అతని మనస్సు ఇప్పుడు కొద్దిగా తృప్తి చెందింది.
20
"ఏమిటీ! మరోసారి చెప్పండి!" అంది వకుళాంబ.
"టాక్సీ మాట్లాడి తీసుకువస్తాను అంటున్నాను!" భార్య సరిగ్గా వినలేదేమోనని మళ్ళీ సరిగ్గా చెప్పాడు రామానుజాచారి.
"మనం ఇప్పుడు అర్జంట్ గా వెళ్ళాలి అంటే బస్సుకి టైము అయిందేమో అనుకున్నాను. టాక్సీల్లోనూ, విమానాల్లోనూ తీసుకు వెళతారని అనుకోలేదు. టాక్సీలో వూరేగటానికి డబ్బు మూట్లేమీ నేను నారొంటిన దోపుకురాలేదు." ఈసడింపుకి, నిష్టూరాన్ని జతచేస్తూ అంది వకుళాంబ.
వకుళాంబ పరమ గయ్యాళి. విషయం వివరంగా చెప్పినా వినే రకం కాదు. అలాంటిది, విషయమేదో చెప్పకుండా "తొందరగా వెళదాం, తొందరగా వెళదాం" అని ఆపై టాక్సీ మాట్లాడుకుని వస్తానంటే ఆవిడికి చిర్రెత్తుకురాక ఏం చేస్తుంది.
భార్య తత్వం బాగా తెలిసిన రామానుజాచారి, "మనం ఇప్పుడు అర్జంట్ గా వెళ్ళాలి అని చెప్పాను కదా! టాక్సీలో వెళుతూ అసలు విషయం చెబుతాను." కొద్దిగా విసుక్కుంటూ అన్నాడు.
ఇన్నేళ్ళ కాపురంలోనూ, భార్య మాట వినటం ఆరుగురు ఆడపిల్లలకి, మగపిల్లాడికి తండ్రి కావటం అంతవరకూ సాధించాడు గాని, భార్యతో ఎలా మాట్లాడితే, తొందరగా పని అవుతుందో, మెలకువగా వ్యవహరించటం లాంటిది రామానుజాచారికి పెద్దగా తెలియదు.
లాభం లేని పరిస్థితుల్లో మోహనరావు అయిదు వందలూ ఇవ్వటం, వాళ్ళ వాళ్లకి కలిగిన ఆపద, భార్యకి వివరించాడు రామానుజాచారి.
"విషయం చెప్పకుండా టాక్సీ పిలుస్తా అంటే నాకేమి అర్థం అవుతుంది." అప్పటికప్పుడే తీవ్రాలోచన చేస్తూ అంది వకుళాంబ.
భార్యకి అర్థమైనందుకు ఆనందిస్తూ "అయితే వెళ్ళి టాక్సీ పిలుచుకు వస్తాను!" అన్నాడు రామానుజాచారి.
"అంత అవసరం లేదు." టకీమని అంది వకుళాంబ.
"అదేమిటే!" అంటూ రామానుజాచారి తెల్లబోయాడు అంతేకాని,
ఆమె అంతరంగంలోని ఆలోచనలని ఆయన పసిగట్టలేకపోయాడు.
మోహనరావుది వాళ్ళ వూరేగాని, శివరావు వాళ్ళది వాళ్ళ వూరుకాదు. శివరావు ఎవరో! పార్వతి ఎవరో! ఆవిడకి తెలియదు. కాబట్టి ఆవిడకి ఆ విషయం అంత గాభరాగా అనిపించలేదు. కళ్ళముందు ఐదువందల రూపాయలు కనిపిస్తున్నాయి కానీ, ఒక పసివాడి ప్రాణం గురించి ఆలోచించి బాధ పడేటంత గాభరా లాంటిదేమీ ఆవిడకి కానరావటం లేదు.
బస్సు యాక్సిడెంట్ అయితే దానిలో తనకి సంబంధించిన వాళ్ళు వుంటే ఎవరైనా గాభరా పడతారు. భయపడతారు. ఇంకేమయినా పడతారు. ముక్కూ ముఖం తెలియని వాళ్ళకి బస్సు యాక్సిడెంట్ కు గురిఅయ్యి మరణిస్తే...... తెల్లారి లేస్తే చాలు, ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని వినాలో, అన్నట్లు నోరు చప్పరించేసి వూరుకుంటారు. సర్వసాధారణంగా చాలామంది విషయంలో ప్రతినిత్యం జరిగేదిదే. ముక్కూ ముఖం తెలియని శివరావు కొడుకుకి ప్రాణం మీదికి వచ్చినందువల్ల, వకుళాంబకి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. అందువల్ల నోరు చప్పరించేసి వూరుకుంది.
"మనం వూరికే వెళ్ళటం లేదు. అతను డబ్బు కూడా ఇచ్చేశాడు. అతను డబ్బుతో మనం దర్జాగా ముందు ఆ వూరు వెళుతున్నాం అది గుర్తుంచుకో!" అన్నాడు రామానుజాచారి.
"సరేలెండి! ఆ మాత్రం బుద్ధీ జ్ఞానం నాకు లేకపోలేదు. ముసలాయన ఆ పిల్లాడి దగ్గరికి నిన్ననంగా చేరి వుంటాడు. మనిషిని రక్షించాలన్నా, భక్షించాలన్నా మన చేతుల్లో ఏమీలేదు. అంతా ఆపైవాడే చూసుకుంటాడు. మనం బస్సులోనే వెళదాం" తన నిర్ణయం గట్టిగా చెప్పేసింది వకుళాంబ.
