అంతకంటే ఘోరమైన పనిచేశారు. అంతకంటే నీచమైన పనే చేశారు. పారిజాతను ప్రేమించారు. పెళ్ళి నాతో స్థిరపర్చుకున్నారు. దీని అర్ధం ఏమిటి? పారిజాత పేదపిల్ల, దిక్కులేనిది. నాకు అంతులేని ఐశ్వర్యం ఉంది, అందరూ ఉన్నారు."
"నేను వచ్చానా మీ సంబంధం కావాలని?"
"ఎరవేసి కూర్చుంటే చాలు. ఏ చేపనో ఒకచేప తగులుకుంటుంది. దురదృష్టవశాత్తూ ఆచేపను నేనయ్యాను!"
18
"భగభగ మండుతున్న అగ్నిగోళంలా ఉంది మనోహర్ హృదయ పరిస్థితి. అతడి కళ్ళు రెండు మంకెన పువ్వుల్లా తయారయ్యాయి.
పిచ్చిపట్టిన వాడిలా పచార్లు చేస్తున్నవాడల్లా "పారిజాతా" కేకవేశాడు.
క్రింద ఎక్కడో పనిలో ఉన్న పారిజాత ఆ పిలుపు విని త్రుళ్ళిపడింది "ఏమిటి మనూ?" అంటూ పైకి పరిగెత్తింది.
"ఇలారా!" మనోహర్ తల్లి గదిలోకి వెళ్ళాడు. బీరువా తెరిచాడు. రజని కోసం తీసుకున్న పట్టుచీర తీశాడు. రజని కొలతలతో కుట్టించిన బ్లవుజు కూడా ఉంది అందులో. పారిజాత మీదికిసిరాడు. "వెళ్ళు ఇవి కట్టుకుని త్వరగా రా!"
"ఏమిటి మనూ?" ఇవి పెళ్లి కూతురి కోసం కొన్న బట్టలు కావూ? పారిజాతకు ఇదంతా ఏమిటో అయోమయంగా ఉంది.
"ఏం ఈ బట్టలు కట్టుకొంటే నువ్వు పెళ్ళికూతురివి కావా?" ఉరిమినట్టు గా అన్నాడు మనోహర్ "వెళ్ళు! త్వరగా కట్టుకురా? నిలబిడ ఎదురుగా ప్రశ్నించడానికి ప్రయత్నించకు! చంపేస్తాను"
గాబరా పడిపోయింది పారిజాత. మనోహర్ వాలకం హత్యకు సిద్దమైనట్టుగానే ఉంది. దడదడలాడే గుండెలతో ప్రక్క గదిలోకి పరిగెత్తి తలుపు మూసి, మూసుకున్న తలుపులకు చేరబడి ఊపిరి పీల్చుకుంది. మనూకి ఏమైంది? ఓ భగవంతుడా ఇంట్లో ఎవరూ లేరే!
కోమలమ్మ నిన్ననే తమ్ముడి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి వెళ్ళింది. వంటావిడ ఊళ్లో చెల్లెలింటికి వెళ్ళింది ఉదయం వస్తానని చెప్పి! ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరిని పిలవాలి!
"ఏం చేస్తున్నావు లోపల? తలుపు తీయవేం? తలుపులు బద్దలుకొట్టి లోపలికి వస్తాను, జాగ్రత్త!" మనోహర్ తన్నిన తాపుకు తలుపులు విరిగిపడలేదుగాని, విరిగిపడేంత గట్టిగా వినిపించింది చప్పుడు.
ఇంక తప్పదు రాదేవుడా అనుకొని చీర అస్తవ్యస్తంగా చుట్టుకొని గజగజలాడిపోతూ, చమటలు కారుతూ ఇవతలికి వచ్చింది పారిజాత.
ఆ పిల్ల చేయి పట్టుకొని మరో గదిలోకి బరబరా లాక్కుపోయిన మనోహర్ నగలపెట్టె తీసి ఓక్కోనగే పారిజాత ఒంటిమీద అలంకరించాడు. అవన్నీ రజని కోసం చేయించిన బంగారు రాళ్ళ నగలు.
అలంకరణ పూర్తి అయ్యేసరికి గుర్తుపట్ట రానంతగా మారిపోయింది పారిజాత.
ఆ పిల్లనే కొత్తగా చూస్తున్నట్టుగా తదేకంగా చూడసాగాడు మనోహర్. చూస్తున్న కొద్దీ మండే గుండెల మీద పన్నీరు చిలకరించినట్టుగా అయింది. బంగారం పోతపోసిన విగ్రహంలా మెరిసి పోతున్నది పారిజాత! చిత్రంగా, భయంగా చూస్తున్న ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి? తను కోరితే ఈ సౌందర్యం తనసొత్తే అవుతుంది కదూ? తనలో కలిగిన ప్రధమ రాగోదయం బహిర్గతం కాకుండా ఏ అంతస్తు అడ్డుగోడలా నిలిచిందో అది ఈ క్షణం కూలిపోవాలి?
ఏదో మైకం కమ్మినట్టుగా అయి, ఇనప్పెట్టెలో దాచుకొన్న నగలూ, నిలువ డబ్బు కట్టలూ తీసి అభిషేకిస్తున్నట్టుగా పారిజాత మీద పోశాడు.
"పారూ! ఈ క్షణం నుండీ ఈ డబ్బు, ఈ సంపద అంతా నీదే. నాదంతా నీకు ధారబోస్తున్నాను. అమాయక మైన నీ హృదయంలో ఉద్భవించిన ప్రేమను స్వీకరించడానికి అడ్డుపడిన ఈ అంతస్తు భూతం ఈ క్షణంలో మాసిపోయింది. నా కిప్పుడు మా అమ్మను కూడా ఎదిరించగల నన్న ధైర్యం ఏర్పడింది!"
"మనూ! నీకు ఏమైందీరోజు? మతి భ్రమించిందా?" మతిపోయిన దానిలా చూస్తూ వణికేకంఠంతో అడిగింది.
"మతి భ్రమించలేదు. ఈ రోజు నా కళ్ళు తెరుచుకొన్నాయి. ఒక అమూల్యరత్నాన్ని చేజారకముందే చేతికి చిక్కించుకొన్నాను. రజనికి నేనెంతో రుణపడిఉన్నాననిపిస్తోంది!"
