"దేవదాసీ, ఒక్కమాట! ఇలారా."
నెమ్మదిగా నడిచివచ్చింది బావ చెంతకు. "ఏమిటి?"
"..............."
దీర్ఘంగా నిశ్శబ్దంగా తన ముఖంలోకి చూస్తూన్న బావ చూపులకు కలవరపడుతూ "త్వరగా చెప్పు. బండి కడుతున్నారు మరి" అన్నది ఆమె.
"అంత కష్టంగా ఉందా నా ఎదుట నిలుచోవడం?"
"చెప్పు!"
"చిన్నా పెద్దా తారతమ్యం తెలియకుండా అందరికి నీతులూ, బుద్ధులూ గరిపే గొప్పదానివి! నువ్వు చేసిన పనేమిటి?" కటువ్యంగ్యాలు ప్రతిధ్వనించాయి అతడి గొంతులో, గతుక్కుమన్నది దేవదాసి.
"నా మనస్సు చెడడానికి నా నిశ్చయం సడలడానికి కారణం నువ్వుకాదూ? వ్రతం నన్నడకుండానే చేశావెందుకు దేవదాసీ? నాకంటే రమణే యోగ్యుడిగా కనబడుతున్నాడా నీకు!"
"అవును" ఉద్వేగ రహితంగా నిశ్చలకంఠంతో అన్నది. "నిష్కల్మంగా. నిస్సంకోచంగా ప్రేమించగల మనస్సు వారిది స్త్రీని ప్రేమించడం దుఃఖం, పాపం అనుకోరు నీవలె నీ అనిశ్చితమైన ప్రేమనూ, అసహజమైన నీ సాహచర్యాన్ని నేను భరించలేకనే ఆయనతో పాణి గ్రహణానికి అంగీకరించాను. నేను తప్పుచేశానని భ్రాంతికి లోనయ్యానని అనుకోవడంలేదు."
మరింత కటువుగా అన్నాడు. నా గతేం కావాలని ఆలోచించావు?"
"గతికేం? నీ జీవితంలో శూన్యతను మిగిల్చిన నీ శూన్యతత్వమే శరణ్యం" అని నవ్వింది. ఆ నవ్వులో ఏదో కసి, హేళన స్ఫురించాయి లీలగా భార్గవరామ్ కు.
"నీ ఆశలు భగ్నం చేశానని, నేనేదో ద్రోహిగా కనబడుతున్నానేమో, నీకు? అత్తయ్య ఉంటే ఎవరు ద్రోహులో నిర్ణయించేది."
ఎక్కువగా వాదించుకోవడానికి వీలుపడలేదు.
"అమ్మ బండిలో ఎక్కి కూర్చొంది. నిన్ను త్వరగా రమ్మంటూంది అమ్మ" అంటూ వచ్చి పిలిచింది సువర్ణ ప్రతిమ.
21
కన్యాదాత గృహంలో దేవదాసి మెడలో మంగళసూత్రం కట్టి ఆమెను జీవిత సహచరిగా చేసుకొన్నాడు రమణ మూడు నిద్రలకు వరునితో తరలివచ్చింది.
నూతన వధూవరులు సత్యనారాయణస్వామివారి వ్రతం చేశారు.
ఆనాటి సాయంత్రం రమణతో అతి విచారంగా చెప్పింది దేవదాసి. "బావ వెళ్ళిపోతున్నాడట."
"ఎవరన్నారు?"
"గోవిందస్వామి చెప్పాడు. స్టేషన్ కు బండి కట్టించమన్నాడట!"
"ఏదైనా పనిమీద వెడుతున్నట్లా!"
"ఉహుఁ. మళ్ళీ వచ్చేది నమ్మకం లేదన్నాడట."
ఖిన్నుడయ్యాడు రమణ.
భార్గవరామ్ వచ్చి రెణ్నెల్లు అయింది. ఒక్కసారి కూడా వెళ్ళే ఉద్దేశ్యాన్ని బయట పెట్టలేదు. అతడు, ఎవరితోటి! అన్నగారు ఇక్కడే ఉండిపోతాడని ఆశించాడు, రమణ ఆస్తి అనుభవించవలసినవాడు దేశాలమీదపోతే తానా ఆ ఆస్తినంతటినీ అనుభవించేది? నలుగురి దృష్టిలో తనింకా హీనం కావడమే అవుతుంది. సుబ్బయ్య వంటి మహానుభావులు మరింతగా నిరసిస్తారు.
భార్గవరామ్ నిష్క్రమణ దేవదాసిని ఆశ్చర్యానికీ, బాధకూ లోనుజేసింది. పెళ్ళికి భార్గవరామ్ వచ్చాడు. పెళ్ళి పీటలమీదనుంచి లేచి తామిద్దరమూ నమస్కరించగానే తమని దీవిస్తూ అక్షింతలు వేశాడు.
"అన్నను ఆపలేవా" రమణ అడిగాడు.
ఆమె మౌనంగా తన ఆడించింది. చేత కాదన్నట్టు కళ్ళనిండా నీరు ఉబుకుతోంది అడుగుల చప్పుడు విని తల తిప్పింది. చేతిలో సూటుకేసుతో భార్గవరామ్.
"అన్నయ్యా" అన్నాడు రమణ - గొంతు పెగల్చుకొంటూ. నువ్వు యిక్కడ ఉండిపో అన్నయ్యా.... ఇదంతా నీది" అన్నాడు రమణ....
"వద్దు తమ్ముడూ?..... నేను ఎవరి కోసమయితే నా జిజ్ఞాస మానుకుని వచ్చానో వాళ్ళు లేరు - వున్నవారు నా వారు కాదు.
ఏ భవ భవబంధాలకు మమతానురాగాలకు అతీతంగా జీవించే ఆదర్శంతో యింతవరకూ బ్రతికానో ఆ ఆదర్శంకోసమే జీవితాన్ని సాగిస్తాను. దేవత నీదయి నాకళ్ళు తెరిచింది....
"బాబూ, బండి సిద్ధంగా వుంది" అంటూ- గోవిందస్వామి నోట్లో గుడ్డ కుక్కుకున్నాడు.
వస్తాను దేవతా!..... వస్తాను రమణా.....
దేవదాసి వెళ్ళి అతని పాదాలకు నమస్కరించి అక్కడ వుండలేక లోపలికి పరుగెత్తింది.
రమణ దుఃఖాన్ని అతి బలవంతాన ఆపుకున్నాడు.
"వస్తా, గోవిందస్వామి..... వస్తా సుబ్బయ్యగారూ."
భార్గవరామ్ బండిలో కూర్చున్నాడు.....
బండి కదిలింది..... బండి గంటలు రాను రాను దూరమవుతున్నాయి.
*** శుభం ***
