"నేను రిప్లయి ఇవ్వలేదు!"
"వెరీగుడ్, అయితే ఇప్పుడు నువ్వు అతన్ని కలుసుకోవాలనుకొంటున్నావా?"
"అనుకొంటున్నాను."
రంగారావు రెండు క్షణాలు ఆలోచించి "ఓ. కే. నువ్వు ప్రశాంత్ కి ఫోన్ చేసి అతన్ని హోటల్ దగ్గర కలుసుకోమని చెప్పు."
విజయ కళ్లు పెద్దవయినయి.
"ఒంటరిగానా?"
"భయంలేదు. నేను ఓ కంట కనిపెడుతూనే వుంటాను."
"ఏమో మామయ్య! అంకుల్నిగానీ, నిన్నుగానీ తోడుగా తీసుకెళ్లాలనుకొన్నాను." అందివిజయ.
"అంకుల్స్ తోనో, ఆంటీలతోనో వెళితే ఇలాంటి వేటగాళ్లుబయట పడరు. నేను నిన్ను కంటికి రెప్పలా కనిపెడుతూనే వుంటాను. బహుశా వాడు నిన్ను తన ఇంటికో, గెస్ట్ హౌస్ కో రమ్మని పిలుస్తాడు"
రంగారావు మాటలకి విజయ చెంపలు ఎర్రబడినయి.
"ఏమిటా మాటలు?" కోపంగా అంది విజయ.
"ఇవి నా మాటలు కాదుబేబీ! ఆ రాస్కెల్ అనే మాటలు. నువ్వే చూస్తావుగా!" అన్నాడు.
"సరే!"
"సరే కాదు. నువ్వు వెళ్తున్న పనిలో పనిగా నువ్వు అతన్ని గురించి సమాచారం సేకరించాలి. వాడి బోగట్టా మొత్తం నాక తెలియాలి" అని తన వ్యూహం గురించి ఆమెకి చెప్పాడు.
విజయ అలాగే అంది.
కానీ విజయ దారిలోనే కంగారుపడి అతన్ని మొహం వాచేలా తిట్టి వచ్చేసింది.
....రంగారావు తలెత్తి విజయ మొహంలోకి చూశాడు.
"సారీ మామయ్య!అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది.
నేను వెనక్కి తిరిగి చూస్తే నువ్వుకానీ, నీ మోటార్ సైకిల్ గాని కనిపించలేదు దాంతో కొంచెం కంగారు పడ్డాను.
వాడు అనుభవశాలి.
నాకా అనుభవం లేదు.
నిజంగానే గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి నన్ను ఏదన్నా చేసేస్తాడని భయం వేసింది.
"చాలా గొప్ప ధైర్యస్తురాలివే" అన్నాడు రంగారావు.
డి. డి. ఆర్. సిగార్ వెలిగించి అన్నాడు.
"ఇలాంటి వాళ్లని స్పేర్ చేయకూడదయ్యా రంగారావు.
భారతిని నువ్వు పెళ్లిచేసుకొని వుండకపోతే ఆ అమ్మాయితో క్రిమినల్ కేసు పెట్టించి ఆపించేవాడిని వెధవని.
ఇలాంటి వెధవని ఎందులోనైనా ఇరికించాలి. దానికేదన్నా ప్లాన్ వేయాలి"
"అంకుల్" అంది విజయ.
"ఏమిటి బేబీ!"
"నేను ప్రశాంత్ గురించి ఎనలైజ్ చేసుకొన్న విషయాలు చెపుతాను.
ప్రశాంత్ మొహంపైన చిరునవ్వుని పులుముకొని మంచివాడిలా నటించే తోడేలు గ్లామర్.
డబ్బు.
అమ్మాయిలు.
ఈ పిచ్చి వాడిలో ఎక్కువగా వుంది.
ఎలాంటి అమ్మాయి అయినా వాడు పిలిస్తే గదిలోకి వచ్చేస్తుందనే భ్రమలో వున్నాడు.
ఆడదంటే విలువ తెలీని పశువు.
ఆడదంటే కేవలం పడగ్గదిలో వాడుకునే విలాసవస్తువనుకొనే అధముడు ప్రశాంత్.
అభిమానం, ఆరాధన, ప్రేమ అనే మాటలకి అర్దం తెలీదు. మోహంతో, కామంతో కళ్లు మూసుకుపోయిన మధాందుడు.
వాడికి మనసనేది లేదు.
హృదయస్పందన ఎలా వుంటుందో తెలీదు.
వాడు... వాడు... అసలు రైటర్ కాదు అంకుల్"
ఆమె ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి. మొహం ఎర్రగా కందిపోయింది.
"అంటో నీ ఉద్దేశం?"అడిగాడు డి. డి. ఆర్.
విజయ వాళ్లిద్దరికేసే చూసింది.
"యస్.
ప్రశాంత్ ని అసలు రచయిత అనడానికి అవకాశం కనిపించడం లేదు.
ఖచ్చితంగా ఇతగాడి వెనుక ఎవడో ఘోస్ట్ రచయిత వున్నాడు.
ఆ 'డూప్' ఎవరో తెలుసుకోవాలి"
"అది సమస్య కాదు. అది తెలుసుకోవడం చాలా తేలిక.... అయితే దానివల్ల ప్రయోజనం ఏమిటి?" అడిగాడు రంగారావు.
విజయ చిన్నగా నవ్వింది.
"అది నువ్వనుకొన్నంత తేలిక కాదు మామయ్య!
ప్రశాంత్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అతను ప్రముఖ రచయితగా ఓ స్థానాన్ని సంపాదించుకొన్నాడు.
అతనికి పత్రికల్లోనూ పబ్లిషర్స్ దగ్గర పలుకుబడి వుంది. సొసైటీలో ఓ పాపులర్ వ్యక్తిగా తిరుగుతున్నాడు.
అలాంటి వ్యక్తి తనస్థానాన్ని కాపాడుకోడానికి తగిన జాగ్రత్తలని తీసుకొనే వుంటాడు.
