* * * *
ఇక్కడొక విషయం రాయక తప్పదు.
నేనూ, మా పెద్దావిడా కలిసి, శ్రీశ్రీగారికి ఇష్టం లేకున్నా బలవంతాన వారిని ఒప్పించి, ఐదేళ్ళ వయసున్న మా బైజుకి వేదోక్తంగా ఒడుగు చేశాం.
రవణమ్మగారి కోరిక మీద 1968 వ సంవత్సరంలో ఆవిడఇంట్లోనే నెం. 11, కెనాల్ బేంక్ రోడ్డు, అన్నామలైపురంలో చాలావైభవంగా ఒడుగు చేశాం.
శ్రీశ్రీగారు, ఆవిడా మాత్రమే పీటలమీద కూర్చున్నారు.శ్రీశ్రీగారే వాడికి బ్రహ్మోపదేశం చేశారు. నేను పక్కనుండి ఆ వేడుకలన్నీ చూశాను. పీటలమీద కూర్చోపెట్టి, స్వయంగా బైజుకి ఉపనయనం చేయించినందుకు ఆవిడ సంతోషం ఇంతా అంతా కాదు.
"సరోజా! మన ముగ్గురికీ తల కొరివి పెట్టడానికి ఒక కొడుకు వున్నాడు. ముచ్చటతీరా వాడికి ఒడుగు కూడా నాచేత చేయించి నా కోరిక తీర్చావు. నాకిక ఏ విచారమూ లేదు. నేను చనిపోతే మాత్రం వాడిచేత నాకు దహన సంస్కారాలు చేయించు" అన్నారావిడ.
"సరిలెద్దురూ. ఇప్పుడెందుకా మాటలు?" అనేదాన్ని. ఆవిడ తరచుగా ఆ మాటలు నాకు జ్ఞాపకం చేసేవారు.
"మీ కెందుకండీ ఆ బెంగ? మన ముగ్గురికీ వాడే కొరివి పెడతాడు. నేను ముందుపోతే మీరు జరిపించండి. మీరు పోతే నేను జరిపిస్తాను" అనేదాన్ని.
ఇప్పుడు మా ముగ్గురమే కాకుండా మరో వ్యక్తి కూడా వుంది. ఆవిడే నా గారాలు పెద్ద చెల్లెలు ప్లస్ నా పెద్ద కూతురు_రామం. అంత మంచి పిల్ల, పరిపకారిణి ఉండడం కష్టం అని నా ఉద్దేశం. దానికి పిల్లలులేరు. పాటా, ఆటా, ఇల్లూ, వాకిలీ, కారు, అందం, చందం అన్నిటికన్నా ముఖ్యంగా చల్లని మనస్సు...అన్నీ ఆ భగవంతుడు ఆమెకు ఇచ్చాడు. పిల్లలు లేని లోటు ఒక్కటే పెట్టేశాడు.
కళకోసం బ్రతుకుతూ, కళారాధనతోనే ఆవిడ జీవితం వెళ్ళబుచ్చుతోంది. ఒక్కోసారి మా ఇంట్లో పుట్టాల్సింది కాదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదయినా భరిస్తుంది కానీ, నేను తనకి కానంటే మాత్రం భరించలేదు. ఈనాటికీ నన్ను 'అమ్మా' అనే పిలుస్తుంది. శ్రీశ్రీగారిని 'అప్పా' అని పిలిచేది. శ్రీశ్రీగారు దాన్ని 'నామాలూ' అని పిలిచేవారు. అదంటే వారికెంత ఇష్టమో చెప్పటానికి లేదు.
"అందర్నీ నమ్మేస్తావు. అందరి సుఖం కోసం తాపత్రయ పడతావు. కష్టపడి సంపాదిస్తున్న డబ్బు పరాయి పిల్లలకోసం ఖర్చు చేస్తావు. ఇలా అయితే ఎలా బాగుపడతావు? ఏం దారి నామాలూ !" అని దాంతో అనేవారు.
"మీరుండగా నాకేమిటి అప్పా! నేను మీ పెద్దకూతుర్ని కానా?" అనేది.
అప్పుడప్పుడు ఆవిడ దిగులుపడుతూ ఉంటే, సాధారణంగా తన బాధని బైటికి తెలియనివ్వదు. ఎంత బాధ ఉన్నా, కళకళలాడుతూ చిరునవ్వుతో కన్పిస్తుంది.
"రామా! కొరివి పెట్టాల్సిన నలుగురిలో మిగిలింది మనిద్దరం. మనిద్దరికీ బైజూ కొరివి పెడతాడులేవే నువ్వేం బాధపడకు" అని దాంతో అంటూ ఉంటాను.
* * * *
నేను వెళ్ళి తెచ్చిన డబ్బు వారి చేతిలో పెట్టాను.
"ఎక్కడిదీ?" అన్నారు.
"ఇప్పుడదంతా ఎందుకు?" అన్నాను.
ఆ టైములో ఆమె వంటినున్న ముప్పయి కాసుల బంగారం తీసేసి, అమ్మాజీ (పెంపుడు కూతురు) చేతికి మావారే ఇచ్చేశారు.
రవణమ్మగారికి తలకొరివి పెట్టే విషయంలో కొన్ని గొడవలు వచ్చాయి. కొడుకు ఉండగా మరెవ్వరూ పెట్టకూడదని పురోహితులే చెప్పేశారు. 'గుండు చేయించాల'ని కొందరన్నారు. 'కన్నతల్లి ఉండగా గుండు చేసుకోకూడదు తప్పు' అని మళ్ళీ పురోహితులు గొడవ చేశారు.వాళ్ళకి నామీదున్న సదభిప్రాయమూ, అభిమానమే అందుకు కారణం.
అశ్వనీ, రోహిణీలని ఈనాడు మద్రాసులోనూ, మద్రాసు సినిమా ఫీల్డులోనూ కూడా పేరు మోసిన పురోహితులు వాళ్ళు.
ఏమైతేనేం_నా కొడుకు కుండ పట్టుకొని ముందు నడిచాడు. శాస్త్రోక్తంగా ఆవిడ అంత్యక్రియలు జరిపించేశారు. పునిస్త్రీ తనంగా పోయిందన్న ఉద్దేశంతో నేను కొన్ని చాదస్తాలు పెట్టుకున్నాను. శ్రీశ్రీగారు ఏమీ మాట్లాడలేదు.
ఆవిడ చనిపోవడంతో మానసికంగా చాలా కృంగిపోయారు. సుఖంలో కన్నా, కష్టాల్లోనే ఆ ఉత్తరాలు ఎక్కువగా పాలు పంచుకొంది. ఏనాడూ వారి మాటకి ఎదురాడలేదు. శ్రీశ్రీగారంటే పంచప్రాణాలామెకు.
వాళ్ళిద్దరిదీ యాబైఏళ్ళ అనుబంధం మరి !
పెద్దకర్మ జరిపించాలని అందరూ అన్నారు.
ఎవరి చేతిలోనూ దమ్మిడీ లేదు. పదకొండు రోజుల ప్లాన్లు మాత్రం పరుగెడుతున్నాయి. అనేక కారణాలవల్ల ఆ పదకొండు రోజులూ మేము ఆ ఇంట్లో ఉండడం కుదరలేదు. మందవల్లి ఇంటికి, ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళం.
రెండు మూడు వేలు కావల్సి వచ్చింది. నా ఇంట్లో ఉన్న అవుట్ హౌస్ ఇల్లూ, జాగా మీద అప్పటి అవసరానికి మూడువేలు తీసుకొచ్చాం. నేనే దగ్గరుండి మూషిక వాయినాలు వగైరా తంతులన్నీ నెరవేర్చాను.
తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు కర్మలకి లెక్కలు వేసే రోజున నన్నూ, నా పిల్లల్నీ లిస్టులో నుండి తీసేసి, మిగతా వాళ్ళని లెక్కకట్టడం ప్రారంభించారు. (శ్రీశ్రీగారు కాదు).
అప్పుడు నేను నిజంగానే బాధపడి, "ఇదేమిటి? ఆ నాలుగు రోజులూ, నేనూ, నా పిల్లలూ ఉండమా? మమ్మల్ని లెక్క పెట్టలేదేమిట"ని అడిగాను.
