సంగయ్య మంచం కిందనుంచి లేచి ఇవతలకి వచ్చాడు. తలొంచుకుని నుంచున్నాడు.
"ఎన్నాళ్ళ నుంచీ ఈ వ్యవహారం సాగుతున్నది సంగయ్యా!"
"క్షమించండమ్మా!" అన్నాడు సంగయ్య ముందు ఇక్కడ నుంచి మర్యాదగా బైట పడితే తర్వాత సంగతి చూసుకోవచ్చు అనుకున్నాడు.
"నేనడిగింది ఎన్నాళ్ళ నుంచి ఈ గదిలోకి రాత్రిళ్ళు రహస్యంగా వచ్చి పోతున్నావ్ అని....!"
"ఇవాళనే మొదటిసారి వచ్చాను," సంగయ్య చెప్పాడు
"నమ్మమంటావా!"
"భగవంతుడి సాక్షి"
"రాణి"!
"ఏంటీ"!
"ఇవాళనే సంగయ్య నీ గదిలోకి వచ్చింది."
"అవును."
"తాతయ్య మీద వట్టు అని చెప్పు."
"తాతయ్య మీదవట్టు."
"సంగయ్యా ఎంతసేపటి నుంచి గదిలో వున్నావు రాణి నేం చేశావ్."
"ఈ సారికి తప్పు క్షమించడమ్మా! రాణిని ఏమీ చేయలేదు. నేయిలా వచ్చాను. వెంటనే మీరు వచ్చారు. వెంటనే మంచం కింద దూరాను. ఓరోజు రాణి సినిమా హీరోలని ముద్దు పెట్టుకుంటుంటే చూశాను. రాణి వెర్రిది కదా మాయమాటలు చెప్పి ఈ బొమ్మలు చూపి వశపర్చు కుందామని ప్లాను వేసి వచ్చాను. లైటు ఆర్పబోయే సరికి కెవ్వున కేక వేసింది. చీకటి అంటే భయం అంది. కిటికీ వేశాను బొమ్మలు చూపిద్దాంకదా అనుకుంటూన్నాను మీరొచ్చి తలుపుకొట్టారు. రాణిని నేను ముట్టుకోను కూడా ముట్టు కోలేదు. ఈ వక్కసారికీ తప్పు కాయండి." వివరంగ జరిగింది చెప్పాడుసంగయ్య.
"ఏం జరిగిందో నీవు కూడా చెప్పు రాణీ" సతీదేవి అంది.
కీర్తి కూడా సంగయ్య చెప్పిందే చెప్పింది.
సతీదేవి ఓ నిట్టూర్పు విడిచింది. "మన బంగారం మంచిదైతే అనుకునే పనేముంది, కాని రాణి ఉత్త వెర్రి పిల్ల. అది కనిపెట్టి యింత దరిద్రపు పనికి దిగటం మనిషి చేయాల్సిన పని కాదు. సంగయ్యా మరోసారి ఇలాంటి పనికి పూనుకున్నా రాణి వైపు కన్నెత్తి చూసినా నిన్ను క్షమించేది లేదు. అది మాత్రం గుర్తుంచుకో మొదటి తప్పు కాబట్టి ఈ సారికి వదులు తున్నాను. వెళ్ళు" అంది.
సంగయ్య బ్రతుకు జీవుడా అని వెళ్ళబోయాడు.
"ఆ ముదనష్టపు బొమ్మలుతీసుకొని వెళ్ళు."గసురుతూ చెప్పింది సతీదేవి.
సంగయ్య బూతు బొమ్మలు వున్న కాగితాలను తీసుకున్నాడు.
"ఆ బొమ్మలు నేను చూడలేదు." కీర్తి అంది.
"నోరు ముయ్యి, సిగ్గులేకపోతేసరి, ఇంత అయోమయం మేళాన్ని నేను ఎక్కడా చూడలేదు." సతీదేవి అంటుంటే సంగయ్య నిమ్మదిగా అక్కడ నుంచివెళ్ళిపోయాడు.
తను గదిలోకి వెళ్ళంగానే చటుక్కున లైటు ఆర్పేశాడు. రాణి వెర్రిపిల్ల అని తెలిసి తను తెలివి తక్కువగా తొందర పడ్డాడు. ఒక్కసారి గదంతా చీకటి అయేసరికి రాణి భయపడి అరిచింది. దాంతో ఆ రాక్షసి పరుగెత్తుకుంటూ వచ్చింది. అంతా తను లేచిన వేళ యిలా అఘోరించింది. బంగారంలాంటి అవకాశం నోటిదాకా వచ్చిపోయింది.
ఇలా అనుకున్నాడు సంగయ్య.
సంగయ్య అలా అనుకోవటమే కావాల్సింది కీర్తికి సతీదేవికి.
సంగయ్య వెళ్ళిం తరువాత కీర్తిని కోప్పడి నీతులు చెప్పి ఆడపిల్లలు జాగ్రత్తగా వుండాలి. మీ తాతయ్య వచ్చిందాకా ఏ మగాడితో మాట్లాడకు....అని మందలించింది సతీదేవి.
"నేను మా తాతయ్య వస్తే మా వూరు వెళ్ళిపోతాను." అంది కీర్తి.
"నేనే పంపిస్తాను." అంది సతీదేవి.
ఎవరైనా చాటుగా వుండి గమనించినా విన్నా ప్రమాదం రాకుండా వుండటానికి ఇరువురూ సహజంగ మరికొద్ది సేపు నటించారు. ఆ తర్వాత సతీదేవి గదిలోంచి బయటికి వచ్చింది.
కీర్తి లోపల గడియ బిగించుకుని పెద్దలైటు తీసి చిన్నలైటు వేసుకుని మంచంమీద పడుకుంటూ తృప్తిగా అనుకుంది.
"సంగయ్యా నీ మాయరోగం టక్కునకుదిర్చాకదూ!"
32
సాయంత్రం అయిదు దాటింది.
కీర్తి పెరట్లోకి వెళ్ళింది.
రోజూ సాయంత్రం పూట కీర్తి పెరట్లోకి వెళ్ళి రకరకాల పూలు వడినిండా కోసుకు వచ్చి రకరకాల దండలు కట్టి అందరికీ పంచి దేముడి గదిలోకొన్ని వుంచి తనో తట్టెడు పూలు జడలో పెట్టుకుంటుంది.
ఇలా చేయటం కీర్తికి మూడు విధాల వుపయోగపడుతున్నది.
పూలు కోసి మాలలు కట్టటం కాలక్షేపం.
అన్ని పూలు కోసి అన్నన్ని దండలు కట్టటం, వెర్రి పిల్ల అనిపించుకునే దానిలో ఓ భాగం.
