"ఇది నా గుర్తుగా దానికి ఇచ్చానని చెప్పవే గాయత్రీ! దీనిలో వజ్రం ఎలా మెరుస్తుందో దాని జీవితం అలా మెరవాలని చెప్పు" అంది.
రైలు బయలుదేరింది!
అయిదు కార్లలో పెద్ద పటాలాన్ని వెంటపెట్టుకుని అక్క బావలకు స్వాగతం చెప్పేందుకు రైలు స్టేషన్ కి వచ్చింది ఆమని!
కంపార్టుమెంటులోంచి దిగగానే ఎదురువెళ్ళి గాయత్రిని కావిలించుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది.
బావగారి భుజాలు రెండు పట్టుకుని కుదిపేసింది.
"బాగా మారిపోయారే బావగారూ! లావైపోయారు. బుగ్గలు కూడా పొంగాయి. ఈ మరదలుగారి మాట వినకపోతే వచ్చే కష్టాలేమిటో బాగా గుర్తించారన్నమాట! అక్కగారిని అలాగే వుంచేసి మీరు స్టౌట్ అయిపోతున్నారు" అంది.
"నువ్వు మాత్రం రవంత అయినా మారలేదు ఆమనీ!" అన్నాడు ఆర్ధ్రమయిన కంఠస్వరంతో. డాక్టర్ చక్రవర్తిలో అక్కినేనిలా వున్న అతని వంక రెప్పవాల్చకుండా చూస్తున్నారు బెటాలియన్ సభ్యులైన హాస్టల్ అమ్మాయిలు.
"మా బావగారికి దిష్టి పెట్టేయకండి. వెడదాం పదండి!" అంది ఆమని.
అపార్టుమెంట్స్ అంతా అలంకారాలు చేయించింది. స్వాగత తోరణాలు కట్టించింది.
పోర్షన్ లోపల క్రొత్త రంగులు, క్రొత్త దీపాలు, క్రొత్త ఫర్నీచర్! ఆ స్వాగతం ఏర్పాట్లు చూచి అదిరిపోయాడు వాల్మీకి.
"ఈ పిచ్చిపిల్ల మనసులో మనమీద ఎంత ప్రేమ ఉందో చూచావా గాయత్రీ!" అన్నాడు.
"మా శరీరాలు వేరు కాని ప్రాణం ఒక్కటే" అంది గాయత్రి గర్వంగా!
"ఈ ఏర్పాట్లు అన్నీ నీకోసం అన్నమాట? అయితే నాకోసం కాదన్నమాట?"
"ఎందుకు కాదు? దాని మనసులో ప్రేమ అనే అమృతకలశం ఉంది. అదంతా మన ఇద్దరికోసం! ఎంత త్రాగినా తనివి తీరని అమృతం ఆమని మనసు!"
"ఇంత గొప్ప చెల్లెలు ఉన్నందుకు నిన్ను అభినందిస్తున్నాను గాయత్రీ!"
"అంత గొప్ప మరదలు ఉన్నందుకు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను"
"ఇలాంటి అమృతమూర్తిని సృష్టి చేసిన ఆ బ్రహ్మని మనం అభినందించాలి!"
చాలా ఘనమయిన స్వాగతం పార్టీ యిచ్చింది ఆమని!
స్నేహితులందరూ వెళ్ళిపోయారు.
"మీరు వస్తున్నారంటే ప్రాణం లేచి వచ్చింది అక్కా!"
"అర్ధమవుతూనే ఉందిలే! ఎంత ఖర్చు పెట్టవేమిటి?"
"డబ్బుతో ప్రేమని కొలుస్తావా?"
"కొలవటం కాదు. ఎప్పుడూ డబ్బు కావాలని అడగవు కదా!"
అపార్టుమెంట్స్ మీద నెలకు పదిహేనువేలు వస్తోంది. అంత డబ్బు నేనెలా ఖర్చు పెడతాను? అసలు డబ్బు ఖర్చు చేయటానికి టైము చాలదు. డబ్బు ఖర్చు పెట్టేవారు ఎక్కువగా నష్టపోయేది డబ్బుని కాదు. సమయాన్ని!
విలాసంగా డబ్బు ఖర్చు చేయాలంటే అందుకోసం సమయాన్ని కూడా ఖర్చు పెట్టుకోవాలి! నాకు చదువులతో సరిపోతుంది!
ఎప్పుడయినా యిలాగే ఖర్చుపెట్టే అవకాశం దొరికితే లక్ష్మీదేవి మీద కోపం ఉన్నదాన్లా ఖర్చు పెట్టేస్తా! వచ్చే ఆదాయంలో నువ్వు కూడా సగం వాటాదారువి. అడిగావు కనుక చెప్తున్నా!
మీకు స్వాగతం చెప్పేందుకు పాతికవేలు ఖర్చుపెట్టా! తప్పంటావా?" అంది.
"తప్పే అంటాను. ఆ పాతికవేలు బ్యాంక్ లో వేసుకుంటే నీకు మరో అవకాశానికి ఉపయోగపడేవి కదా అంటాను.
అయినా సామాన్యులం. నిన్ను చూడాలని వచ్చిన దాన్ని మాకోసం ఎందుకూ ఈ ఆర్భాటం అంతా?" అంది గాయత్రి.
"అయితే నీకోసం పెట్టలేదులే! మా బావగారి కోసం పెట్టుకున్నాను." అంది ఆమని, వాల్మీకి అందంగా నవ్వాడు.
"అయాం ప్రౌడాఫ్ యూ ఆమనీ!" అన్నాడు.
"నువ్వే పీనాసి పేరమ్మవి, బావగారే మంచివారు! ఎప్పుడూ నన్ను సపోర్టు చేస్తారు. అమ్మ నాకేం పంపించారు?" అని అడిగింది ఆమని.
"నువ్వు భవిష్యత్తులో వజ్రంలా మెరిసిపోవాలట! అందుకే నీకోసం ఒక డైమండ్ రింగ్ పంపించారు" అంటూ దాన్ని వ్రేలికి తొడిగింది గాయత్రి!
ధగ ధగ లాడుతున్న డైమండ్ వంక మురిపెంగా చూచుకుంది, తల్లి గురించిన ఆలోచనలు మనసు మీద ముసురుతున్నాయి.
"అక్కా! వజ్రం చేతికి దొరికితే దాన్ని మరింతగా మెరిపించాలని దాన్ని చెక్కుతారు. క్రొత్త కోణాలు సృష్టించాలని ఆకురాయితో రాస్తారు. సాన పట్టందే వజ్రం మెరవదు. అందుకే దాన్ని అందరూ బాధిస్తారు. రాపిడి పెట్టిన కొద్దీ మెరిసే వజ్రంలా అవుతుందా నా జీవితం?" అంది ఆమని.
"అది కాదులే! రాళ్ళలో రత్నంలా నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె అభిలాష, ఏ తల్లి అయినా బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు.
పది మందిలో మెరుపులా మెరవాలను కుంటారు. అంతా కష్టపడాలని కోరుకుంటారా? అప్పుడప్పుడు ఇంటికి రావటం మాట్లాడి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉంటే ఇలాంటి దిగుళ్ళు మనసులో ఉండవు.
కాని నువ్వేమో తొంగిచూస్తే అరిగిపోతానను కుంటావు అని నిష్టూరం వేసింది.
"ఎలా తొంగి చూస్తుంది కలెక్టర్ గారు అయిం తరువాత వస్తుంది. అందుకోసం ఆ తల్లి కళ్ళుకాయలు కాచేలాగ చూస్తోంది.
చెల్లిగారేమో రాత్రింబవళ్ళు కృషిచేస్తున్నారు.
"అంతా గొప్పవాళ్ళయిపోతారు. మనం ఇలాగే వుంటాం అన్నాడు వాల్మీకి.
"బావగారూ! అక్కగారికి విశేషాలేమీ లేదా?" ఏమీ తెలియనట్టు అడిగింది ఆమని!
"ఈ ప్రశ్న ఆడవాసన వేస్తోంది! అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకోవడం మంచిది."
గాయత్రి ముఖంలో మార్పులు వచ్చాయి.
పిల్లలు కలిగే సూచన లేకపోవడంతో కొంత బాధ వుంటుంది. కాని అంత బాధ ఎందుకు కలిగిందో జరిగిన అవమానం గురించి తెలియని వాల్మీకి ఊహించలేకపోయాడు. కానీ ఏమీ మాట్లాడలేదు.
"అక్కా! నీ కసలు బుద్ధి లేదు. పిల్లలు కలగటానికి సహజమయిన రీతిలో కొన్ని అవాంతరాలు ఎదురుకావచ్చు! దాని కోసం పూజలు చేయడం, ఉపవాసాలు! ఈ మాత్రం చిన్న ఆలోచన అమ్మకి, నీకు రాలేదు సరే బావగారు కూడా ఊరుకున్నారేం? మిమ్మల్ని ఇద్దర్నీ డాక్టర్ దగ్గర చెకప్ చేయిస్తాను. అందుకే ఇంత హడావిడి చేసి పిలిపించాను" అంది ఆమని!
అప్పటికి వాల్మీకి విషయం బోధపరచుకున్నాడు.
చిన్నపిల్ల పెద్దరికం తీసుకుంది. మంచిదే, కాని ఆయన అనుమతి లేకుండా ఇలా నిర్ణయించడం వారిని బాధించవచ్చు!
"ఆ విషయం ముందే ఎందుకు వ్రాయలేదు?" అంది ఏమీ ఎరుగని దానిలాగ!
"నంగనాచిలా మాటాడకు! అంత బాధపడుతున్నదానివి పరిష్కారం ఆలోచించుకోవాలా వద్దా? బావగారంత మంచి భర్త దొరికితే ఆయన ముందు మనసులో మాట చెప్పుకోలేకపోవడం ఏమిటి?
ఫారిన్ నుంచి వచ్చిన డాక్టర్ ఒకామె వుంది! మీరిద్దరూ అక్కడకు రావలసిందే! రిపోర్ట్సు తీసుకుందాం! సరయిన పరిష్కారం దొరికే వరకూ మిమ్మల్ని వెనక్కి పోనిచ్చే ప్రసక్తి లేదు" అంది ఆమని.
గాయత్రి ఇష్టమే అయినా మాటాడలేదు. స్నేహితురాలుగా భావించి మనసులోని బాధ చెల్లికి చెప్పుకుంటే ఆశించిన దానికన్నా ఎక్కువే చేసింది. కాని వారి అభిప్రాయం తెలుసుకోకుండా తాను బయటపడ కూడదు.
"బావగారూ! అక్క మాటాడలేదు నాకు తెలుసు. మీరయినా చెప్పండి. నేను చేసిన ఆలోచనలో తప్పు ఏమయినా వుందా?" అంది.
"తప్పులు చేయటానికి నువ్వు చిన్నపిల్లవు కావుగా!" అన్నాడు వాల్మీకి.
అప్పటికప్పుడు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకుందామె.
ఆ రోజే సాయంత్రం ఆరు గంటలకు ముగ్గురూ కారులో వెళ్లారు. నగరంలో రద్దీగా వున్న వీధుల్లో ఎలాంటి జంకు గొంకులు లేకుండా కారు నడుపుతోంది ఆమని. ఆమని పూర్తిగా మారిపోయింది.
ఆమని ప్రపంచంలో పుట్టి పెరిగిన పల్లెటూరు ఒక జ్ఞాపకమే!
ఆమె ప్రతి కదలికలో ఒక కొత్తదనాన్ని గమనించింది గాయత్రి.
తల్లి దగ్గర కూడ అల్లరి చేసిన పెంకి పిల్ల అక్క దగ్గర గారాలు పోయిన కోణంగి పిల్లకాదు ఆమని! తన జీవిత రధాన్ని తన గమ్యాలవైపు వేగంగా నడిపించుకుపోతున్న యువతి! సమర్ధవంతురాలు! స్పష్టమయిన లక్ష్యాలు, రాజీపడని విధానాలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేయని ధైర్యశాలి!
"ఏమిటలా నావంకే రెప్పవేయకుండా చూస్తున్నావు! కావాలంటే రెండు వారాలదాక ఇక్కడే ఉండి డ్రయివింగ్ నేర్చుకో" అంది ఆమని!
"నువ్వు చాలా మారిపోయావే ఆమనీ!" అంది గాయత్రి.
