Previous Page Next Page 
పరిహారం పేజి 44


    "మేమంటే?" మనోహర్ కనుబొమలు ముడిపడినాయి.
    "నేనూ, అక్కయ్యా!"
    "సంగతేమిటి రజనీ?" మందస్వరాన ప్రశ్నించాడు మనోహర్.
    "ముందు దాని ప్రశ్నలకు జవాబియ్యండి!" రజని కంఠం కరుకుగా ధ్వనించింది.
    ఛాయ మనోహర్ ముఖంలోకి గ్రుచ్చి చూస్తూ  "మీకు చదువుంది. సంస్కారముంది. బాగా బ్రతకడానికి డబ్బుంది. ఇంకా ఈ పంచన ఎందుకు చేస్తున్నట్టు?"
    "ఏ వంచన?"
    "డబ్బుకోసం ఆడపిల్లల గొంతులు కోయడం!"
    "నేను ఏ ఆడపిల్ల గొంతుకోశాను?" చుర్రుమన్నట్టుగా లేచాడు.
    "కట్నానికీ, డబ్బుకూ అమ్ముడుపోతున్న పెద్దమనిషి! వాళ్ళ పేర్లుకూడా నేనే చెప్పాలా? చెబితేగానీ తెలుసుకోలేవా?"    
    "షటప్! మర్యాదగా మాట్లాడు. ఇంత కట్నం ఇమ్మని నేను బేరమాడానా?"
    "కొన్ని ఫిక్స్ డ్ రేట్స్! బేరాలుండవు"
    "తిక్కగా మాట్లాడకు. మాట్లాడేదేదో సూటిగా మాట్లాడు."
    "సూటిగా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. సూటిగా సమాధానం యివ్వండి. మీ ఇంట్లో ఆరోజు కనిపించిన పిల్ల పనిమనిషి అని చెప్పారుకదూ? ఆ పిల్ల పేరు పారిజాతకదూ? ఆ పిల్లను మీరు ప్రేమించారా లేదా?"
    ఒక పెద్ద అవమానాన్ని ఎదుర్కొంటున్న ఈ గడ్డు సమయంలో పారిజాత పేరు వినవచ్చేసరికి అతడి కళ్ళకి బైర్లు కమ్మినట్టుగా అయ్యాయి. ఛాయ అడిగే ధోరణి న్యాయాధికారి ముద్దాయిని ప్రశ్నించినట్టు ఉండడంతో అతడికి కోపంతో ఒళ్ళు తెలియలేదు. "ఎప్పటి సంగతి?" అని అడిగాడు మొండికెత్తినట్టుగా.
    "ఇప్పుడుకూడా ఉందా ఏమిటి ఖర్మ? నేను అడిగేది రజని అక్కతో మీ వివాహం స్థిరపడకముందు సంగతి?"
    "ప్రేమించాను"
    అతడి సమాధానంకోసం ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్న రజనికి ఆ సమాధానంతో గాయమైన గుండెలో కసిగా బల్లెంపెట్టి పొడిచినట్టుగా గిలగిలలాడిపోయింది.
    "మీరామెను పెళ్ళాడతానని మాటిచ్చారా లేదా?"
    "ఇచ్చాను. కాని, ఏసందర్భంలో ఇచ్చాననుకొంటున్నావు?" చురుగ్గా ప్రశ్నించాడు.
    "ఏమో!" ఓరగా చూస్తూ అంది ఛాయ. "ఇలాంటి వాగ్దానాలు ఏసందర్భంలో చేస్తారంటే హోటల్ గదుల్లోనో, పార్కులో చెట్లచాటునో ఆడపిల్లని అమాయకురాలిని చేసి, ఆమె శీలాన్ని దోచుకొనే సాధనంగా ఉపయోగిస్తారనుకుంటాను! మీ విషయంలోనూ సరిగా ఇలాగే జిరిగందా?"
    "ఏం కూశావ్?" మనోహర్ చెయ్యి విసురుగా పైకి లేచింది.
    "ఆ చెయ్యి అలాగే క్రిందికి దించండి. ఇది ఎవరి ఇల్లో మరిచి మాట్లాడుతున్నారులా వుంది. కాస్త ఒళ్ళు తెలిసి ప్రవర్తించండి!" రౌద్రమూర్తిలా రజని అతడి ఎదురుగా నిలబడింది. ఆమె గొంతు శాసిస్తున్నట్టుగా వుంది.
    మనోహర్ నిటారుగా అయ్యాడు. అవమానంతో అతడి ముఖం కందగడ్డలా తయారయింది. చేరెచేతా చుట్టి వేసి గిరాగిరా త్రిప్పి నేలకేసి ఉతుకుదామన్నంత ఆవేశం కలిగింది. కాని అతి ప్రయత్నంతో తమాయించుకున్నాడు.
    "నే నడుగుతున్నాను. పారిజాతను వివాహం చేసుకొంటానని మీరు వాగ్దానం చేశారా లేదా?"
    చేశారు. కాని, ఆ వాగ్దానం ఆమెకు చెయ్యలేదు. ఆమె తండ్రికి చేశాను. అదీ ఆయన మరణ సమయంలో ఆయన ఆత్మ శాంతిగా వెళ్లిపోవడం కోసం చేశాను. అది నిజానికి వాగ్దానం కాదు. ఒక అబద్దం. ఒక నాటకం"
    "ఒక అబద్ధం, ఒక నాటకం! అయితే మీకు అబద్దాలూ, నాటకాలూ ఆడే అలవాటు ఉందని ఒప్పుకుంటున్నారన్నమాట! కనీసం ఈ విషయంలోనైనా మీ నిజాయితీని మెచ్చుకోవాలి? వెళ్లి పొండి మనోహర్! ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ నిలవడానికి వీల్లేదు. ఈ క్షణం నుండి మీకూ నాకూ ఉన్న సంబంధం త్రెగిపోయింది వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడూ నా కళ్ళ బడకుండా వెళ్ళిపోండి!"
    మనోహర్ గిరుక్కున తిరిగి రెండడుగులు వేశాడు.
    "కాని, చివరిగా నాదొకమాట! ఒకవిధంగా నేనదృష్టవంతురాలిని. మీలాంటి మేకవన్నె పులినుండి, వివాహం కాకముందే మీ నిజస్వరూపం తెలిసి బ్రతికి పోయాను. ఈ హృదయానికి గాయం ఎంత తీవ్రమైనదైనా ఫర్వాలేదు మాన్పుకోగలను. కాని ఆ పిల్లను మాత్రం అన్యాయం చేయకండి. డబ్బుకోసమే కదా ఆ పిల్లను ప్రేమించీ నన్ను పెళ్ళాడడానికి, సిద్దమైంది! ఆపిల్ల పేదరాలనే కదా ఆమె జీవితం నాశనం చేసింది? మీకున్న డబ్బుతో సంతృప్తి పడండి. ప్రేమించడానికి ఆ పిల్ల శీలం దోచుకోడానికి దాని అంతస్తు తేడా పెళ్లికి మాత్రం ఎందుకు? మీ డబ్బు దాహానికి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చెయ్యొద్దు!" "డబ్బు! డబ్బు దాహం! ఏం చూసి నువ్వీమాట అంటున్నావు! మీ ఇంటికి కన్నం పెట్టి దోచుకున్నానా? మీ నాన్నకు కత్తి చూపి ఆస్తి రాయించు కున్నానా?" మనోహర్ కళ్ళు నిప్పులు చెరిగాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS