Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 44


    "మాటకి మాట బదులు చెప్పడం మానేయక పోతే...." కసిగా హరిత జుట్టుపట్టి వెనక్కులాగి మెడ విరిచినట్టుగా చేశాడు. "ఇలా మెడవిరిచి చంపేస్తాను" అన్నట్టుగా.

    ఆ రాత్రి అసలు నిద్రపట్టలేదు హరితకు. ఏమిటి తన భవిష్యత్తు? అతడి చెప్పుచేతల్లో ఉండిపోవడమేనా? సంగీతం నేర్చుకోవడం ఇష్టంలేదంటే మానేయాలి? డాన్సు ఇష్టంలేదంటే  మానేయాలి? రేపు రిజల్ట్సు వచ్చాక ఉద్యోగం చేయాలనుకుంటోంది.  ఉద్యోగం చేయవద్దంటే మానెయ్యాలి? అంతా అతడు చెప్పినట్టు నడుచుకోవాలి. లేదా ఘర్షణ! దెబ్బలు..... కాపురంనిలవదన్న బెదిరింపులు అంతా అతడు చెప్పినట్టు నడుచుకొంటే తన మనస్సును ఎక్కడ తగలబెట్టాలి? తగలబడిపోయినా  చావులేనిది కదా ఈ మనస్సున్నది. వ్యక్తిత్వాన్ని కోల్పోయి, స్వేచ్చని కోల్పోయి చేసే కాపురం ఒక కాపురమా?

    మరునాడు ఉదయమే అరుణతో చెప్పింది హరిత "సాయంత్రం నేనూ వస్తాను సంగీత పాఠానికి. వెళ్లేప్పుడు పిలవండి!" అని.

    సాయంత్రం అయిదింటికి  వచ్చింది అరుణ.

    ఇంకా ఆఫీసు నుండి రాలేదు కమలాకర్.

    "ఈరోజు నుండి నేను సంగీతం క్లాసెస్ కి వెళుతున్నాను అత్తయ్యా!  మీ కొడుకు వచ్చాక  చెప్పండి ఇలా వెళ్లానని."

    "ఈ సంగీతాలు ఇవీ వాడికిష్టం లేవుకదా. వాడికి ఇష్టంలేని పనులు ఎందుకు చెయ్యడం? ఎందుకు రెచ్చగొట్టి నీకు నీవు కష్టాలు కొని తెచ్చుకోవడం?"

    "రెండు రోజులైతే నేను ఊపిరి పీల్చుకోవడంకూడా ఆయన కిష్టముండదు! వాడికిష్టం లేనప్పుడు ఊపిరి ఎందుకు పీల్చుకొంటావే అంటారా?"


    "నీ చోద్యం కాకపోతే దానికీ దీనికీ సామ్యమేమిటి? పెళ్లాన్ని ఊపిరి పీల్చుకోవద్దని చెప్పే మగడుంటాడా  ఎక్కడైనా? కొందరు మగాళ్లకి కొన్ని ఇష్టముండవు! అది గ్రహించి మానేస్తే గొడవవుండదు.  నాకు పెళ్లయిన  కొత్తల్లో నేను పుట్టింటికి  వెళ్లడం ఇష్టముండేది కాదు మీ మామగారికి. పుట్టింటి మీద ఎంత మనసు పీకుతున్నా 'పోనీలే! పుట్టింటివాళ్లని చూడకపోతే చస్తానా? ఆయనతో గొడవెందుకు?" అని మనసు బిగబట్టుకొనేదాన్ని. నీలాగే  ఎడ్డెం తెడ్డెంగా వాదించి పుట్టింటికి పరిగెత్తి వుంటే నాకు మళ్లీ అత్తింటి ముఖం చూసే అవకాశమే వుండేదికాదు? ఈ కాపురమూ నిలబడేది కాదు!"

     "నిజంగా మీ కాపురం కూలిపోయివుంటే నేను బతికిపోయేదాన్ని! ఈ కమలాకర్ అన్న  రాక్షసుడు పుట్ట కుండా వుండేవాడు నా ప్రాణానికి!" అని వెళ్లిపోయింది హరిత, ఆమె వాగ్యుద్దం ప్రారంభించకముందే.

    పళ్లు పటపట కొరికింది అత్తగారు.

    కొడుకు ఆఫీసునుండి రాగానే పళ్ళు కొరుకుతూనే విసిరిన విసుర్లు చెవిని వేసింది సుబ్బమ్మ.

    పళ్లు కొరకడం అప్పుడు అతడి వంతు అయింది. హరిత ఇంటికి రాగానే మొరటుగా ఆమె జుట్టుపట్టి లాగి మరీ అడిగాడు. "ఏమే? నేను కాదన్న పని చెయ్యడమేనా నీ పని?"

    "మీరు కాదనడానికి అర్దంలేనప్పుడు నేనెందుకు మీ మాట వినాలి?"

    "అర్దం వుండనీ లేకపోనీ! నేను వద్దన్న పని నువ్వు చెయ్యకూడదంతే."

    "నాలో వున్న ప్రతిభను వంటింటి పొయ్యిలో బూడిద చేసుకోలేను!"

    "అయితే రంగస్థల ప్రదర్శనలూ, సంగీత కచేరీలూ చేస్తావన్నమాట!"

    "అయితే రంగస్థల ప్రదర్శనలూ, సంగీత కచేరీలూ చేస్తావన్న మాట!"

    "ఆఁ తప్పకుండా?"

    "అంత  సంగీత నృత్యాలమీద మనస్సున్న దానివి మగణ్ణెందుకు కట్టుకున్నావు? కట్టుకున్నా ఏపగటివేషగాడినో  నాటకాలరాయుణ్ణో కట్టుకొంటే నీ కోరికలకు తాళం వేసేవాడు. సంసారపక్షం వాడిని కట్టుకొని నువ్వు పొరపాటు చేశావు!"

    "సంగీత నృత్యాలను మరీ అంత తేలికగాచేసి మాట్లాడొద్దని ఇదివరకే చెప్పాను."

    "భోగం పాటలు! భోగం ఆటలు! అంటాను... మళ్లీ మళ్లీ అంటాను! ఏం చేస్తావే?"

    "నీమీద కిరోసిన్ పోసి నిలువునా అంటించేస్తాను!"

    "ఆ పని నేనే ముందు చేస్తాను. పీడా విరగడవుతుంది! నీవల్ల ఇంటి మర్యాద బజారు  పడకముందే ఆ పని నేనే చేస్తాను."


                     *    *    *    *         
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS