వింటున్నాడు శశాంక నిర్లిప్తంగా.
"శశాంకా... నాకు తెలుసు ఇక్కడ పెరిగిన నేను ఎందుకిలాంటి జీవితాన్ని ఆశ్రయించాను. ఒకనాడు నీ చేత దెబ్బతిన్న నేను నిన్నెందుకు ఇలా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాననీ నువ్వాలోచిస్తున్నావు. నేను మార్గం తప్పిన వాడ్నే కాని దుర్మార్గుడ్ని కాను. అసలు అమ్మ నీడలో పెరిగిన వాళ్లెవరూ దుర్మార్గులు కాలేరు... అతిశయోక్తి అనుకోకు శశాంకా... ఇది నిజం. పుట్టుకతోనే అమ్మ పొత్తిళ్ళ నుంచి బహిష్కరించబడిన పసికందుల కోసం అమ్మ ఎందుకింత తపించి పోతుందీ మాకు తెలీదు. కాని తెలిసింది ఒక్కటే. అలసట ఎరుగని అమ్మ అనుక్షణం ఆలోచించేది ఇక్కడ పెరిగే పిల్లల గురించే. జోల పాడుతుంది, బుజ్జగిస్తుంది, కథలు చెబుతుంది, కన్నీళ్ళు తుడుస్తుంది. ఇక్కడ పెరిగి వెళ్ళినవాళ్ళు కొందరు జీవితంలో సెటిలైపోయారు. మరికొందరు నాలాగే జీవితంతో కుస్తీలు పడుతూ బ్రతుకు తెరువుకోసం యాత్ర మొదలుపెట్టారు. ఈ గడపదాటి వెళ్ళిన వాళ్ళలో అమ్మనెంతమంది గుర్తుంచుకున్నారో నాకు తెలీదు... కాని నేను మాత్రం అమ్మని విడిచి వెళ్ళలేకపోయాను. అది నా బలహీనతను... బంధమను... ఇక్కడే పెరిగిన నేను అమ్మకు ఆసరా కావాలనుకున్నాను. అర్థాకలితో నలిగే పసికందులకి నేనూ అండగా మిగలాలనుకున్నాను. అందుకే ఏ దారీ లేక నేను అమ్మకోరని దారిలో అడుగుపెట్టాను" ఓ క్షణం ఆగేడు. "ఒకనాడు ఇక్కడ ఆర్ధిక పరిస్థితి దారుణంగా క్షీణించిపోయిన రోజు తొలిసారి దొంగతనం చేసాను. పోలీసులకి పట్టుబడ్డాను. ఆ రోజు అమ్మ పెట్టుకున్న కన్నీళ్లు నేను ఇప్పటికీ మరచిపోలేను శశాంకా..."
ఒక చిన్న మలుపుతో మారిన జీవితం తప్ప తన కథా ఇంచుమించు అలాంటిదే అనుకున్న శశాంక నిర్లిప్తంగా చూస్తూ వుండిపోయాడు.
"ఆ తర్వాత ఇక దొంగతనం చేయనని ఒట్టేసాను. ఆ మాటమీదే నిలబడ్డాను. సరిగ్గా అలాంటి స్థితిలో వుండగా నాకు ధనుష్కోటి దగ్గర డ్రైవరుగా నీడ దొరికింది. నిజం చెప్పాలంటే నేను నేరస్థులైన వాళ్ళ దగ్గర పనిచేస్తున్నానే తప్ప, నేను నేరం చేయలేదు. అందుకే ఆ రోజు మామూలుగా నేను దెబ్బతిన్నా మీ మీద కోపం తెచ్చుకోలేదు. శశాంకా... క్రిముల్ని కప్పలూ, కప్పల్ని పాములూ, పాముల్ని రాబందులూ తినే ప్రకృతి సహజమైన ఈ ప్రోసెస్ లో మీరు మీకు తెలిసిన న్యాయాన్ని నిర్వర్తించారని అనుకున్నానే తప్ప మిమ్మల్ని ఎందుకు ద్వేషించాలి... ఆ రోజు ధనుష్కోటి హత్యలో అతడి సామ్రాజ్యమే చిన్నాభిన్నమై పోయింది. అంత బలంగా దెబ్బతీసిన మీరు నా దృష్టిలో ఎంత గొప్ప హీరో అయిపోయారూ అంటే మీ పరిచయం కోసం వెంపర్లాడుతూ మిమ్మల్ని అనుసరించాను. మీకూ, వినీల గారికీ వున్న స్వేహాన్ని ఆసరాగా తీసుకుని మీరు కుమార్ దాదా దగ్గరకి వెళ్ళడం చూసి ఆమెకు తెలియపరచి ఆమె కారుకి డ్రైవర్ గా అవతారమెత్తాను తాత్కాలికంగా అయినా..."
"ఇప్పుడు అన్నపూర్ణమ్మగారికి జవాబేం చెబుతావు?" అడిగాడు శశాంకా.
"ఒక్కోసారి ధనుష్కోటి జీతంతోపాటు 'టిప్'గా ఇచ్చే వేలకొద్ది రూపాయిల విషయంలో ఎలా అబద్ధం చెప్పి అమ్మకిచ్చేవాడ్నో ఇదీ అలాగే..." నవ్వేసాడు మామూలుగా. "ఎక్కడో జరిగిన దొంగతనానికి అప్పుడెప్పుడో దొంగగా ముద్రపడిన నన్ను పోలీసులు మీతో కలసి మాటాడుతున్నప్పుడు వెంటపడేసరికి ఇలా కలసి వచ్చేసాం అంటాను. ఫర్వాలేదు శశాంకా... ఈ మధ్య నా విషయంలో అమ్మ ఇలాంటి సన్నివేశం ఎదుర్కోలేదు కాబట్టి నమ్మేస్తుంది..."
ఆ తర్వాత ఏడు గదులుగా విభజించబడి వున్న శరణాలయాన్ని ఒక్కో గదిలో పసిపిల్లల కోసం 'బెర్త్స్'లా అమర్చబడిన మంచాల్ని ఏడాది వయసు మొదలుకొని పదిహేనేళ్ళ ప్రాయం దాకా వున్న సుమారు వందమంది పిల్లల్ని చూపించాడు.
అక్కడ అన్నపూర్ణమ్మకి సహకారంగా వున్నది మధ్య వయస్కుడైన ఓ గుమాస్తా, మరో ముసలి ఆయా మాత్రమే.
అది మాత్రమే కాదు శశాంక జాగ్రత్తగా గమనించింది.
పిల్లలందరిలో చెదిరిపోని ఉత్సాహంతో పాటు తొడుక్కున్న బట్టల్లో, కప్పుకున్న దుప్పట్లలో నేపథ్యంగా కనిపిస్తున్న నిస్సహాయత. అదే అణువంతైనా కదిలించింది.
"ఈ స్థలం ప్రభుత్వానిదేనా?"
"అంతోటి గుర్తింపు కూడానా... ఈ బిల్డింగూ, ఈ జాగా అంతా అమ్మ తాలూకా ప్రాపరీయే శశాంకా. వేదికలకీ, ఉపన్యాసాలకీ మాత్రమే పరిమితమై పోయిన ప్రభుత్వ సంక్షేమం ఇక్కడ దాకా విస్తరిస్తే అమ్మ ఇంత హైరానాపడే ఆగత్యమే ఉండేది కాదు.
స్థాణువైపోయాడు శశాంకా.
అనిబిసెంటు, థెరిసాల జీవితాలు ఎందుకు చరితార్థంగా మిగిలిపోయిన్దీఫ్ ఆలోచించడం లేదతడు. ఏ చరిత్రనీ ఆశించకుండా ఓ మూల ఆరిపోతున్న దీపాలకు అరచేతుల్ని అడ్డంపెట్టి తన బ్రతుక్కో సాఫల్యతని సిద్ధించుకునే ప్రయత్నం చేస్తున్న ఓ వృద్దురాలైన అమ్మ మనసు లోతుని అంచనా వేస్తున్నాడు.
ఎవరనగలరు అక్కడక్కడైనా ఇంకా మానవత మిగిలిలేదని... ఎవరూహించగలరు తనకేమీ కాని పిల్లల కోసం ఇక్కడో తల్లి తపించిపోతోందని...
స్తబ్దంగా చివరి గదిని దాటుతుండగా "అంకుల్" అన్న ఓ పిలుపు వినిపించింది.
నాలుగేళ్ళ పాప ద్వారం అంచుని ఆసరాగా చేసుకుని నిలబడి జాకీని చూసి నవ్వుతూంది.
"ఏంరా రూపా... ఏం చేస్తున్నావిక్కడ?"
"నిన్ను చూస్తున్నాను"
