"బావకు కావలసిందే, నాన్నా. ఆ ప్రాయశ్చిత్తం! అందుకు జాలి పడడం కూడా పాపమే. అత్తయ్యకిచ్చిన మాట నిలుపుకోవడమే అత్తయ్య ఆత్మకు సంతృప్తి. అత్తయ్య ఉన్నా చినకొడుక్కే చేసుకొనేది అత్తయ్య మనసు నాకు తెలుసు."
"మీరు మాట తప్పడం నాకూ అంత బాగుండలేదు. కడుపున పుట్టిన బిడ్డే కళ్ళు తెరిపించే స్థితికి జారిపోయారేం? భార్గవరాముడు మగపిల్లవాడు. అతడికి అన్యాయం జరుగడమేమిటి? పెళ్ళే చేసుకోవాలనుకొంటే అతడికి అనువైనపిల్లే దొరక్కపోదు! ఇన్నాళ్ళూ రమణకిస్తామని చెప్పి పిల్లను ఇక్కడి వుంచి ఇప్పుడు మేనల్లుడికిస్తానంటే ఏం బాగు? నలుగురూ నవ్విపోతారు. సిగ్గుచేటు!" అన్నది శ్రీలక్ష్మి.
"తల్లీ బిడ్డలు దృఢ చిత్తులూ, నిజాయితీ పరులూ అయ్యి ఈ గృహస్తును మాటతప్పే పాపాన పడకుండా రక్షించండి అబ్బా!" అయిష్టంగానే అక్కడినుండి కదిలిపోయారు సూర్యదేవులు.
20
దేవదాసి తనకు హృదయ పూర్వకమైన స్వాగతం చెబుతుందని ఆశించాడు భార్గవరామ్. తన మనస్సంఘర్షణ, దేవదాసియందు తనలో జనించిన ప్రేమ ఎంత బలీయమైనదో అది తనను వైరాగ్య ప్రవృత్తి నుండి ఎలా మరల్చిందో అన్నీచెప్పాలని ఉబలాటపడ్డాడు. ఏదీ, ఆమె తనతో కలుసుకోవడమే లేకపోతే? ఒక రోజంతా వేచి మరునాడు తనే ఆమెను కలవాలని చూశాడు. మందితో తప్ప ఏకాంతంగా కలవడానికి పడలేదు ఆమెను. ప్రయత్న పూర్వకంగానే ఆమె ఆ అవకాశం కలుగకుండా చేస్తున్నదన్న అనుమానం వచ్చిందతడికి. ఆశ్చర్యానికీ, ఆందోళనకు లోనయింది అతడి మనసు. "అలుకా? ఆగ్రహమా?" అనుకొన్నాడు.
ఎందుకో పైకివచ్చిన సువర్ణప్రతిమ తాము ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నట్లుగా చెప్పింది.
అక్క కూడా వస్తుందా మీతో?
"మరి ఇక్కడేంపని?"
అక్కను ఒకసారి పైకి రమ్మని చెబుతావూ?"
"అలాగే!"
ఆ పిల్ల వెళ్ళి కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చి చెప్పింది అక్క ఎక్కడుందో? ఏమో? నాకు కనబడలేదు!"
"ఎక్కడికి వెళ్ళిందే?"
"ఇల్లంతా వెదికాను, లేదు మరి."
"వచ్చాక చెప్పు."
పావుగంటసేపు నిరీక్షించాడు భార్గవరామ్. దేవదాసి రాలేదు. అతడిలో తొందర అధికమైంది. క్రిందికి బయల్దేరాడు. వెదికే అవసరమే లేకపోయింది.
గది నుండి మాటలు వినిపించాయి. అవి తనకు సంబంధించినవే కావడంతో గది ఇవతలే ఆగి విన్నాడు.
"అయితే బావకు అన్యాయం చేయనా, అమ్మా మాటకోసం ప్రాకులాడి? స్వర్గానఉన్న మీ అత్తయ్య మనసు క్షోభించదా?"
మామయ్య మాటకు మరదలి సమాధానం, అత్తయ్య, అభిప్రాయం అన్నీ విన్నాడు. మామయ్య చిరాకుగా ఇవతలికి వచ్చేస్తుంటే భార్గవరామ్ వెనుదిరిగి పైకి వచ్చేశాడు. నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు. "నా జీవితంలో పూడ్చుకోలేని నష్టం కలిగించిపోయావా, అమ్మా? అమృత హృదయినివి అయిన అమ్మవే? నా అపచారాన్ని మన్నించలేకపోయావా? అతడి పరితాపం అంతా ఇంతా కాదు.
"భార్గవరామా! వెళ్ళొస్తాము నాయనా!" శ్రీలక్ష్మి చెప్పిపోవడానికి వచ్చింది. తల్లి వెనుక నిలబడ్డ దేవదాసిని చూచి ముఖం త్రిప్పుకొన్నాడు భార్గవరామ్.
"ఇక్కడ ఏం మాట్లాడడానికి వీలుపడిందికాదు ఒకసారి అక్కడికి రా, బాబు!"
"ఉ" అన్నాడు, మనసులో ఇక మాట్లాడడానికి ఏముందిలే, అనుకొంటూ. ఎందుకో శ్రీలక్ష్మి కళ్ళలో కన్నీరు కదిలి వచ్చింది. కొంగుతో కళ్ళు తుడుచుకొంటూ "వస్తాను, రామా!" అని కదిలింది.
"వెళ్ళొస్తాను బావా!" తల్లి వెంట కదులుతూ మెల్లని స్వరాన చెప్పింది దేవదాసి.
ఎంతకూ విడని పెదవులు అతి ప్రయత్నంతో విచ్చి "దేవదాసి" అని పిలిచాడు భార్గవరామ్. గది దాటి మెట్లు దిగబోతున్న దేవదాసి ఆగింది.
