20
"రా మామయ్యా!"
అని శంకరం!
"కూర్చో తమ్ముడూ!"
అని కామాక్షమ్మ అనే సరికి అక్కడున్న కుర్చీలో కూర్చోక తప్పలేదు వెంకయ్యకి! తీరా కుర్చీలో కూర్చున్న తరువాత వినాయకం అన్న మాటలు గుర్తుకు వచ్చి చటుక్కున లేచి నిలబడ్డాడు.
"ఎందుకూ లేచి నిలబడ్డావూ?....కూర్చో!" అంది కామాక్షమ్మ.
"ఎలా కూర్చోను అక్కయ్య!....నీ చిన్న కొడుకు వచ్చి నన్ను ఆ కుర్చీలో నుంచి లేవమని కేకలు వేస్తాడేమోనన్న భయం వుంది!"
"ఏదో చిన్నవాడు! బాధలో వుండి అలా అన్నాడే గాని, కావాలని ఎవరినీ నొప్పించడు. వినాయకం మనసు నీకూ తెలుసుగా? ఎంత మంచివాడో? కూర్చో! కూర్చో!..." అంది నెమ్మదిగా.
"తెలిసో తెలియకో చిన్నవాళ్ళు తొందరపడినా పెద్దవాళ్ళమయిన మనం పట్టించుకోకూడదు!..." అన్నాడు శంకరం.
"అలాంటి వాడిని కాబట్టే కబురు చేయగానే పరిగెత్తుకుని వచ్చాను. నాతో కాగల ఏ పని అయినా యిట్టే చేసి పెట్టగలను అక్కయ్యా! ఏమిటో చెప్పు?" అన్నాడు మరలా కుర్చీలో కూర్చుంటూ!
"నువ్వేమీ అనుకోనంటే ఒకమాట అడగాలని వుంది వెంకయ్య?"
"ఒక్కటేనా అక్కయ్యా?...పది అడుగు! కాదు, వంద మాటలు అడుగు!...నాకు తెలిసినంత వరకూ చెప్పుతాను....తెలియనివి వుంటే మాట్లాడను. సరేనా?....అడుగు అక్కయ్య!"
కామాక్షమ్మ వెంటనే చెప్పలేకపోయింది. లోగడ వాళ్ళంతట వాళ్ళే వచ్చి అడగటం, తాను ముఖం వాచేలా చివాట్లు వేసి పంపటం అన్నీ గుర్తుకు వచ్చాయి. అందుకే వెంటనే మాట్లాడలేక పోతోంది.
తల్లి పరిస్థితిని గ్రహించిన శంకరమే మొదలుపెట్టాడు.
"జరిగినా విషయాలన్నీ నీకూ తెలుసుగా మామయ్యా?...కావేరి అలా వెళ్ళిపోవటం, వినాయకం పెళ్ళి ఆగిపోవటం!...యిలా జరుగుతుందని ఎవరం అనుకోలేదు. కాని జరిగిపోయింది. పెట్టిన లగ్నానికే తమ్ముడికి పెళ్ళి చేయాలని అమ్మ పట్టుపడుతోంది!"
శంకరం పూర్తి చేశాడో లేదో చెప్పటం వెంటనే అందుకున్నాడు__
"ఎవరూ యివ్వలేదా పిల్లని?"
తను చాలా తెలివిగానే మాట్లాడి వాళ్ళని దెబ్బ తీశానని అనుకున్నాడు వెంకయ్య!...
"ఇస్తామని అంటున్నారు! మాకే యిష్టం లేక యింకెవరయినా మంచి అమ్మాయిలు వుంటారేమోనని ఆలోచించితే మీ సుబ్బలక్ష్మి అయితే బాగుంటుందని అమ్మ అంది! అందుకే నీతో మాట్లాడాలని కబురు చేశాం!" అన్నాడు శంకరం!
"అదా విషయం? యింకేమిటోనని హడలి పోయాననుకో అక్కయ్య?"
ఎంతో తాపీగా వుండి యింకెంతో తేలికగా అంటున్న వెంకయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది కామాక్షమ్మ.
తిరిగి వెంకయ్యే అన్నాడు-
"అదీగాక యిప్పటికిప్పుడంటే నా దగ్గిర డబ్బు లేదు. ఎక్కడయినా అప్పు తేగలిగేటంత వెసులుబాటూ లేదక్కయ్య!"
ఆ మాటతో బాధ పడింది కామాక్షమ్మ. తనేమయినా తొందరపడిందా?...లేక తన అవసరం గుర్తించి అలా అంటున్నాడా?..ఆ రోజున తన కూతురిని చేసుకోమని డబ్బుకాక భూమి కూడా కట్నంగా యిస్తానని, మర్యాదలకి లోటు చేయనని బ్రతిమాలిన వెంకయ్య ఇప్పుడిలా అనటంలో మనసులో కోపంగా వున్నప్పటికీ అవసరం తనది కాబట్టి తను శాంతంగానే వుండాలనుకుంది.
తల్లి ఆలోచించటం చూసి శంకరమే అన్నాడు-
"ఎలాగూ మా తరపున చేయవలసిన పనులన్నీ పూర్తి అయిపోయాయి....యిప్పటికిప్పుడంటే నువ్వు మాత్రం ఎక్కడని తేగలవులే మామయ్యా! వీటితోనే సరిపెట్టుకుని పెళ్ళి తంతు ముగించితే సరిపోతుంది కదా?"
"నువ్వు చెప్పిందీ బాగానే వుంది శంకరం!....కాని ఈ పెళ్ళి అనేది నా ఒక్కడి యిష్టమే కాదుగా? మా సుబ్బులుని కూడా అడగాలిగా?"
"పెద్దవాళ్ళుండగా పిల్లలు యిష్టం ఏమిటి వెంకయ్య?" అంది కామాక్షమ్మ.
"మన రోజులు అయిపోయాయి అక్కయ్య!...అదీగాక వినాయకరావు గురించి మా సుబ్బులు కూడా ఏవేవో చెడ్డ మాటలు విన్నదట! మరి వాటినన్నింటికీ అబద్దాలు అని చెప్పి వప్పించాలిగా? అందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను!"
"గిట్టని వాళ్ళకి పనీపాటా లేక నోటికి యిష్టం వచ్చినట్లుగా వాగుతూ వుంటారు. అవన్నీ నిజమని నమ్ముతున్నారా? ఆ కావేరికి వళ్ళు బలిసి అలా పోయింది. ఆ పోయేదేదో లగ్నం పెట్టుకోక ముందే పోయినట్లయితే ఎవరం యింత బాధపడి వుండే వాళ్ళం కాదు?..."
వెంకయ్య మీద చూపించలేని కోపం కావేరి మీద వెడలగ్రక్కింది కామాక్షమ్మ.
తల్లి బాధని గమనించి శంకరం అన్నాడు కావాలనే!
"సరే! మీరు మీరు ఆలోచించుకోండి! కాని మా తమ్ముడి పెళ్ళికి పెట్టుకున్న లగ్నం టైం రేపురాత్రి పదిగంటల ముప్పైఎనిమిది నిముషాలకని నిర్ణయించారు. అయితే మీ సుబ్బులు!....లేకపోతే సూరయ్యగారమ్మాయిని యిస్తామన్నారు....ఏదో వ్యవసాయం గురించి ఎడ్లను గురించి బాగా తెలుసు! ఒక గ్రామస్థులే కాబట్టి వినయకానికి సహాయంగా వుంటావన్న ఉద్దేశ్యంతో పిలిపించాం...ఆపై మీ యిష్టం...కాదంటే సూరయ్యగారికి కబురు చేస్తాను!"
అంటూ యింక అక్కడ వుండకుండా బైటికి వెళ్ళిపోయాడు.
సూర్య అనగానే వెంకయ్యకి పై ప్రాణం పైనే పోయింది. వినాయకంలోని లోపాన్ని అందరికీ చెప్పి నమ్మించినట్లుగానే సూర్యగారిని కూడా నమ్మించాలని పనిగట్టుకుని చీకట్లోపది ఆ గ్రామం వెళ్ళాడు. సూరయ్యకి అయిదుగురు ఆడపిల్లలు! యిద్దరమ్మాయిలకే పెళ్ళి చేయగలిగాడు. యింకా ముగ్గురు ఆడ పిల్లలు వున్నారు, ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని యిచ్చి వినాయకానికి పెళ్ళి చేస్తాడేమోనన్న భయంతోనే అక్కడికి చేరాడు. లాంఛనప్రాయంగా కుశల ప్రశ్నలు అయినా తరువతః వెంకయ్య అడిగాడు.
"ఈ విషయం విన్నావా సూరయ్యన్నా?"
"ఏమిటది?"
"కామాక్షమ్మ కొడుకు పెళ్ళి ఆగిపోయింది. మేనకోడలినే కావాలనుకుని ఊరేగి ఎర్రగా బుర్రగా వుందని తనకి వున్న బంగారమంతా ఆ పిల్లకి పెట్టింది. అన్నీ తీసుకుని ఎవడినో లేపుకుని పోయింది. వీడోట్టి ఆడారి వెధవ అని ఆ పిల్లకి తెలిసిపోయిందయ్యా బాబూ!"
"పెళ్ళి కాకుండానే ఆడారివాడని ఆ పిల్లకి ఎలా తెలుస్తుందయ్యా? నీదంతా సోధ్యం కాకపోతేనూ?" విసుక్కున్నాడు సూరయ్య!
"అబ్బో! మీరలా అనక ఇంకేమంటారు లెండి! రోజూ చూసేవాడిని నేను! దూరంలో వున్న మీకేమి తెలుసు? ఆ పిల్లని రోజూ సైకిలెక్కించుకుని స్కూలుకి తీసుకెళ్ళటం, వాళ్ళమ్మకి తెలియకుండా సైకిల్ మీద రెండవ ఆట సినిమాకి వెళ్తామని పరంధామయ్యని నమ్మించి యిద్దరూ బ'స్తీ' పోయేవారు. అప్పుడే ఈ నిజం ఆ అమ్మాయికి తెలిసిందట. ఎంత మొత్తుకున్నా వినకుండా ఆస్తిగల అల్లుడు కావాలని ఆ పిల్లమాట వినకుండా లగ్నం పెట్టించాడు. అలాంటి వాడిని చేసుకోవటం దేనికని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ పరంధామయ్య వీధిలోకి వస్తే వట్టు."
