Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 46


    మొత్తం వంద ఎకరాలు. రోడ్డు నుంచి కిలోమీటరు దూరం లోపలికి పోగానే కేంద్రం ప్రారంభమవుతుంది.

 

    చుట్టూ ఫెన్సింగ్ పూర్తయింది.

 

    నేలకూడా కుంకుమలాగా ఎర్రగా వుంది. అక్కడున్న చెట్టూ చేమనంతా నరికించింది సరితాదేవి. రోజూ నలభైమంది పనిచేస్తున్నారు.

 

    "మొత్తం చదునైపోయింది. ల్యాండ్ చాలా సారవంతమైంది. మామిడితోటలు, జామచెట్లు, సపోటా చెట్లు లాంటివి బాగా పెరుగుతాయి" అంది సరితాదేవి వర్క్ జరుగుతున్న స్పాట్ వైపుకి నడుస్తూ.

 

    పరమేశదాసు ఏమీ మాట్లాడలేకపోయాడు. తన కష్టాన్ని వేరేవాళ్లు లాక్కుపోయినంతగా గిజగిజలాడిపోయాడు.

 

    అయితే ఇవేమీ ఆయన ముఖంలో ప్రదర్శించలేదు. అందుకే ఆయన రాజకీయాల్లో ఎదురు లేకుండా పోయింది.

 

    సరితాదేవి వైపు నవ్వుతూ చూస్తూ "కుంకుమలాగా వుంది నేల. విత్తనం వేస్తే చెట్టు అయిపోయేంత సారవంతమైంది" అన్నాడు.

 

    సరితాదేవి పొంగిపోయింది.

 

    రైతుకూలీలు గుంతలు తవ్వి మామిడిచెట్లు నాటుతున్నారు.

 

    "అన్నీ బానిస్ చెట్లే. బెంగళూరు నుంచి తెప్పించాను"

 

    "డబ్బు బాగా సెలవవుతున్నట్లుంది"  

 

    "ఆఁ ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటును రిలీజ్ చేయించుకున్నాను. వాళ్ళ ప్రకారం రైతుకి శిక్షణా కాలంలో రోజుకు ఏభై రూపాయలివ్వాలి. కానీ ఇక్కడ రైతులు కూడా చీప్ గానే దొరుకుతున్నారు. రోజుకు ముప్ఫైయిస్తున్నాను." అన్నది.

 

    "సెహభాష్" దాసు మెచ్చుకున్నాడు.

 

    షెడ్లోకెళ్ళి ఇద్దరూ కూర్చున్నారు.

 

    సైట్ మేనేజర్లు వచ్చి మొత్తం వర్క్ ను గురించి చెప్పి వెళ్ళిపోయారు.

 

    ఆ తరువాత మ్యాప్ లో ఏయే బిల్డింగులు ఎక్కడ వస్తాయో, ఏయే ప్లేసుల్లో ఏయే తోటలను పెంచాలనుకుంటుందో మొత్తం వివరించింది ఆమె.

 

    అదంతా వింటుంటే దాసు కడుపులో దేవినట్లనిపించింది. మొత్తం వంద ఎకరాల తోటలు. నిజానికి సరితాదేవి సేవాసదన్ కి ఆ భూమిని ప్రభుత్వం కేటాయించడానికి చాలానే కష్టపడ్డాడు దాసు.

 

    రైతు శిక్షణా కేంద్రంగా దానికి రూపుదిద్ది, దానికి గ్రాంట్లు మజూరు కావడానికి తన పరపతినంతా వుపయోగించాడు.

 

    సరితాదేవి సగం భాగం యిచ్చివుంటే ఆయనకి పేచీ వుండేది కాదు.

 

    ఎప్పుడైతే ఆమె ఈ ప్రపోజల్ కు తిరస్కరించిందో అప్పట్నుంచీ ఆయనకి సరితాదేవిని అడ్డు తొలగించుకుని మొత్తం ఆ భూమినంతా కొట్టెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు.

 

    ఈ ద్వేషం మరోసారి మనసంతా మసిలాగా అల్లుకోవడంతో రాత్రుల్లో ఆమె ఇచ్చే సుఖం కూడా గుర్తులేదు. ఆమె తనపట్ల చూపిస్తున్న అభిమానం నటనలా తోస్తోంది.

 

    "ఈ వర్క్ కిక ఢోకా లేదు. ఫండ్స్ వున్నాయి గనుక పనులు జరిగిపోతాయి" అంది సరితాదేవి మ్యాప్ మూస్తూ.

 

    ఇద్దరూ అక్కడ నుంచి లేచారు. ఒక దగ్గర ఆఫీసు బిల్డింగ్ కోసం పునాదులు తీస్తున్నారు. అక్కడికివెళ్ళి నిలుచున్నారు.

 

    "ఇది ఆఫీస్ కోసం. త్వరలోనే బిల్డింగ్ పూర్తిచేసి స్టాఫ్ ను ఏర్పాటు చేస్తాను"

 

    ప్రతి పనికోసం తనను సంప్రదించే సరితాదేవి ఇప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటోందని గ్రహించాడు దాసు. త్వరలోనే ఆమె తన చేతిలోంచి ఎగిరిపోతుందనిపించింది.

 

    అక్కడున్న మేస్త్రీ వాళ్ళను చూసి నమస్కారంపెట్టి దగ్గరికి వచ్చాడు.

 

    "ఏం సూరీ! వర్క్ బాగా జరుగుతోందా?" అని అడిగింది ఆమె.

 

    "బాగా జరుగుతోందండీ! త్వరలోనే పిల్లర్లు లేపే పని ప్రారంభించవచ్చు"

 

    సరితాదేవి సంతృప్తిగా తలాడించింది.

 

    "ఆఫీస్ బిల్డింగ్ పనులు పూర్తికాగానే శిక్షణాకేంద్రానికి అవసరమైన బిల్డింగ్ లు కడతాను" అంది పరమేశదాసు వైపు తిరిగి.

 

    కనీసం మాటల్లో కూడా తనను కలుపుకోవడం లేదన్న విషయాన్ని ఆయన గ్రహించాడు. ఇది మొత్తం తనకే చెందుతుందన్న భావాన్ని ఆమె ఏమీ జంకు లేకుండా బయటపెడుతోంది.    

 


    "ఓపెనింగ్ సెర్మనీకి ఎవర్ని పిలవాలా అని ఆలోచిస్తున్నాను. ముఖ్యమంత్రి, గవర్నర్ ర్యాంక్ లాంటి వాళ్ళను పిలవాలనుంది" అంది సరితాదేవి అక్కడ్నుంచి కదులుతూ.

 

    అంటే ఓపెనింగ్ కు కూడా తనని ఆహ్వానించడం లేదు. ఇక లాభం లేదు. ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకున్నాడు దాసు. అయితే అదంత ఈజీ పని కాదు. తనకీ, ఆమెకీ వున్న సంబంధం అందరికీ తెలుసు గనుక మొదటి అనుమానం తనమీదకే వస్తుంది అలాంటి అనుమానం పుడితే చాలు ఇక ప్రతిపక్షాలు, స్వపక్షంలోనే వున్న విరోధులు తనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభిస్తారు. అందువల్లే తనమీదకి అనుమానం రాకుండా పని ఫినిష్ చేయాలనుకున్నాడు.

 

    "నేను అదేపనిగా మాట్లాడుతుంటే మీరేమిటి మౌనంగా వున్నారు?" అని అడిగింది సరితాదేవి ఆయనవైపు చూస్తూ.

 

    ఇద్దరూ తిరిగి షెడ్డు వైపు నడుస్తున్నారు.

 

    "ఏదో ఆలోచన - అంతే!"

 

    ఏమిటా ఆలోచన అని ఆమె అడగలేదు. దాసు ఆ పొలం చూడగానే ఇది తనకు దక్కనందుకు ఫీల్ అవుతాడని ఆమెకు తెలుసు. మొదట ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ కాగానే దాసు మాట్లాడిన మాటల్లోని అంతర్యాన్ని ఆమె గ్రహించింది. కానీ వంద ఎకరాల్లో భాగం పంచుకోవడానికి ఆమెకీ మనసొప్పలేదు. వంద ఎకరాల ఎస్టేట్ ని మెయిన్ టైన్ చేయాలన్నది ఆమె కోరిక. అదిప్పటికి తీరింది.  

 

    ఈ ప్రాజెక్ట్ తనకి రావడానికి దాసుతోపాటు ఆమె కూడా చాలా కష్టపడింది.

 

    కేంద్రప్రభుత్వానికి సంబంధించి వచ్చినవారికి సకల సదుపాయాలను ఆమె ఏర్పాటు చేసింది. వాళ్ళని మంచి హోటళ్ళలో దింపింది. వాళ్ళు మత్తులో మునిగి ఏం కావాలంటే దాన్ని ఏర్పాటు చేసింది.    

 

    ఇదంతా దాసుకు ఆమె ఏనాడూ చెప్పలేదు. ఆయనకి మంచి మూడ్ లో వున్నప్పుడు దీనికోసం గట్టిగా ప్రయత్నించమని చెప్పింది. అతని పరపతితోనే ప్రాజెక్టు వచ్చింది. అయితే ఇందులో భాగం ఇవ్వడానికి మాత్రం ఆమెకి సుతరామూ ఇష్టం లేదు. అయితే ఇందుకు తన తన ప్రాణాన్నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుందని ఆమె వూహించలేకపోయింది.

 

    దాసు అంత దారుణంగా ఆలోచిస్తాడని ఆమె కలలో కూడా అనుమానించలేదు. దానికి కారణం ఆయన్ని అచ్చు భర్తలాగా ట్రీట్ చేసింది. కట్టుకున్న వాడ్ని సైతం బయట పడుకోబెట్టి తను ఆయనతో బెడ్ రూంను పంచుకుంది. అలా మొత్తం తనని తాను అర్పించుకున్న తర్వాత తన మీద ఎంతో కొంత అభిమానం వుంటుందనే ఆమె నమ్మింది.

 

    తనకు లాభం వస్తుందంటే ఎంతటి కిరాతకానికైనా వెనకాడని రాజకీయ నాయకుడు ఆయన అని వూహించలేకపోయింది.

 

    అందుకే ఇప్పటికీ ఆయనతో ఫ్రీగానే వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS