హరిత మనస్సంతా పెనంమీద వేగుతున్నట్టుగా వుంది. ఈ కాపురం సవ్యంగా సాగుతుందన్న ఆశ సన్నగిల్లిపోయింది. అతడు తనను అర్దం చేసుకొనే ప్రయత్నం చేయడు. తనకు సహకరించడు. తనే రాజీపడాలి. అంటే తరతరాలుగా స్త్రీ జాతి అనుభవిస్తున్న బానిసత్వాన్నే తను ఆశ్రయించాలి! ఒళ్ళు దాచుకోకుండా దాసిలా పనిచేస్తే ఇంత తిండి దొరుకుతుంది. అడుగడుగునా తన మనసునూ, ఆలోచనలనూ, అనుభూతులనూ చంపుకుంటూ అతడి అడుగులకు మడుగులొత్తితే తప్ప ఈ కాపురం నిలబడదు. కాని, ఇంతటి పురుష దురహంకారిని తను జీవితాంతం భరించాలంటే మాటలుకాదు. అడగడుగునా తన మనసును హింసించాలి. చంపాలి. ఇంతకంటే ఈ కాపురం వదిలెయ్యడమే మంచిది."
తనకు పెళ్లే కాలేదనుకొని ఏ ఉద్యోగమో చేసుకొంటూ సుఖంగా వుంటుంది. కాని, తనను కని పెంచి పెద్ద చేసి లక్షపైగా ఖర్చుచేసి అత్తారింటికి పంపిన తన తల్లి దండ్రులను కూతురు కాపురం వదిలేస్తే అతడు ఎంతటి రాక్షసుడైనాసరే, 'పీడాపోయింది.... నా కూతురికి పెళ్లే కాలేదనుకుంటాం' అని అనుకోగలరా? వీళ్లేకాదు, ఏ తల్లి దండ్రులూ అనుకోరు, పెళ్లిచేసి పంపాము, చావైనా బ్రతుకైనా అక్కడే" అనుకొనే తల్లిదండ్రులే నూటికి నూరు పాళ్లు ఉన్నారు. అందుకే ఇన్ని వరకట్న మరణాలు! ఆడపడుచుల సజీవ దహనాలు! తమ చేతుల్లో అల్లారు ముద్దుగా పెంచి, జీవితాంతం చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి అత్తారింటికి పంపితే, అక్కడ తమ కూతురు అష్టకష్టాలూ పడుతూ నిస్సహాయంగా రోదిస్తూంటే, "దాని ఖర్మ, మనమేం చేస్తాం?" అనుకొంటారేగాని ఆమెనురక్షించి గుండెల్లో దాచుకొనే ప్రయత్నం చేయరు.
ఈ వరకట్న మరణాలూ, ఆడపడుచుల హత్యలూ తగ్గాలంటే ముందు మార్పు రావలసింది పెద్దవాళ్లలో. కూతురు కాపురం వదిలేస్తే అదేదో తీరని కళంకంగా భావించడం మానేయాలి. ఆడదానికి ఒకేసారి పెళ్లి ఒకే మగడు అన్న చాందసం కూడా వదిలేయాలి. ఆమెను అర్దంచేసుకొని ఆమెను పెళ్లాడడానికి ఎవరయినా సహృదయులు ముందుకువస్తే వాళ్ళ పెళ్ళి జరగడానికి పెద్దలు సహకరించాలి. సమాజంలో ఈ మార్పువస్తేతప్ప ఆడపడుచుల జీవితంలో శుభోదయం కాదు.
ఈరోజు రాత్రి అత్తగారు కొడుకుతో అనడం వినిపించింది హరితకు.
"తలిదండ్రులకు ఒక్కతే పిల్లకదూ? చాలా గారాబంగా పెరిగి మొండిరకంగా తయారయినట్టుంది. ఆ గారం వదిలేస్తే తప్ప నీ కాపురం నవ్వలపాలు కాదు. లేకపోతే ఈపాట లేమిటి? ఈ డాన్సులేమిటి? సంసారం చేసుకొనేవాళ్లకి అవెందుకురా? నువ్వు పెళ్లాం బెల్లం అన్నట్టుగా తిరిగావనుకో నీ చెవిలో పువ్వులు పెడుతుంది జాగ్రత్త."
"రోజూ నాలుగు తంతుంటే ఈ గారమంతా వదులుతుంది."
"అత్తంటే భక్తి లేదు, మగడంటే భయంలేదు. మాట లెంత పెళుసుగా, ముఖంమీద తన్నినట్టుగా మాట్లాడుతుందో చూడు."
"దాన్ని సెట్ రైట్ చేయకపోతే నేనేం మగాణ్ని."
* * * *
రెండురోజుల తరువాత ఒకనాటి సాయంత్రం హరిత సంగీత పాటానికి వెళ్ళిపోయిన కాస్సేపటికి హరిత తలిదండ్రులు దిగారు. స్కూటర్ బేరమాడి పెట్టానని, తనకు రావలసిన వరకట్నం తాలూకు డబ్బు అర్జంటుగా తెచ్చివ్వమని మామగారికి ఉత్తరం వ్రాశాడు కమలాకర్.
ఎంత ప్రయత్నించినా పదిహేను వేలకంటే ఎక్కువ దొరకలేదు కృష్మారావుకు దొరికిన పదిహేనువేలు అల్లుడికిచ్చి వెళదామని వస్తూంటే అమ్మాయిని చూడాలనిపిస్తోందని హేమలతకూడా తయారైవచ్చింది.
సాయంత్రం ఆరు అవుతున్నా ఇంకా ఆఫీసునుండి రాలేదు కమలాకర్.
అత్తగారు సుబ్బమ్మ ఒక్కతే వుంది ఇంట్లో.
"కాళ్లు కడుక్కోండి" లాంఛనానికన్నట్టు గా మర్యాద చేసి మంచినీళ్ళిచ్చింది సుబ్బమ్మ.
"అమ్మాయి, అల్లుడూ ఇద్దరూ లేరే. సినిమాకుగాని వెళ్ళారేమిటి. హేమలత సోఫాలో కూర్చుంటూ అడిగింది.
"అయ్యో!అంత ముచ్చటకూడానా? ఒకరు ఎడ్డెమంటే ఒకరు తెడ్డెమంటారు. ఈవిడ సంగీతపాఠం నేర్చుకొంటానికి ఊరేగింది. ఆఫీసునుండి వచ్చేసరికి ఇంట్లో పెళ్లామూ, ముద్దూ, ముచ్చటా? ఈవిడ బయట రాద్యాలేలుతూంటే వాడు లేటుగా రావడం నేర్చుకొన్నాడు. ఈవిడ ఏడింటికో, ఎనిమిదింటికో దయచేస్తుంది. వాడు ఏ తొమ్మిదింటికో వస్తాడు - స్నేహితునింట్లో గడిపి పచ్చటి సంసారం చెడగొట్టుకోవడమంటే ఇదే. మగవాడికి ఇంట్లో సుఖ శాంతులు లేకపోయాక బయట అవి వెత్తుక్కోవడం మొదలుపెడతాడు. వాడికి త్రాగుడు, వ్యభిచారం, జూదం, అలవాటైతే నష్టపోయేది ఎవరు? తనేకదా? ఈ సంగీతాలవి తనకిష్టంలేదని వాడు చెప్పినా ఆవిడ లక్ష్యపెట్టకుండా వెళుతుంది."
"సంగీతం నేర్చుకోవడం తప్పు కాకపోయినా అల్లుడికి ఇష్టం లేనప్పుడు ఎందుకు?" హేమలతకి కూతురుమీదే కోపం వచ్చింది.
