తను అప్ప చెప్పవలసిన పాఠం యొక్క సారాంశం అంతా అప్పగించి యింక తన పని పూర్తి అయినట్టు మౌనం వహించాడు వెంకయ్య చిద్విలాసంగా సూర్య వైపుకి చూస్తూ.
"ఇది నిజమేనంటావా?" సూరయ్యకి యింకా అనుమానం తీరలేదు.
"నేనెప్పుడయినా అబద్దం చెప్పానా సూరయ్యన్నా? అందుకేగా యింతకు ముందు మా పిల్లని ఇస్తామంటే మా పిల్లని యిస్తామని ఎగబడిన వాళ్ళంతా యిప్పుడు ఎందుకు యివ్వటం లేదట? కామాక్షమ్మ తన కొడుక్కి ఆ లగ్నానికే ఎలాగో అలా, ఆఖరికి లేనింటి పిల్లనయినాతెచ్చి చెయ్యాలని అందరికీ కబుర్లు చేసింది....తమ పిల్లని ఇవ్వమంటే ఇవ్వమన్నారు. ఈ విషయం మీదాకావచ్చిందనుకుంటాను. అంటే ఈ పరిస్థితి లోనయితే ఎర్రని ఏగానీ కట్నం తీసుకోదు. నీకేమయినా కబురు చేసిందా ఏమిటి?"
లోపాయికారిగా మనసులో వున్న అనుమానాన్ని సందర్భానుసారంగా వెల్లడించాడు వెంకయ్య.
వెంకయ్య అన్న ఆ చివరి మాటతో ఉలికి పడ్డాడు సూర్య. తనకీ కబురు అందిన మాట నిజమే! అది కూడా ఈ మధ్యాహ్నమే తెలిసింది. ఆలోచించుకుని ఏ సంగతీ తెల్లవారేసరికి కబురు చేస్తానని పూజారికి చెప్పి పంపాడు. ఆ సంగతి ఇతగాడికేమయినా తెలిసిందా? ఆ ఉద్దేశ్యంతోనే అడుగుతున్నాడేమో?...
"నాకు కబురేమి రాలేదు! వస్తే మాత్రం నేను ఒప్పుకుంటానా? అంత డబ్బు కోసం మొహం వాయవలసిన అవసరం నాకు లేదు. నా కూతురు గొంతు కోయటానికి నేనేమన్నా రాక్షసుడినా? నాకు డబ్బు లేదా? ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళి చేసుకున్న వాడిని మూడవ కూతురికి చేసుకోలేనా? ఈ ఆడారి వెధవకి యిచ్చి చేయగలనా?"
సూరయ్యలోని ఆవేశం, కోపం చూసి తన పాచిక పారిందని ఎంతగానో సంతోషించాడు వెంకయ్య. తనువట్టిగానే వెళ్ళినట్టుంటుందని మరలా అన్నాడు.
"మనం ఎలాగూ ఇవ్వము. యివ్వని దానికి ఎందుకు బాధ పడటం? నన్నూ అడిగారు....నేను యిచ్చానా? అసలా మాట నా చెవిన పడకూడదన్నాను. అంతే! నోరుమూసుకునిపోయారు. నీకింకా ముగ్గురు కూతుళ్ళున్నారుగా పెళ్ళికి ఒకవేళ కబురు చేశారేమోనని! యింతకీ నేను వచ్చినవిషయం ఏమిటంటే విత్తనాల సంగతి అడగాలని వచ్చాను. అసలు విషయం మరిచిపోయి కొసలు విషయాలు మాట్లాడుకున్నాం. ఓ అరబస్తా విత్తనపు ధాన్యం వుంటే ఇవ్వు సూరయ్యన్నా! నువ్వెంత రేటు అంటే అంతా యిచ్చేస్తాను!"
"నాకే చాలవు వెంకయ్యా!"
ఇంకా ఎక్కువగా సంభాషణ పొడిగించటం యిష్టం లేక లేచాడు.
"వెళుతున్నాను సూరయ్యన్నా!"
అని నెమ్మదిగా బైటికి వచ్చేశాడు వెంకయ్య.
తను నాటిన ముళ్ళు బాగా లోతుకంటూ దిగిపోయింది. యింకతనకి డోకా వుండదు. అని నిబ్బరపడ్డాడు.
అలాంటి సూర్య యిప్పుడు వినాయకనైకి తన కూతురిని ఇస్తానన్నాడని తెలిసి నివ్వెరబోయాడు. తనకి పోటీ ఏర్పడిందని వణుకు కలిగింది. సూర్య రాకముందే తను తొందర పడాలి! లేకపోతే తన బండారమంతా బైట పడిపోతుందన్న భయం కలిగింది అంత వరకూ బెట్టుగా వున్నవాడల్లా సూరయ్య పేరు వినగానే జావలాగా అయిపోయాడు. తనలోని సంక్షోభాన్ని తెలియ నివ్వకుండా నెమ్మదిగా అన్నాడు లేస్తూ.
"సీతకి సుబ్బలక్ష్మీకి చెప్పి చూస్తాను అక్కయ్యా! వాళ్ళిద్దరూ వప్పుకుంటే నాదేమీ లేదక్కా! నువ్వన్నట్టు నీ ఖర్చుతోనే నీ వాకిటిలోనే పెళ్ళి జరిపించుతానుగా."
కామాక్షమ్మ ఏదో అనబోయి అంతలోనే ఆగిపోయింది.
వెంకయ్య బైటికి వచ్చేసరికి సంకరం వినాయకరావు వరండాలో కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు వెంకయ్యని చూడగానే ఆ నెమ్మదిగా మాట్లాడుకునేది కూడా ఆపేశారు వినాయకం మాత్రం తల ఎత్తలేదు...శంకరం మాత్రం అన్నాడు.
"వెళుతున్నావా మామయ్యా?"
"ఆఁ మీ తల్లీ కొడుకులూ కలిసి నా తలమీద పెద్ద బరువు పెట్టారుగా బాబూ! ఆ బరువు దించుకోవటానికి వెళుతున్నాను. మరలా వస్తానుగా!" అంటూ వెళ్ళిపోయాడు.
సుబ్బులుని తన కోడలిగా చేసుకోవటానికి తల్లి అంగీకరించే వెంకయ్య కోసం కబురు చేసిందని తెలియగానే ముందు బాధపడ్డాడు. తన కంటే జానెడు బారు వుండే ఆ సుబ్బులునా తను పెళ్ళి చేసుకోవలసింది? కాటుక పెట్టుకోకుండానే కాటుక కళ్ళతో వుంటుంది ఛీ!...ఛీ!....తానెంత దురదృష్టవంతుడు? కావేరీ వెళ్ళిపోవటంతో తన మీద ఎన్ని నిందలు సృష్టించారు?
ఒకళ్ళు బాధపడితే చూసి సంతోషించగల మనస్తత్వాలున్న ఈ లోకంలో తానో నీటి బిందువులాంటి వాడు! అన్నగారి మాటని కాదనగల అవకాశం యిప్పుడు వినాయకానికి లేక పోయి అన్నిటికి "మీ ఇష్టం- మీ ఇష్టం!" అని చివరికి వారి మీదనే ఆ భారం వదిలి వేశాడు.
అందుకే వెంకయ్య వైపు చూడలేకపోయాడు.
21
"వేలాయుధం గారువచ్చారు. త్వరగా మేకప్ ముగించుకుని రా కావేరీ! ఆలస్యం చేస్తే వెళ్ళిపోగలరు."
డ్రస్సింగు రూంలో వున్న కావేరీని తొందర చేశాడు వెంకట్రావు బైట నిలబడి.
"వేలాయుధం" అన్న పేరు వినగానే ఫైనల్ గా అద్దంలో తన బింబాన్ని చూసుకుని ఎంతో సంతృప్తిగా ఇవతలికి వచ్చింది. హాలులో కూర్చుని వున్న నల్లటి స్థూలకాయాన్ని చూసి ఆయనే వేలాయుధంగారాని గ్రహించి దగ్గిరకు వెళ్ళి నమస్కరించి ఎదురు సోఫాలో కూర్చుంది ఎంతో వయ్యారంగా.
"అంత దూరంగా కూర్చున్నావేమిటి కావేరీ? యిలా వచ్చి నా ప్రక్కన కూర్చో!" అన్నాడు సోఫాలో చోటు చూపించుతూ.
"మీకు ఎదురుగా కూర్చుంటేనే నా అంద చందాలు ఎక్కువగా మీరు చూసే అవకాశం ఏర్పడుతుందని!" భుజాలను అలఓకగా ఊపుతూ అంది.
"గడుసుదానివే!" అంటూ నవ్వాడు వేలాయుధం. ఆయన నవ్వుతుంటే వళ్ళంతా కదిలిపోయి సోఫా మీదనుంచి ఎగిరెగిరి పడుతుంటే ఆ బరువుని మోయలేక సోఫా కిర్రు కిర్రు మంటోంది. నుదుట పెట్టుకున్న పంగనామాలు ఎదుటి వారికి పంగనామాలు పెట్టేటట్లుగా వున్నాయి.
"గడుసుదానివే!"
అని వేలాయుధం అనగానే కావేరి పెదాలు చిరునవ్వుతోను, గర్వంతోనూ విచ్చుకున్నాయి. యితరులతో ఎలా మాట్లాడవలసిందీ? ఏ విధంగా హొయలు వెళ్ళబోయవలసిందీ సినిమాల్లో ప్రవేసించకముందు తమలోని నటనా చాతుర్యమంతా నిర్మాతల దగ్గిర డైరెక్టర్ల దగ్గిర ఎలా నటించవలసిందీ? ఏ రాగానికి ఏ వాయిద్యం అవసరాన్ని బట్టివాయించుతారో? ఆ విధంగా ఆయా వ్యక్తుల ముందు హావభావాలు ఎలా ప్రదర్శించాలో? ఏ విధంగా మాట్లాడాలో పూర్తి తర్ఫీధుని యిచ్చాడు. ముఖ్యంగా వేలాయుధంలాంటి ప్రముఖ నిర్మాత ముందు ఎన్ని రకాలుగా అభినయించాలో కూడా తను నటించి చూపించాడు.
చెప్పగానే అర్ధం చేసుకోగల కావేరీకి వంటబట్టిపోయాయి. అదీగాక వెంకట్రావుగురించి అంబుజం చెప్పినమాటలు, ఏ స్టూడియోకి వెళ్ళినా వెంకట్రావునిచూసి ఎంతో గౌరవంగా నమస్కరించటం లాంటివన్నీ చూసివుండటంతో తననుకూడా గొప్ప హీరోయిన్ గా చేయగలడన్న పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే తను తెచ్చినవడ్డాణం, గాజులు డబ్బూ అతనిచేతుల్లో వుంచేసింది. పెద్ద గొలుసునిమాత్రం అతనికంట పడకుండా దాచుకోగలిగింది ముందుజాగ్రత్తకొరకు. ట్రంకు పెట్టె బోర్లించి చూపించింది తనమీద నమ్మకం ఏర్పడటానికి అన్నట్లుగా,
