అతను అనాథ మహిళా సదన్ దగ్గరికి వచ్చేటప్పటికి సభా మందిరం నుంచి అమ్మాయిలు తమ నివాసానికి వస్తున్నారు. ఇక అక్కడ వుండడం శ్రేయస్కరం కాదనిపించి వారు గమనించడానికి వీల్లేకుండా తల వంచుకుని తన గదికేసి నడిచాడు.
అమ్మాయిలందరూ గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. వాళ్ళలో మౌనిక కూడా వుంది. ఆమెకిప్పుడు నయమైపోయింది. పాము కరిచిన ఛాయలు కూడా లేవు. ఆమె గణపతిరాజును చూసిందిగానీ చాలా దూరంలో అతను నడుస్తూ పోతుండడం వల్ల ఖచ్చితంగా పోల్చుకోలేకపోయింది. అయినా అనుమానం పోలేదు. కంగారు కంగారుగా లోపలికి వెళ్లింది.
తరుణ్ స్నానాదులు ముగించుకుని పేపర్ చదువుతున్నాడు. ఆ రోజునుంచి మహిళాసదన్ కి దినపత్రిక వేసే ఏర్పాట్లు చేయమన్నాడు పూసల వ్యాపారి శేఖర్ ని.
అతను అరేంజ్ చేశాడు.
ఉదయాన్నే పేపర్ వేశాడు పేపర్ బోయ్. దినపత్రికను తెప్పిస్తున్నట్లు అంతక్రితం రోజే అమ్మాయిలకు చెప్పాడు తరుణ్.
"మనం ప్రపంచంలో వుంటూ, దాన్ని గురించి పట్టనట్లు నాలుగుగోడలకే పరిమితమవడం దారుణం. మన చుట్టూ ఏం జరుగుతూ వుందో తెలుసుకోవాలి. సంఘంలో జరుగుతున్న మార్పుల్ని తెలుసుకోవాలి. ఏదైనా మంచి మార్పు వస్తే, ఆ మార్పు కోసం మనమేమీ పోరాటం చేయకపోయినా కనీసం ఆ మార్పుని హృదయపూర్వకంగా ఆహ్వానించే విధంగానయినా వుండాలి. ఈ మాత్రం కూడా మనం బిహేవ్ చేయకపోతే సంఘంలో మన ధర్మాన్ని నిర్వర్తించనట్టే లెక్క.
మార్పుని మనం హేపీగా ఆహ్వానించాలంటే ముందు వాటిని గురించి తెలుసుకోవాలి. అందుకే ఈరోజు నుంచి మహిళాసదన్ కి దినపత్రిక వస్తుంది. అందరూ మస్ట్ గా చదవాలి. త్వరలోనే టీవీని కూడా ఏర్పాటు చేయమని చెప్పాను"
టీవీ అనేటప్పటికి అమ్మాయిల ముఖాలన్నీ వికసించాయి. సినిమా చూసినప్పట్నుంచీ ఆ ఆకర్షణ మొదలయింది వాళ్ళలో.
"టీవికయ్యే ఖర్చు, డైలీ పేపర్ కోసం అయ్యే ఖర్చు శేఖర్ ముందే యిచ్చినా మీరు పూసలు కుట్టి వాడి అప్పును అణాపైసలతో సహా కట్టేయాలి" అన్నాడు తరుణ్.
"కడతాం" అరిచింది శృతి.
"పూసలు కుట్టడం మాత్రం మీరు మానకూడదు. నేనిక్కడున్నా లేకపోయినా పూసల కుర్రాడు వస్తుంటాడు. మీకు ఏం కావాలన్నా వాడే తెచ్చిస్తుంటాడు" అని ముగించాడు.
ఇప్పుడు తరుణ్ చదువుతున్నది మహిళాసదన్ పేరు మీద వచ్చిన పేపర్ నే.
నిన్న రాత్రి తరుణ్ అలా చెప్పినప్పట్నుంచీ మౌనిక మూఢీగా వుండిపోయింది.
మాటల మధ్యన అన్నా అతను వెళ్ళిపోవడాన్ని ఆమె వూహించుకోలేకపోతోంది. అతను వెళ్ళిపోతే ఏర్పడే శూన్యాన్ని ఎలా భర్తీ చేయడం?
అవన్నీ ఆమె మనసులోనే దాచుకుంది తప్ప అతనితో అనలేదు.
"పేపర్ చదువుతున్నారా?" అంటూ పలకరించింది మౌనిక.
"ఆఁ ఇది మీ పేపరే. మీరు చదవండి" అంటూ ఆమె చేతికందించాడు.
ఆమె పేపర్ అటూ ఇటూ తిప్పుతోంది.
"ఎందుకు మళ్ళీ ఈ ప్రపంచంలోకి లాగుతున్నారు మమ్మల్ని?"
"మీరూ మనుషులు కాబట్టి. ఎప్పుడో ఏదో అయినంత మాత్రాన ఇక జీవచ్ఛవాలుగా బతకాలనుకోవడం దారుణం. మనం నడుస్తున్న దారిలో ఏదయినా అడ్డం వచ్చినప్పుడు నడక ఆపేస్తామా? అడ్డు తొలగించుకుని ముందుకుపోతాం. అలానే మీరూ పయనించాలని నా కోరిక" అన్నాడు తరుణ్.
ఆమె నిర్మలంగా అతని కళ్ళలోకి చూస్తోంది.
దేవుడూ, దెయ్యం మీద నమ్మకం లేదు. స్వర్గనరకాలను అసలు నమ్మనే నమ్మడు. పాపపుణ్యాల మీద ఆసక్తి లేదు. కేవలం సాటి మనిషి మీద ప్రేమ అంతే. స్వర్గనరకాలను వూహించుకుని ఎదుటి వ్యక్తికి సహాయపడడం కన్నా కేవలం మనుషుల మీద ప్రేమతో సేవ చేయటం నిజంగా గొప్ప విషయమే. ఆ సమయంలో అతను ఎంతో ఉన్నతుడుగా కనిపించాడామెకి.
"నేను వెళ్ళిపోయినా మీరు ఈ మార్గం నుంచి మరలిపోకూడదు. మీ అమ్మాయిల్నంతా మీరే మెయిన్ టెయిన్ చేయాలి"
ఆ మాటలకే ఆమె చలించిపోయినట్లు చిన్న జర్క్ యిచ్చింది. "మీరు వెళ్ళిపోతే మేం తట్టుకోగలమా? మీరుంటే కొండంత అండ" అంది మెల్లగా అతని కళ్ళల్లోకి చూస్తూ.
"ఎప్పుడూ ఎవరిమీదా ఆధారపడకూడదు. మనకు మనమే ఇన్స్ పిరేషన్. అలానే మన ఆశయాలూ, ఆశలూ కూడా" అన్నాడు తరుణ్.
"మీరు వెళ్ళిపోతారంటేనే మనసంతా బాధగా వుంటోంది" ఈసారి కళ్ళు దించుకుంది.
"నేనెక్కడికి వెళతాను మౌనికా! నేను మీవాడ్ని. నేనిక్కడ్నుంచి వెళ్ళిపోయినా నా మనసంతా యిక్కడే వుంటుంది" అన్నాడు.
"కానీ మిమ్మల్ని వెంబడిస్తున్న ప్రమాదం - అది తల్చుకుంటేనే ఊపిరాడదు" అంది.
ఆ మాటలంటున్నప్పుడే ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు వూరాయి.
అతనికి ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు. అందుకే దగ్గరికి వెళ్ళి తన చేతులతో ఆమె కన్నీళ్ళను సుతారంగా తుడుస్తూ వుండిపోయాడు.
మనసులోని ఉద్వేగాన్ని అణుచుకోలేక "మీరు క్షేమంగా వుండాలి" అని అతని రెండు చేతుల్నీ తన బుగ్గలపై అదిమి పట్టుకుంది.
"నాకేమీ కాదు మౌనికా. అనవసరంగా భయపడకు" అని చిన్న పిల్లని బుజ్జగిస్తున్నట్లు తలమీద చిన్నగా తడుతూ వుండిపోయాడు.
అప్పటికి ఆమె దుఃఖం తగ్గింది. తను అంతవరకూ అతని చేతులు పట్టుకుని వున్న విషయం గుర్తొచ్చి తన చేతుల్ని తప్పించింది. అతను తిరిగి ఆమెకు దూరంగా జరిగి కూర్చున్నాడు. ఆమెను ఆ ఫీలింగ్ నుంచి తప్పించడానికి టాపిక్ మార్చాడు.
సభామందిరం నుంచి వచ్చాక అమ్మాయిలంతా కొంతసేపు పేపర్ చదివి, పూసలు కుట్టడం ప్రారంభించారు. సాయంకాలమైంది.
మౌనిక తయారై సభామందిరానికి వెళ్ళింది. అమ్మాయిలంతా రావడం ప్రారంభించారు. అందరూ వచ్చాక విమలాబాయి ఉపన్యాసం మొదలైంది.
అలానే గణపతిరాజు కూడా తన పథకాన్ని అమలుచేయడం ప్రారంభించారు. తన అసిస్టెంట్లకు ఏం చేయాలో చెప్పి అతను వృద్ధుల భవనానికి వచ్చాడు.
తోటల్లో పని ముగించుకుని వృద్ధులు వస్తున్నారు. వంటవాళ్లు వంటలు చేయడానికి ఉపక్రమిస్తున్నారు.
గణపతిరాజు వెళ్ళి ఇన్ ఛార్జ్ ముందు కూర్చున్నాడు.
"బాంబుల విషయం అందరికీ చెప్పారా?"
"ఆఁ చెప్పానండీ! ఏదైనా అనుమానం వస్తే వెంటనే తెలియజేయమన్నాను. మీ అనుమానం కాకపోతే ఆశ్రమంలో బాంబులు ఎవరు పెడతారు?" అన్నాడు ఆయన నింపాదిగా.
