అటూ యిటూ చూచి చప్పున అతడి పెదవులమీద వేలుంచింది దేవదాసి. అత్తయ్య నన్ను మీ దేవిగా నిర్ణయించిపోతే అమ్మా, దేవతమ్మా అంటారేమిటి? ముల్లులా గుచ్చుతున్నది చెవులకు. ఇంకా అపనమ్మకమా? నాకేనాడూ మీరంటే అసహ్యంలేదు. తిరస్కార భావంలేదు స్వచ్ఛమైన మీ నిర్మలాంతఃకరణ విదితమౌతుంటే, నా హృదయం పులకించి భక్తి ప్రేమలు పొంగుతున్నాయి. ఉత్తముడైన వ్యక్తిని నాకు భర్తగా నిర్ణయించి వైవాహిక జీవితంలోనున్న భాగ్యశాలిగా చేసిపోయిన అత్తయ్యకు నా మనసు అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నది." దేవదాసి ఈ మాటలు అతడి ఓదార్పు కోసం అనలేదు. లోనుండే వచ్చాయి ఒక విధమైన ఆవేశాన్ని పెనవేసుకొని.
మేఘ వినిర్ముక్తమైన ఆకాశంలో వెన్నెల వెలుగులు విరజిమ్మే చందమామలా, విషాద మేఘాలు తొలగిన రమణ వదనంలో ఆనందరేఖలు వెల్లివిరిశాయి.
ఆనందాశృవులు నిండిన రమణ కళ్ళలోకి చూస్తూ ఒక అనుభూతికి లోనయింది దేవదాసి. 'బావవలపుతో మబ్బులు పట్టిన ఆకాశం క్రింద చల్లని పిల్లగాలిలో పింఛము విప్పినర్తించే మయూరిలా పరవశత్వంపొందే మనసుకు రమణ సాహచర్యం మిట్ట మధ్యాహ్నం వేళ ప్రశాంతంగా సాగే ప్రవాహంపై చెట్ల నీడలు పరుచుకొన్న ఒడ్డు అంచులలో పయనించే పడవలో ప్రయాణంలా ఉంటుంది!' అనిపించింది.
దేవదాసి చెల్లెలు సువర్ణ ప్రతిమ వచ్చి చెప్పింది. "అమ్మ పెట్టె సర్దుతూంది. నీ బట్టలేమైనా ఉంటే తెచ్చిమ్మంది పెట్టెలో సర్దుతుందట."
"పదండి."
దేవదాసిని అనుసరించాడు రమణ.
వరండాలో గోవిందస్వామి దస్తరం పర్చుకు కూర్చొన్నాడు. అప్పుడే భోజనం ముగించి, భుక్తాయాసంతో ఇవతల పడ్డ సుబ్బయ్య "గోవిందస్వామీ, ఓ బీడీ యిలా పారెయ్" అని ఓబీడీ ఇప్పించుకొని గోవిందస్వామి బీడీకే అంటించుకొన్నాడు.
మరి ఇద్దరు ముగ్గురు పాలేళ్ళు కూడా గోడనీడల్లో కూర్చొని తాళ్లు వేస్తున్నారు.
రమణా, దేవదాసీ ప్రక్కప్రక్కనే నడిచివస్తుండడాన్ని కళ్ళు చిట్లించుకొని చూశారు.
"గోవిందస్వామీ, అటు చూడవయ్యా! దేవతమ్మ మనసు అటు తిరిగిందేమిటి?"
"తిరగక ఏం చేస్తుంది, స్వామీ? తెలిసినపిల్ల ఏనాటికైనా భర్త కావలసినవాడు."
"మన చినబాబుకు ఓ ఇంటివాడు కాగల గీత లేనట్లేనా?"
"మరి, అంతే."
దేవదాసిని మేనబావ ప్రక్కనచూచి చక్కని జంటని ముచ్చటపడి చూచినవాళ్ళే రమణ ప్రక్కనచూచి ముఖాలు త్రిప్పుకొన్నారు.
అందరి ముఖాలు పరిశీలనగా చూస్తూనే వస్తున్నది దేవదాసి. నవ్వుకొన్నది వారందరి మధ్య రమణ స్థానం పటిష్ఠంజేసి, అతడి ప్రత్యేకత వాళ్ళు గుర్తించేట్లు చేసే బాధ్యత తన మీదున్నది! అదంత అసాధ్యంగా తోచలేదామెకు.
గదిలోకి అడుగు పెడుతూనే తలిదండ్రుల సంభాషణ విని గతుక్కుమంది.
"ఇప్పుడేమంటావు? ఆ రంగారావు ఇప్పటికిప్పుడు పెళ్ళి చేయిద్దామంటున్నాడు విముఖమో ఏదో పెట్టుకొని, భార్గవుడిని వదిలి మధ్య వచ్చిన వీడికెలా ఇవ్వగలం దేవతను?"
"మధ్య వచ్చిన వాడో ఎవడో గాని ఆనాడు మీ అక్కగారితో ఒప్పుకొన్నారు కదా, రమణకు యివ్వడానికి?
"ఆనాటి పరిస్థితి వేరుకదా? భార్గవుడు మారివచ్చిన ఈ సమయంలో అక్కేవుంటే...."
కన్నకొడుకు అన్న పక్షపాతంతో మాట నిలకడలేని మనిషి అనిపించుకొనేది కాదులే, నాన్నా. అన్నది దేవదాసి. తండ్రి మాటకు అడ్డువచ్చి.
ఆశ్చర్యంగా కనుబొమలు ఎత్తిచూశారు, సూర్యదేవులు.
"ఇంతకాలం రమణకు భార్యగా భావిస్తూ వచ్చి, మేనల్లుడు రాగానే అతడికి అంటగట్టడానికి ఎలా తయారయ్యారో అర్థం కావడంలేదు. పిన్నలు అజ్ఞాన వశంచేత ప్రలోభంలో పడకుండా మంచి చెడ్డలు ఎరిగించి సరైన మార్గంలో నడిపించవలసిన పెద్దలు! మీరే స్వార్థప్రలోభాలకు లోబడి ఏదో సాకు చేసుకొని మాట తప్పుతారా? మేనల్లుడిమీద అభిమానంకొద్దీ అతడికి నన్నివ్వడానికి మీరు సిద్ధపడ్డారేమో గాని నాకు సమ్మతంగా లేదు బావను చేసుకోవడం."
"అయితే బావకు అన్యాయం చేయనా, మాటకోసం ప్రాకులాడి?" స్వర్గాన ఉండే మీ అత్తయ్య మనసు క్షోభించదా అమ్మా?"
