"తొలుత నిన్ను అన్నయ్యకివ్వాలనుకొన్నారని అమ్మకు కూడా అదే ఇష్టమని, అన్నయ్య వేదాంత వీధుల్లో విహరిస్తూ వివాహం నిరాకరించి వెళ్ళిపోయాడని నాకు తెలియదు. నువ్వు అన్నయ్యనే ప్రేమించావనీ తెలియదు. మనసు పరగతమైన ఆడదాన్ని ప్రేమించడమంత సిగ్గుచేటు మరేముంది?
"అమ్మా, నాన్నా పోయినప్పటినుండి ఒకటొకటిగా బయటపడుతున్నాయి. వీడు వచ్చిన ముహూర్తబలమో, కాలప్రభావమో పార్వతీ పరమేశ్వరుల్లాంటి దంపతులను మింగి కూర్చొన్నాడు." "ఈ పెద్దమ్మముఖానికి చిలకలాంటి దేవతమ్మనిస్తారట. చినబాబు పక్కన చిలకలా కులికే దేవతమ్మ వీడితో ఒకసారైనా నవ్వుతూ మాట్లాడగా చూశామా? దేవతమ్మకు బావంటేనే వల్లమాలిన ప్రేమ. పెద్దల బలవంతమే గాని ఆ యమ్మకు ఇతడితో ఎంత మాత్రం ఇష్టంలేదు పెళ్ళి!" ఎంత విరాగి అయినా చినబాబులో ఏదో ఠీవి, దర్పమూ, అంతా తండ్రిపోలిక, ఏవో చూపబోతాడుగాని పరుల ఆస్తికి ఆపడి వచ్చిన కుక్కకు ఆ హుందా ఎక్కడినుండి వస్తుంది? దేబె ముఖమూ, వాడూ!' ఈ విధంగా వెక్కిరింపులూ, ఈసడింపులూ విసరబడతాయి నామీదికి. అదీ, ఇంటి నౌకర్ల నుండే కావడం ఎంత అవమానమో, బాధావహమో చూడు మరి!" అతడెంతో సహజంగా, నిర్వికారంగా ఈ మాటలు చెబుతామని ప్రయత్నించాడు కాని, కన్నీళ్ళు ఆగలేదు. కంఠం వణికింది. "నేనెంత మంచిగా నడుచుకొన్నా నన్ను మెచ్చేవాళ్ళు లేరిక్కడ. ఏ నాటికీ చినబాబు స్థానం నేను ఆక్రమించుకోలేను. నిజంగా, అన్నయ్య అంటే నాకూ గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయనలోన ఏదో ప్రత్యేకతా, హుందా ఉన్నాయి. ఆయన ప్రత్యేకత నాకు రమ్మంటే వస్తుందా? ఎవరి ప్రత్యేకత వారిదే. అన్నయ్యకు నన్ను పోల్చి చిన్న బుచ్చడం ఎంత క్రూరం?
"ఈ ఆస్తికీ, వీళ్ళకూ ఒక దండంపెట్టి తిరిగి నా బలగంలో వెళ్ళి పడాలనిపిస్తున్నది. అక్కడెంత శాంత సంతోషాలను అనుభవించానో, ఇక్కడికి వచ్చి అంత వేదనను అనుభవిస్తున్నాను. సన్నగా, నిర్మలంగా ప్రవహించే పిల్లకాలువకు కొత్తనీరు వచ్చి కలిసి ప్రవాహాన్ని గతి తప్పించినట్లయింది. దత్తు చేసుకొన్న వాళ్ళు ఉన్నా ప్రవాహానికి గట్లుగా నిలిచేవారేమో?"
"అమాయకంగా, తనలో తను ఉండేట్లు కనుపించే ఇతడు ఇంత సున్నిత మనస్కుడా? ఆశ్చర్యపోయింది దేవదాసి.
"చెప్పు, దేవతమ్మా! నీకూ నేనంటే అసహ్యమే కదూ?"
"అసహ్యమా? ఎందుకూ?"
"అందరికీ నేనంటే ఎందుకు అసహ్యమో, నాకేం తెలుసు?" అన్నాడు దీనస్వరంతో.
"..............."
"సంగతి సందర్భాలు తెలిస్తే ప్రేమించే వాడినా? ఆశించేవాడినా? ఇప్పుడు నేనిందుకు ఎంతయినా సిగ్గుపడుతున్నానంటే నమ్ము?" అన్నాడు గాద్గదికంగా "మనస్ఫూర్తిగా చెబుతున్నారు. అన్నయ్యే మనసుమార్చుకొని నిన్ను పెళ్ళాడి ఇక్కడే ఉండిపోతే నేను ఈర్ష్యపడను. సీతారాములను సేవించే లక్ష్మణుడివలె ఉండిపోతాను. నమ్ము!"
తలెత్తింది దేవదాసి. "మీ పవిత్ర ప్రగాఢ ప్రేమను, భక్తిభావంలోకి మార్చుకొనడం మీకంత సులభమైతే నాకేనా చేతకానిది? "గంభీర మందహాసం చేసింది." బావను నేను ప్రేమించినమాట అబద్ధం కాదు. కాని అతడొక చంచల పురుషుడు. జిజ్ఞాస వెలుగులోకి లాగుతూంది. వెలుగులోకి పోలేక గిలగిల తన్నుకొంటున్న ముముక్షువు!
"మాయను జయించలేక తిరిగి ఈనాడు గృహస్థుగా స్థిరపడిపోతానంటూ వచ్చాడు ఇదే చాలని, ఇది అదృష్టమని భావించడంలేదు నేను. ప్రలోభం ఇక్కడ సుఖమున్నదని ఈడ్చుకు వచ్చినా జిజ్ఞాస అందుకు భిన్నంగా అతడిన దుఃఖపెట్టి తీరుతుంది. అతడు ఆధ్యాత్మిక పథంలో దివ్యజ్యోతిగా వెలుగడమే నా ఆత్మకు సంతృప్తి? నా తిరస్కృతే అతనిలో నిజమైన వైరాగ్య బీజాన్ని నాటుతుంది. అతడా దివ్యపథంలో నిరాటంకంగా సాగిపోగలడు. ఆ నమ్మకం నాకుంది."
"అయితే...."
"మిమ్మల్ని వివాహం చేసుకొనడానికి మనస్ఫూర్తిగానే అంగీకరించాను, ఆనాడు అత్తయ్య ఎదుట? ఆ సంఘటన ఏనాటికీ మిథ్య కాదు. బావమీద నాకుండే ప్రేమ మన దాంపత్యంలో ఎటువంటి కాలుష్యమూ కూర్చదు. నమ్మండి." స్థిరకంఠంతో అన్నది దేవదాసి.
"మరి నేనంటే జుగుస్సా భావంలేదా, దేవతమ్మా?" తను విన్నది ఏదో కలలో అయినట్లూ. నమ్మలేకపోతున్నాట్లూ అయోమయంగా అడిగాడు రమణ.
