Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 45


    ఆ తర్వాత ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకొన్నారు. ఆఖరుసారిగా మెస్ కి కలిసివెళ్ళి ఒకరి పక్కనొకళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేశారు.


    నాలుగవుతుండగా మనోహర్ వచ్చాడు. అప్పటివరకు అతనికోసమే ఎదురుచూస్తూ కూర్చుంది అవంతి.

 
    "బయల్దేరదామా" అడిగాడు అతను.


    "అప్పుడే, ట్రైన్ ఎనిమిదిగంటలకి కదా!" అంది అవంతి.


    అతను నవ్వాడు.


    "చిన్న పనుంది. అంచేత......" అన్నాడు.


    అవంతి అతని కళ్ళలోకి ఓసారి చూసి.....


    "ఓ.కె." అంది.


    "వన్ కిస్" అన్నాడు మనోహర్ చిలిపిగా.


    "చాల్లే పెద్ద"


    "పేకప్ అండ్ కమాన్" అన్నాడు.


    "ఏమిటి లగేజీతో వచ్చేయమంటావా?"


    "అవును. లేకపోతే మళ్లీ ఇంతదూరం రావడం దేనికి?" అడిగాడు.


    "అదీ నిజమే! రెండు నిమిషాలు" అంటూ లోపలికి వెళ్ళింది.


    అయిదు నిమిషాల తర్వాత అవంతి ఓ సూట్ కేసుని, రమణి ఓ బెడ్డింగ్ నీ, శ్యామలా, కుసుమ మరో రెండు పాకెట్లనీ పట్టుకొని వచ్చారు.


    మనోహర్ కారు డిక్కీ తెరిచాడు. ఆ సామానంతా అవంతి ఫ్రెండ్స్ డిక్కీలో పెట్టారు.


    అవంతి వాళ్ళ ముగ్గుర్నీ ఒక్కసారిగా దగ్గరికి తీసుకొంది.


    ఒక్కొక్కరినీ ప్రేమతో ముద్దాడింది.


    ఆమెకళ్ళలో నీరు చిందుతోంది.


    "బై..... బై....." అంటూ ఫ్రంట్ డోర్ తీసుకొని కారెక్కి కూర్చుంది.


    ఒక్కసారి ఋణం తీరిపోయిన హాస్టల్ కేసి చూసింది.


    ఏడుపొస్తోంది.


    విద్యార్థి దశ ఎంత విలువైనదో ఆ క్షణంలో ఆమెకి పూర్తిగా అర్థం అయింది. మళ్ళీ కావాలన్నా అలాంటి జీవితంరాదు. వందలమంది మధ్య, వేలమంది అనురాగ ద్వేషాలతో కూడిన విద్యార్థి దశని ప్రతిమనిషీ జీవితపు పుటల్లోనూ రాసుకోతగ్గది.


    కారు కదిలింది.


    కన్నీళ్ళమధ్య స్నేహితురాళ్ళు వీడ్కోలు చెపుతుంటే వాళ్ళు కనబడినంత దూరం చూస్తూనే వుంది.


    కారు మలుపు తిరిగింది.


    మనోహర్ సిగరెట్ కాలుస్తూ డ్రైవ్ చేస్తున్నాడు.


    అవంతి నిర్లిప్తంగా వుండిపోయింది.


    "అవంతీ!" పిలిచాడతను.


    "ఊ....." అంది బరువుగా.


    అతను అదోలా నవ్వడానికి ప్రయత్నం చేశాడు.


    "ఈ వాల్టితో నీలైఫ్ లో ఒక అధ్యాయం ముగిసింది. ఇప్పుడు నువ్వో మనిషిగా జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నావు."


    "ఊ....."


    "నువ్వు లాయరివి. ఒకరికి సలహా ఇచ్చే చదువు చదువుకొన్నావు" అంటూ ఆమెకేసి చూశాడు.


    ఆమె వింటోంది.


    "నీ స్నేహితుడిగా, ఆప్తుడిగా, నీ కొక్కమాట చెప్పనా?" అడిగాడు.


    "ఊ....."


    "సొసైటీలో అడ్వకేట్ వృత్తి చేపట్టిన వ్యక్తికి ఓ గౌరవం వుంటుంది. ఆ గౌరవాన్ని నిలుపుకుంటూ, చట్టపరంగా న్యాయాన్ని పరిరక్షిస్తూ, ఒకరికి చెప్పడమే కానీ, మరొకరిచేత చెప్పించుకునే స్థితికి నువ్వు రాకూడదు. అంతే!" అన్నాడు.


    అవంతి విన్నది.


    అతనెందుకు అలా చెప్పాడో ఆ క్షణంలో ఆమెకి అర్థంకాలేదు. అలాగని అర్థం చేసుకోడానికి కూడా ఆమె ప్రయత్నించలేదు


    ఆమెకి దిగులుగా వుంది.


    ఆ వాతావరణం నించి ఒక్కసారిగా దూరంగా పోవాలంటే ఏదో ఎడారిలోకి విసిరి కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. వెళుతోంది తనని పెంచి పెద్ద చేసిన తండ్రి దగ్గరికే అయినా ఏదో వెలితిగా వుంది.


    కారుని మనోహర్ థియేటర్లోకి తీసుకెళ్ళి పార్క్ చేశాడు.


    "హాల్ కు తీసుకొచ్చావెందుకు?" అంది.


    "నువ్వెళ్ళిపోతున్నావు కదూ. కాసేపు నీతో మాట్లాడాలని" అన్నాడు.


    మనోహర్ వెనకగా నడిచింది అవంతి. అతను తన పర్సనల్ గదిలోకి ఆమెకి తీసుకెళ్ళాడు.


    అతను కాస్త అనీజీగా కనిపిస్తున్నాడు.


    "కూర్చో"


    అవంతి అతనికెదురుగా కూర్చుంది.


    టేబుల్ మీదున్న ప్యాకెట్లని ఆమె ముందుకు తోసి -


    "ఇవి బాగున్నాయో లేదో చూడు" అన్నాడు.


    అవంతి ప్యాకెట్లు విప్పి చూసింది. అరడజను చీరలు, చాలా ఖరీదైనవి.


    "ఇవన్నీ ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగింది.


    "నీ కోసమే, నీకు నచ్చుతాయన్న నమ్మకంతో కొనేశాను అక్కడికి తీసుకొస్తే అందరూ చూస్తారని నిన్నే ఇక్కడికి తీసుకొచ్చాను" చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS