తరుణ్ ఖచ్చితంగా యిక్కడే వున్నాడన్నది స్పష్టమైపోయింది గణపతిరాజుకి.

 

    తరుణ్ అనాథ మహిళాసదన్ లోనే రహస్యంగా వుండి వుండచ్చు. ఏదేమయినా సాయంకాలానికి అతన్ని బయటకి రప్పించాలి. గణపతిరాజు అక్కడ్నుంచి కదిలాడు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS