వ్యక్తిగత బలహీనత అనేది ఒక కారణం అనిపిస్తున్నది. డ్రగ్ స్మగ్లింగ్ యధేచ్చగా జరగడం వల్లనే యువతరం అధికంగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారనిపిస్తున్నది. ఇది పట్టణాలలో మరీ విచ్చలవిడిగా ఉన్నది.
డ్రగ్ ఎడిక్షన్ కూడా ఒక విధంగా వ్యాధి వంటిదే. ఎవరైనా మత్తుమందును తొలిగా బాధలు మరచిపోవడానికి కాని లేదా, సరదా కోసం కాని వాడితే, తరువాత తరువాత త్వరత్వరగా అది అలవాటుగా మారుతుందనడంలో సందేహం లేదు.
అది తాత్కాలికంగా మనిషి మానసిక పరిస్థితిని మెరుగుపరచినట్టు కనిపించినా, క్రమేణా కృంగదీసి మరింత అనారోగ్యాన్ని కలుగజేస్తుంది.
ఉదాహరణకు ఎవరైనా మార్ఫిన్ ఇంజక్షన్ రూపంలో ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున తీసుకుంటే, మళ్ళీ ఆ మందు లేకుండా తట్టుకోలేని స్థితికి ఇరవై నాలుగు గంటలలోపే వచ్చేస్తారు.
ఒక మనిషి మత్తు మందును దీర్ఘకాలం పాటు వాడితే, ఆ మందు తన శరీరంలో ఆ తరువాత ఏ కారణం చేతనైనా పడనప్పుడు తన శరీరం తనకే సహకరించని స్థితికి అతను తేలికగా వచ్చేస్తాడు. దీనినే 'ఎడిక్షన్' అంటారు.
తరువాత తరువాత రోగి శరీరం, మెదడు పూర్తిగా అదుపుతప్పి ఫిజికల్ డిపెండెన్స్ కు, ఎమోషనల్ డిపెండెన్స్ కు గురవుతారు. అంటే డ్రగ్ దొరకనప్పుడు తీవ్రమైన ఉన్మాదానికి గురికావడం, శరీరం నిస్సత్తువై వ్రేలాడిపోవడం జరుగుతుంది. దీనినే విత్ డ్రాయల్ సిండ్రోమ్ గా చెప్పవచ్చు.
ప్రస్తుతం సాహితి పరిస్థితి అదే స్థితిలో ఉంది. సమ్రాట్ ను మరచిపోలేకపోవడం, బిందుమాధవి గడప దాటనివ్వకపోవడం ఆమెను టెన్షన్ కు గురిచేశాయి.
దానితో తాత్కాలిక ఉపశమనం కోసం సాహితి డ్రగ్స్ కు అలవాటు పడింది. మరొకవైపు ఆమె ఆహారం సరిగా తీసుకోకపోవడం వలన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, కోలుకోలేని స్థితిలో పడివుంది.
అనూష ఎంత బ్రతిమిలాడినా, సాహితి కోలుకునే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని భీష్మించుకుని కూర్చుంది బిందుమాధవి.
సాహితికి యిచ్చే ట్రీట్ మెంట్ గురించి బంధువులు, స్నేహితులు ఆమె పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ విపులంగా చెప్పాడు.
ఎవరైనా సరే తనను తను మానవునిగా మలచుకునేందుకు సహాయపడేవి శక్తి_సామర్ధ్యాలు, మానసిక స్థయిర్యమే కాని, డ్రగ్స్ కాదు!
మత్తు మందు వాడకాన్ని మానుకోవడం అంత తేలిక కాకపోవచ్చు కాని అసాధ్యం మాత్రం కాదు. అయితే ఇందుకు రోగి మాత్రమే కాక, ఆమె కుటుంబం, చికిత్స చేస్తున్న డాక్టరు లేదా, వైద్య బృందం చాలా కష్టపడవలసి వుంటుంది. అంచెలంచెలుగా విముక్తిని సాధించవచ్చు.
మొదటి దశలో సాహితి డ్రగ్స్ ను అసహ్యించుకుని తనను తను బాగుపరచుకునేందుకు సిద్ధపడాలి. అంటే చికిత్సపట్ల సుముఖతను చూపాలి. ఆ క్రమంలో ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకుని కోలుకునేందుకు బలంగా నిర్ణయించుకోవాలి.
రెండవ దశలో ఆమె 'విత్ డ్రాయల్ సిస్టమ్స్'ను ఎదుర్కొనేందుకు ఇతర మందులు ఔషధాలు వాడి, తక్కువ భయాందోళనలకు, అంతకంటే తక్కువ మానసిక వైకల్యానికి గురయ్యే చూడాలి.
చాలా నిదానంగా మనసు, శరీరం ఆమె స్వాధీనంలోకి వచ్చేటట్టు కృషి చేయాలి. అందుకామె సహకరించకపోవడం కూడా సహజమే. కేకలు పెట్టి, గొడవచేసి, బెదిరించి తనను తను హింసించుకుని మత్తుమందులు పొందాలని చూడవచ్చు.
ఈ దశలో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ. ఇదే అందరికీ పరిక్షా సమయం.
మూడవ దశలో భౌతికంగా, మానసికంగా, సామాజికంగా కోలుకున్నప్పుడు ఆమె తిరిగి మామూలు మనిషిగా అవుతుంది.
డాక్టరు చెప్పిన ట్రీట్ మెంట్ వ్యయ ప్రయాసలతో కూడినదైనా, సాహితిని తిరిగి మామూలు మనిషిని చేయవచ్చుననే నమ్మకం కలిగింది బిందుమాధవికి.
అప్పుడే హాస్పిటల్ వరండాలో అడుగుపెట్టిన సమ్రాట్ ను చూడగానే బిందుమాధవి ముఖం జేవురించింది.
క్రోధంతో ఆమె పళ్ళు పటపటలాడాయి. సాహితిని ప్రేమ పిచ్చిలో పడవేసి, ఆమెను ఈ స్థితికి తెచ్చినందుకు అతనిని నిలువునా కాల్చివేయాలనిపించిందామెకా సమయంలో.
తొందర పడవద్దని అనూష ఆమెకు కళ్ళతోనే సైగ చేసింది.
సాహితి ఉన్న గదిలోకి సమ్రాట్ వెళ్ళబోతూండగా, బిందుమాధవి చేయి అడ్డుపెట్టింది.
"అనూషా! వెంటనే అతన్ని ఇక్కడనుంచి వెళ్ళిపొమ్మనిచెప్పు." ఆవేశంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. ప్లీజ్, అస్క్ హిమ్ టు గెట్_అవుట్!" బిందుమాధవి ఆవేశంగా విరుచుకుపడింది.
అనూష ఆమెను భుజంతట్టి ఊరడించింది.
"ప్లీజ్! నన్ను ఒక్కసారి సాహితిని చూడనివ్వండి!" సమ్రాట్ అభ్యర్థించాడు.
"మిష్టర్ సమ్రాట్! ఆంటీ చెప్పింది వినబడలేదా, లేక అర్థం కాలేదా? మీరు మర్యాదగా ఇక్కడనుంచి వెళ్ళిపోవడం మంచిది."
"అనూషా! ఇది చాలా అమానుషం! నేను ప్రేమించిన అమ్మాయి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నన్ను కనీసం చూడనివ్వరా? అంత ఘోరమైన నేరం నేనేం చేశాను?"
"సాహితి చావుబ్రతుకుల్లో ఉంటే ఇక్కడకు కూడా దాపురించావా? గొడవ పెట్టడానికే వచ్చావా? నువ్వు నిజంగా మనిషివే అయితే, మానవత్వం అనేది ఏమాత్రమైనా ఉంటే, వెంటనే ఇక్కడనుంచి వెళ్ళు!" బిందుమాధవి ఈసడింపుగా అంది.
"సారీ మేడమ్! నేను మనిషిని అవునో కాదో, నాలో మానవత్వం ఉందో లేదో నిర్ణయించడానికి మీరెవరు? అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్టాడటం మీకు తగదు."
"సమ్రాట్! మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఇక్కడ గొడవలు పడడం అనవసరం. ఆంటీ చెప్పినట్టు రాద్ధాంతం చేయకుండా వెళ్ళిపోండి. ప్లీజ్!" అనూష అనునయంగా అంది.
"నేను సాహితిని చూడాలనుకోవడం అన్యాయమా? నేను లోపలకు వెళ్ళాలనుకోవడం రాద్ధాంతమా? మీ మనసులు నా మీద పగ, ద్వేషంతో నిండిపోయాయి. నా బాధను మీరెవరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు" సమ్రాట్ ఆవేశంగా అన్నాడు.
