Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 45


    "హలో...హలో..." ఆత్రుతగా పిలిచాడు వర్ధనరావు. ఆ వెంటనే గ్రహించి భారంగా నిట్టూర్పు విడిచి రిసీవర్ ని క్రెడిల్ మీద పెట్టేశాడు.


    "ఏమైంది సార్!" ఆత్రుతగా అడిగాడు అహోబిలం.


    బాస్ గాడు ఫోన్ లో ఏం చెప్పాడో అదంతా చెప్పాడు అహోబిలంకి.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తన సహజ గుణంతోను అధికార దర్పంతోను అహోబిలాన్ని అప్పుడప్పుడు మందలిస్తుంటాడు. అంతకుమించి తప్ప కోపము కసి లాంటివి ఏమీలేవు.


    అంతా విని "వీళ్ళిద్దరూ పారిపోయారని బాస్ గాడితో చెప్పకపోయారా సార్!" అహోబిలం అన్నాడు.


    "హెడ్ కానిస్టేబుల్ కాంగానే సరికాదయ్యా హెడ్ వుండాలి. వాళ్ళిద్దరూ మంచివాళ్ళని నమ్మి ఇద్దరిని విడిచి పెట్టింది మనం అవునా?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అడిగాడు.


    "వాళ్ళు తెలివిగల దొంగలు సార్! విడిచి పెట్టవద్దని" ఆనాడే అహోబిలం చెప్పాడు. వర్ధనరావు వినలేదు. "వీళ్ళు మంచివాళ్ళని నేనంటుంటే నీవు కాదంటావేమిటి? ఈ స్టేషన్ కి హెడ్డుని నేను. నీవు ఉత్త కానిస్టేబుల్ వి మాత్రమే." అంటూ తన హోదా గుర్తు చేశాడు. దాంతో "మీ ఇష్టం సార్! మీ తెలివి ముందు నాదెంత?" అని ఉబ్బేసి తప్పుకున్నాడు అహోబిలం.


    తను చేసిన పనిలో కాస్త తొందరబాటు పిసరంత తప్పు వున్నట్లు తోస్తేచాలు పక్కవాళ్ళనికూడా తనలో కలుపుకుంటాడు వర్ధనరావు. ఇప్పుడు మాట్లాడింది కూడా అందులో భాగమే.


    అహోబిలం గ్రహించాడు.


    "నేనెక్కడ చెప్పాను సార్!" అంటే అదో తప్పు అంతకన్నా ఆయన తాన అంటే తాను తంధాన అంటే సరిపోతుంది అనుకున్న అహోబిలం.


    "విడిచి పెట్టాము సరే. అయితే ఇప్పుడేమయింది సార్!" వినయంగా అడిగాడు.


    "ఈ విషయం బాస్ తో చెపుదామనుకున్నాను. ఆ బాస్టర్డ్ సాంతం నా మాట వినకుండానే ఫోన్ పెట్టేశాడు."


    "అదీ మంచిదే సార్!"


    "మంచిదా! ఎలా! ఎలా మంచిదో చెప్పు. ఊ... క్విక్."


    "మనం వాళ్ళని విడిచిపెట్టినట్టు బాస్ గాడికి తెలిసి ఈ విధంగా నాటకం ఆడుతున్నాడేమో?"


    "నీ మాటలు కాసేపు నిజమేననుకుందాము. బాస్ గాడు ఎందుకు నాటకం ఆడుతున్నట్లు? అదీ చెప్పు!"


    "మిమ్మల్ని ఫూల్ చేయటానికి...మిమ్మల్ని భోరున ఏడిపించటానికి...అని ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి చెపితే తన హెడ్ వూడి కింద పడేలా చివాట్లు పెడతాడేమోనని...తెలివిగా మాట తప్పిస్తూ "నాకన్నా మీరు తెలివిగలవారు సార్! మీరే ఆలోచించండి. అయిడియా వస్తుంది" అంటూ తప్పించుకున్నాడు అహోబిలం.


    "అంతేనంటావ!"


    "సరీగా అంతే సార్!"


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తీవ్రాలోచన చేస్తూ వుండగా మరోసారి ఫోన్ మోగింది. చటుక్కున రిసీవర్ తీసి వర్ధనరావుకి అందించాడు అహోబిలం.


    వర్ధనరావు రిసీవర్ అందుకుంటూనే ఇంకేమీ ఆలోచించలేదు.


    "బాష్టర్డ్ నన్ను చూస్తే నీకు ఆటలుగా వుందా?" అంటూ అవతలివాడి గూబ అదిరేలా అరిచాడు.


    "ఇన్ స్పెక్టర్ సాబ్!" అవతలినుంచి కంగారుగా వినిపించింది.


    "కంఠస్వరం మారిస్తే ఆమాత్రం కనుక్కోలేననుకుంటున్నావా బాస్ కా బోసుడికా!" అంటూ తింగిరి తిట్టు తిట్టుకున్నాడు వర్ధనరావు.


    "నేను సార్! విజయ్ ని. చాలా పెద్ద ఆపదలో వున్నాను" అవతలి నుంచి విజయ్ కంఠస్వరం వినిపించింది.


    "నువ్వా!" వర్ధనరావు తగ్గిపోతూ అన్నాడు.


    "నేనే సార్!"


    "రోజూ స్టేషనుకి వచ్చి నాకు కనపడి సంతకం చేసి వెళ్ళమన్నానా లేదా! నమ్మి విడిచి పెట్టినందుకు మోసం చేస్తావా! అసలు ఇప్పుడు దర్జాగా ఫోను చేయటంలో అర్థం ఏమిటంట అహ ఏమిటంట?"


    "మీలాంటి గ్రేట్ ఇన్ స్పెక్టర్ సార్ తిట్టినా బాగానే వుంటుంది సార్! మేము చాలా పెద్ద ఆపదలో వున్నాం సార్! ఇది అర్జంట్ ఫోన్ సార్! అర్థం చేసుకోండి సార్!"


    "ఆపదా! ఆపదేమిటయ్యా! నిక్షేపంగా ఫోన్ చేస్తూ?"


    "పరుగెత్తుకుంటూ వచ్చి పబ్లిక్ టెలిఫోన్ లో దూరి మీరైతే రక్షిస్తారని ఫోన్ చేశాను సార్!"


    "నీవు చెప్పింది నమ్మమంటావ్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS