Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 44


    శిరీష రంగారావు మొహంలోకి చూసింది.

    "ఆ విషయాన్ని నీ ఇష్టానికే విడిచి పెట్టేస్తున్నాను" అన్నాడతను.
 
    "మీ అమ్మ, నాన్న, అన్నయ్య!" ఆగిపోయింది శిరీష.

     "వాళ్లకి తెలుసు!" రంగారావు కిటికీ దగ్గరికి నడుస్తూ అన్నాడు.

     బాంబు పడినట్లు ఉలిక్కిపడింది భారతి. భయంగా అతనివంక చూసింది.

     "ఎలా తెలుసు!" వేగంగా అడిగింది.

    "ఆఫీసు కెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి రాకపోతే ఇంట్లో వాళ్లెంత కంగారు పడతారో నాకు తెలుసు.

     అందుకని నేను వెళ్లి జరిగింది చెప్పాను!"

    "ఏమన్నారు?"

    "ఏడ్చారు. బాధపడ్డారు. మీ అన్నయ్య ప్రశాంత్ ని చంపివేస్తానన్నాడు. నేను నచ్చ చెప్పాడు. మీ వాళ్లకి అభ్యంతరం లేకపోతే నిన్ను నేను  పెళ్లి చేసుకొంటానని చెప్పానున!" అతని మాటలని వింటూ నిర్ఘాంతపోతోంది భారతి.
 
     "ఒప్పుకున్నారా!"

    "నీ బాధ్యతని నాకు ఒప్పగించారు. విశిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకొంటాను. లేకపోతే నీవు కోరుకునే విధంగా నిన్నో దారి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాను.

     ఇప్పుడు చెప్పు.

     నేనంటే నీకిష్టం లేదా?

    నన్ను పెళ్లి చేసుకొంటావా?"

    అడిగాడు రంగారావు.

    భారతి అతని కాళ్లమీద పడిపోయింది. ఆమె కన్నీరు అతని పాదాలని అభిషేకిస్తోంది. ఆమెని మెల్లగా పైగా లేవనెత్తాడు రంగారావు.

     ఆమె నుదురుమీద ఆప్యాయంగా ప్రేమతో ముద్దు పెట్టుకొన్నాడు.

     "నువ్వే చూద్దుగానీ, ప్రశాంత్ ఆట నేను కట్టిస్తాను. వాడి నిజరూపాన్ని నేను బయటపెడతాను" అన్నాడు.

     మర్నాడే ఆమెని రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాడు.

     శిరీషతోపాటు ఆఫీసులో వాళ్లకూడా కొందరు వచ్చారు.

     అదేరోజు సాయంత్రం భారతి అబార్షన్ చేయించుకొంది.

                             24

    భారతికి తోడుగా రెండు రోజులు వుంది శిరీష.

     భారతితో ఆఫీసుకి ఓ నెలరోజులు సెలవు పెట్టించేశాడు రంగారావు.

     రంగారావు ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే తప్ప, ఆమె ఒకరి చేతిలో మోసపోయిన సంగతి ఆఫీసులో ఎవ్వరికీ తెలీదు.

     శిరీష వెళ్ళిపోతున్న రోజునే భారతి వాళ్ల అమ్మ నాన్న దగ్గరకి విశ్రాంతి కోసం పంపించాడు రంగారావు.

     శిరీషద్వారా రంగారావు ఇంకా ఎన్నో విషయాలని ప్రశాంత్ కి చెందినవి తెలుసుకున్నాడు. ఎప్పుడైనా ఎలాంటి అవసరం పడినా తను వచ్చి సాయపడతానని చెప్పింది శిరీష.

     శిరీష విశాఖపట్నం వెళ్లిపోయింది. డి. డి. ఆర్. విజయ వూరునించి వచ్చారు.

     డి. డి. ఆర్. క్రిమినల్ లాయర్.

     రంగారావు అన్న భర్త డి. డి. ఆర్.

     విజయ డి. డి. ఆర్. అన్నగారి బిడ్డ. రంగారావుకి భారతితో పెళ్లి జరగడం మొదలైన విషయాలన్నీ తెలుసుకొన్న తర్వాత డి. డి. ఆర్. అన్నాడు.

    "ఇదిగో దీనికి చెప్పు. ఆ రాస్కెల్ గాడిని చూడాలని వెంటపడి వచ్చింది" అన్నాడు.

     రంగారావు ఆశ్చర్యంగా చూశాడు విజయకేసి.

     "దుర్మార్గుడిని చూడాలనా?" అన్నాడు.

    "నా అభిమాన రచయితని గురించి మరీ అలా మాట్లాడితే నేను సహించను మామయ్య!" అంది విజయ నవ్వుతూ.

     "నీకు తెలీదమ్మా వాడి సంగతి."

    "అతనంటే నీకు గిట్టదని అతను మంచివాడు కాదంటే ఎలా?"

    "జరిగిందంతా విని కూడా అలా అంటే ఎలా?" అన్నాడు రంగారావు.

    విజయ నవ్వింది.

    "సారీ మామయ్య! నేను కూడామా ఫ్రెండ్స్ సర్కిల్ లో ప్రశాంత్ గురించి కొంత విన్నాను.

     నేను  అతని రచనలని బాగా లైక్ చేస్తాను. అందుకనే అతనెలా వుంటాడో, ఎలాంటివాడో తెలుసుకోవాలనే అంకుల్ తో వచ్చాను" అంది.

     రంగారావు సిగరెట్ వెలిగించి పొగని గాలిలోకి విడిచిపెట్టి"ఐసీ!" అన్నాడు.

     "అతనితో నీకింతకు పూర్వం పరిచయం లేదుగా!" అడిగాడు.

     "లేదు. నేనే ఓ రెండు ఉత్తరాలు రాశాను. అతని రచనలన్నా అతనుముఖాముఖిలో ఇచ్చే జవాబులన్నా నాకెంత ఇష్టమో వివరిస్తూ రాశాను.

     దానికి ప్రశాంత్ నాకు జవాబు రాశాడు."

    "ఏం రాశాడు?"

    "నాలాంటి అభిమానుల అభిమానమే తన రచనలకి ఊపిరన్నాడు. హైదరాబాదుకి రమ్మని నన్ను ఆహ్వానించాడు."

     "ఆ... తర్వాత...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS