Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 44

    "పోస్ట్!" అన్న పిలుపు విని కారిడార్ లోకి పరుగు తీసింది ఆమని!

    అప్పటికే ఉత్తరం వాకిలి ఎదుట విడిచి వెళ్ళిపోయాడు. క్రింద పడి వున్న ఉత్తరాన్ని అందుకుని గదిలోపలకు వచ్చింది.

    దానిమీద అక్షరాలు అందంగా లేవు. వంకర టింకరగా వున్నాయి. అలవాటు లేని చేతివ్రాత అది! త్రిప్పి చూచింది. గాయత్రి అని వుంది!

    "ఓహ్! అక్కా! ఇంత తెలివి నీకెప్పుడు వచ్చిందోచ్!" అని ప్రక్కగదుల్లో వాళ్ళు పరుగెత్తుకొచ్చేలా అరిచి మంచం మీద ఎగిరిపడింది ఆమని!

    "అక్కగారు ఉత్తరాలు కూడా వ్రాస్తోందన్న మాట?" అని ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంది.

    "చూచి రెండు సంవత్సరాలు పైగా అయింది. అమ్మాయిగారికి చెల్లిమీద దిగులు పుట్టింది కాబోలు! పోనీలే! ఇక్కడొక ప్రాణి వార్తలకోసం ఎదురు చూస్తోందనే విషయం గుర్తించింది!" అంటూ ఉత్తరాన్ని చించింది.

    "చెల్లీ! నీకు ఆశీస్సులు!

    గుండెలు నిండిన విషాదం దింపుకునే దారిలేక ఈ ఉత్తరం వ్రాస్తున్నా!

    నాకు ఉత్తరాలు వ్రాయడంరాదే చెల్లి! పొరపాటుగా ఏదయినా రాస్తే క్షమిస్తావనే ధైర్యం వుంది. కాబట్టే చొరవచేసి వ్రాయగలుగుతున్నా!

    అమ్మగారికి, నాకు విషాదవార్త అయినా నీకు మీ బావగారికి శుభవార్త ఒకటి వుంది, అది వ్రాయాలంటే సిగ్గుగా వుంటుంది.

    అయినా మనసు విప్పి మాట్లాడుకునేందుకు నీవు తప్ప నాకు ఎవరున్నారే! నీకు చాలా మంది స్నేహితులు వుంటారు. నాకు మాత్రం నువ్వు ఒక్కదానివే స్నేహితురాలివి, అందుకే ఆ సిగ్గుని అవతలపెట్టి నీకు చెప్పుకుంటున్నా!

    అమ్మగారు ఆశించిన విధంగా పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు దాటినా నాకు నెల తప్పలేదమ్మా! అమ్మగారు దిగులుపడ్డారు.

    బావగారు నాతో ఎంతో బాగుంటారు. మంచిగా చూచుకుంటారు. ఇదిలా వుండగా పులి మీద పుట్రలా మరో దారుణం జరిగింది. ఈ మధ్య ఒక ఇంట సీమంతానికి పునిస్త్రీలు అందరూ వెడుతూ వుంటే పిలిచారు కదా అని నేను కూడా వెళ్ళాను. ఒక తేలికొండి నన్ను కుట్టింది. అంతటితో విడిచిపెట్టకుండా కొండిలోని విషాన్ని జనం మీదికి కూడా విరచిమ్మింది. కడుపు పండని ఇల్లాలి కళ్ళు దిష్టికళ్ళు అవుతాయట! అందుకోసం అలాంటి వారిని శుభకార్యాలకు పిలవకూడదట! ఎక్కడికి కూరుకుపోయానో నాకే తెలియదు.

    భూమి అట్టడుగు పొరల్లోకి దిగిపోయానే!

    వర్ణించలేను చెల్లీ ఈ బాధని! నువ్వే ఊహించి అర్ధం చేసుకో! భగవంతుడు మన మీద ఎందుకు దయ తప్పాడో తెలియదు. ఎప్పుడయినా శుభవార్త వుంటే బావగారి చేత నీకు ఉత్తరం వ్రాయించాలని అనుకున్నాను. కాని ఈ ఉత్తరం నేనే వ్రాస్తున్నాను. నా బాధను అందరికి పంచాలని కాదు. బావగారికి ఈ విషయం చెప్పలేదు. మన బాధలు మనవి! తెలిస్తే ఆయన ఏమనుకుంటారో! ఎప్పుడూ వ్యాపారం పనుల మీద తీరిక లేకుండా వుండే వారికి ఇలాంటివన్నీ చెప్పి బాధించడం ఎందుకు? అందుకే ఊరుకున్నాను.

    స్నేహితురాలుగా నన్ను అర్ధం చేసుకుంటావో, చిలిపి చెల్లెలుగా పిచ్చిదాన్ని చేసి ఆటలు పట్టిస్తావో, పిరికిదాన్నని తిట్టిపోస్తావో అంతా నీ ఇష్టం! వెంటనే ఉత్తరం వ్రాయి-ప్రేమతో అక్క గాయత్రి!"

    అది చదవడం ముగించి నిట్టూర్చింది ఆమని.

    వెంటనే లేచి ఆ మాట అన్నవాళ్ళని చాచి తన్నాలనిపించింది. కాని లోకులు అనే మాట చాలా బలమయినది. ఎవరేమి అనుకున్నా, ఎవరేమి చెప్పుకున్నా లోకులమాట మాటగానే మిగిలిపోతుంది. లోకుల మాటలు వట్టిపోవు. నిజమయినా అబద్ధమయినా నిలిచే వుంటాయి. అవి సంజీవి తిన్న సైతాన్ లు!

    రాముడంతటివాడే ఆ మాటలకు భయపడి సీత అమ్మవారిని అగ్నిప్రవేశం చేయించాడు. అక్కమీద మాట పుట్టించారు.

    పిల్లలు లేని ఇల్లాలు అంటున్నారిప్పుడు.

    రేపు గొడ్రాలు అంటారు. దాన్ని ఎదుర్కోవడం మాటలలో కుదరదు. ఆమె తల్లి కావడం తప్ప ఈ ఊబి నించి బయటపడే దారిలేదు.

    తన కుటుంబం విషాదంలో చిక్కిన సంగతి అర్ధం చేసుకుంది ఆమని!

    ఆ దంపతులు రెండు కుటుంబాల పరువు ప్రతిష్ట భవిష్యత్తు మొదలయిన వాటన్నింటికి వారసులు.

    ఏమి చేసి ఈ అపవాదు తొలగించుకుంటారు?

    ఈ స్థితిలో మమ్మీ మానసిక ఆందోళన ఏ స్థాయిలో ఉంటుంది. దాని ప్రభావం ఆమె ఆరోగ్యం మీద ఎలా పని చేస్తుంది? మొదలయిన విషయాలన్నీ సునిశితంగా క్షుణ్ణంగా ఆలోచించింది ఆమని!

    సమస్యని బాగా తర్కించుకుని అర్ధం చేసుకుంది.

    పరిష్కారం కూడా ఆలోచించింది. ఒక ఉత్తరం వ్రాసింది బావగారికి!

    "బావగారూ! నమహా! మీ లవ్ లీ ఆమని వ్రాసేదేంటో తెలుసా! వెంటనే మా అక్కగారు శ్రీమతి గాయత్రి గారిని తీసుకుని అమ్మగారి అనుమతి సంపాదించుకుని నగరానికి బయలుదేరి రండి.

    ఎందుకు? అని ఎదురు ప్రశ్న వేయవద్దు!

    "ఏవో పనులున్నాయని తప్పించుకోవద్దు! నగరంలో మన అపార్ట్ మెంట్స్ లో కొన్ని ఖాళీగానే ఉన్నాయి. కొంతకాలం మీరు ఇక్కడే ఉండాలి. ఇది మరదలుగారి బై ఆర్డర్!

    ఈ హాస్టల్ భోజనం తిని తిని నాలుక రుచులు మర్చిపోయింది.

    కొద్దిరోజులు అక్క చేతి వంట తింటాను! ఆ తరువాత ఫైనల్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతాను. ఇక చూచుకోండి. డిస్టింక్షన్ గ్యారంటీ!

    అక్కా డార్లింగ్ నీ అమాంతం ఎత్తుకుని వచ్చేయండి.

    కంటి ప్రమిదలలో చూపుల దీపాలు వెలిగించి మీకోసం ఎదురు చూస్తుంటా!

    సరదాగా వ్రాశానని ఎగేయటానికి ప్రయత్నించకండేం?

    మీరు రాకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ వ్రాయనంతే! మానేస్తా!

    మిమ్మల్ని చూడాలి! పరీక్షలు వ్రాయాలి!

    ఇబ్బంది పెడుతున్నానా? తప్పదు బావా! మరదలి ముచ్చట తీర్చలేని ఆ బావగారేం బావగారు మీరు మంచివారుగా! నా ముచ్చట తీర్చేస్తారు లెండి. ఉంటాను బై!" అంటూ ఉత్తరాన్ని ముగించింది ఆమని.

    హాస్టల్ ఎదురుగా ఉన్న స్పీడ్ పోస్టులో కవర్ అందించింది.

    అది చూచి అదిరి పడిపోయాడు వాల్మీకి.

    వెంటనే ఇంటికి పరుగుతీశాడు.

    "మనం నగరం పోవాలి! వెంటనే బట్టలు సర్దు" అని తొందరించాడు.

    తన ఉత్తరం తిరిగి ఎలాంటి రియాక్షన్స్ ని సృష్టించగలదో అని భయపడుతున్న గాయత్రి చిత్రంగా చూచింది.

    "ఎందుకండీ నగరానికి?" అంది తన అవమానం సంగతి చెల్లి ద్వారా బావగారికి చేరిన గుర్తులు ఏవీ లేవు! అలాంటిది ఉంటే ఆయన దాచరు. వెంటనే అడుగుతారు. దాచుకునే స్వభావం లేని మనిషి!

    గాయత్రి ప్రశ్న విని వాల్మీకి నవ్వాడు.

    "ఎందుకా? మీ చెల్లెలు గారు బాంబులు విసుర్తున్నారు. చదువు" అంటూ ఆమని వ్రాసిన ఉత్తరం అందించాడు! "పిచ్చిపిల్ల మనల్ని చూచి రెండు సంవత్సరాలు పైగా అయిపోయింది. దిగులు పెట్టుకుంది కాబోలు! ఆడపిల్లలు చదువుకుంటూ పరాయిచోటున ఉన్నారంటే ఇంటి దగ్గర పెద్దవాళ్ళు రకరకాలుగా దిగుళ్ళు పెట్టుకుంటారు. ఎన్నో ఎదురొత్తులు చేస్తుంటారు.

    మనం ఆ పిచ్చిపిల్లకోసం ఎప్పుడేం చేశాం? నీకు ఉత్తరం వ్రాయాలన్నా బద్ధకం! చిన్నపిల్ల కాబట్టి తక్షణం చూడాలని పట్టుబట్టింది.

    ఈ మాత్రం చేయకపోతే మనం ఉండి లేనట్టే గాయత్రీ!

    ఈ రాత్రికే టికెట్స్ బుక్ చేసి తీసుకువచ్చాను. ప్రయాణం సంగతి అత్తాయమ్మగారికి చెప్పిరా!" అన్నాడు. గాయత్రి మనసు పాల వెల్లువలా పొంగింది.

    బాధలో ఉండి ఆదుకోమని వ్రాస్తే చెల్లి ఎంత చక్కగా ఆదుకుంది?

    కొంతకాలం అక్కా బావా నగరంలో సరదాగా ఉంటే ఈ బాధ మర్చిపోతారనుకుంది కాబోలు! ఈ రెండు సంవత్సరాల్లో మంచి ఆలోచనా పరురాలు కూడ అయిందన్నమాట!?

    చెల్లీ! ఎంత దానివి అయ్యావే! బావగారికి ఏదయినా చెప్పాలంటే ఇప్పటికి భయపడిపోతున్నాను నేను. నువ్వు అప్పుడే వారిని కమాండ్ చేయగల స్థాయికి వచ్చేశావన్న మాట అనుకుని పొంగిపోయింది.

    ఎప్పుడు వచ్చారో సుమిత్ర "అంతా విన్నాను బాబు" అంది.

    గాయత్రి అందించిన ఉత్తరం చదివింది. ఆమని మాటలు ముత్యాల మూటలు!

    ఆమె ముఖంలో చాలాకాలం తరువాత చిరునవ్వు వికసించింది.

    "దానికి ఎంత ఆరాటంగా ఉందో చూడాలని!? వెళ్ళిరండి! వెళ్ళకపోతే అది మొండిఘటం. నిజంగానే పరీక్షలు మానేయగలదు! రేపు ఉదయానికి మన మారుతికారు కూడ నగరానికి పంపుతాను" అన్నదామె.

    "వొద్దండీ అమ్మగారు! ఆమని కారుందిగా! కొద్దిరోజులు అదే గడిచిపోతుంది" అంటూ బదులు చెప్పింది గాయత్రి.

    "అత్తాయమ్మగారూ! ఆమనికి ఏం చెప్పమంటారు అని ప్రశ్నించాడు వాల్మీకి.

    "దాని జీవితాశయం కలెక్టర్ కావటమే కదా!? కలెక్టర్ అయి తిరిగి వచ్చాక మాత్రమే నా కాళ్ళకి దండం పెట్టనిస్తానని చెప్పు బాబూ" అంది సుమిత్ర.

    ఈ మాటలు విని వాల్మీకి ఉలికిపడి చూశాడు.

    కర్కశమయిన ఆ శాసనం వెనుక ఆ తల్లి మనసులోని ఆశల అవర్తాలు ఎలా సుడులు సూదులుగా తిరుగుతున్నాయో గుర్తించాడు.

    ఎంత గొప్ప మనుషుల మధ్య ఉన్నాను నేను! అని తనని తానే అభినందించుకున్నాడు. సుమిత్ర కారులో రైలు స్టేషన్ వరకూ వచ్చి సెండాఫ్ ఇచ్చింది. వజ్రం పొదిగిన ఉంగరాన్ని గాయత్రికి ఇచ్చింది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS