"వారు లేచిన తరువాత అలాగని నేను చెప్పి పంపించుతానులే?" అంది కావాలనే!
"నన్ను వెంటబెట్టుకుని రమ్మనమని పెదబాబుగారు కూడా చెప్పారు!"
సోములు అనగానే యింక మనసు ఆగలేదు! అందుకే అయి వుంటుంది. పిలవగానే వెళ్ళితే తనకీ మర్యాదగా వుంటుంది. బెట్టు చేయటం దేనికి? యిలాంటి కబురు కోసం ఎదురు చూస్తూనే వున్నాడయ్యే! తన కూతురు తప్ప ఆ వినాయకానికి భార్య అవగల అవకాశం యింకెవ్వరికీ లేదు!....ఆలస్యం చేయటం యిష్టంలేక అప్పుడే మెలుకువ వచ్చినట్టుగా లేచి ఆ మంచంమీదనే కూర్చున్నాడు వెంకయ్య ఆవలించుతూ!
"ఏమిట్రా సోములూ?.....యిలా వచ్చావు?...వంట్లో బాగుండలేదు! వళ్ళంతా సలపరంగా వుంది!" అన్నాడు.
"పగలూ రాత్రిళ్ళు కష్టపడితే ఇలాగే వుంటుందిలెండి! నేను వచ్చింది ఎందుకంటే? అమ్మగారు మిమ్ములను వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నారు. రండి వెళ్దాం!" అన్నాడు సోములు.
"ఇప్పుడా? నాకసలే వంట్లో బాగోలేదు! తరువాతవస్తానని చెప్పు" భార్య ఆడిన అబద్దాన్ని నిలబెట్టాలనే అన్నాడు.
ధీమాగా భర్తవైపు చూసింది సీతమ్మ!
ఇద్దరూ ఒకేమాట అని అనుకోకూడదని సమయస్పూర్తిని మరొకసారి ఉపయోగించింది.
"పెద్దావిడ! అందునా మీ అక్కగారు! ఏదో అవసరం వుండే కబురు చేసి వుంటారు? వెళ్ళకపోతే ఏమయినా అనుకుంటారు!....మన కష్టసుఖాలు ఆలోచించేది! ఆమె కష్టసుఖాలు కూడా మనం చూడాలిగా? వెళ్ళివచ్చిన తరువాత వంటికి నూనె రాసుకుని మర్దించుకుందురుగాని!....వెళ్ళండి!" అంది సీతమ్మ.
ఎప్పుడూ యింత నోరువేసుకుని గయ్ మనే సీతమ్మ యిప్పుడింత నెమ్మదిగా మాట్లాడటం సోములుకి వింతగా వుంది.
అంటూ వెంకయ్య లేచి లోపలికి వెళ్ళేసరికి భర్త వెనుక సీతమ్మ కూడా లోపలికి వచ్చేసింది.
"నేను చెప్పినట్టే అయింది! కామాక్షమ్మ ఇప్పటికిప్పుడు నాకోసం కబురు చేసింది ఎందుకో తెలుసా?" అన్నాడు నెమ్మదిగా.
"ఆఁ...తెలుసుగాని! గబుక్కున వప్పుకోక!...అన్నీ వాళ్ళ నుంచేరావాలి! యిప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎలా? నా దగ్గిర డబ్బు లేదని, పిల్ల వప్పుకోవాలని!....యిలాంటివన్నీ సాకులు చెప్పు! ఆ తరువాత విషయాలు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను! ఏ? మేనకోడలు నలభైకాసుల బంగారం ఎత్తుకెళ్ళితే ఏం చేసిందేమిటి?"
"అలాగేలేవే?- నేను మాత్రం అంత తేలికగా ఆ కామాక్షమ్మని వదిలి పెడతావా? ఆ రోజున మనం వెళ్ళి అడిగితే ఎన్నెన్ని మాటలు అంది? ఎంత అవమానించింది? అవన్నీ అడగనూ?"
"ష్!...అవన్నీ అడగటానికి యిది సమయంకాదు! మనమ్మాయి ఆ యింటి కోడలిగా వెళ్ళిన తరువాత అప్పుడు బలాబలాలు చూపిద్దాం!"
భార్య చెప్పింది ఎంతో నచ్చింది వెంకయ్యకి!
లోపలికి వెళ్ళిన వెంకయ్య ఎంతకీ రాకపోవటంతో సోములుకి కోపంతో పాటు విసుగు కూడా కలిగింది.
కిరాయికి బండి తోలుకుని బ్రతికే ఈ వెంకయ్యతో అమ్మగారికి పనేమిటి? ఆలోచనకి ఈ మహానుభావుడే కావలసి వచ్చాడా? ముల్లుకర్రతో ఎడ్లని పొడవటం తప్ప యింకేమీ తెలియదు! ఏ వ్యవహారానికి పనికి వస్తాడని? అనుకున్నాడు.
భార్యతో మంతనాలాడి మరో అరగంటకిగాని ఇంట్లోనుంచి బైటికి రాలేదు వెంకయ్య.
బట్టలు వేసుకుని వస్తానని లోపలికి వెళ్ళిన వెంకయ్య వంటిమీద వున్న బట్టలతోనే రావటం సోములుకి విడ్డూరం అనిపించింది.
"పదరా సోములూ!" అంటూ వెంకయ్యముందుకి నడిచాడు.
వెనుకనే సోములు!
గుమ్మంలోనే ఎదురయింది సుబ్బలక్ష్మి.
"ఎక్కడికి నాన్నా!"
అని అడగబోయి సోములు వెనుక వుండటంచూసి ఆగిపోయింది.
సోములే వెంటబెట్టుకుని తనతండ్రిని తీసుకువెళుతున్నాడంటే ఏదో పెద్ద విశేషమేవుంది! అంటే రాత్రి తల్లీతండ్రీ చెప్పుకుంటుండగా తనువింది! బహుశా అదే అయివుంటుంది! అంటే తనకీ వినాయకానికీ పెళ్ళి అవబోతుందేమో?...ఆ భావం సుబ్బులుకి కలగగానే ఎంతో సంతోషం కలిగింది.
"నిజంగా పెళ్ళి అవనీ? ఆ వినాయకం పని చెపుతాను!...."
అనుకుని వారిని తప్పుకుని లోపలికి వచ్చింది.
కూతురు ఎదురవటంతో శకునం మంచిదిగానే భావించాడు. తన మనసులోని చిరకాలవాంఛ తప్పక నెరవేరుతుందన్న నమ్మకం కలిగి సోములుకంటే కూడా ముందు నడవసాగాడు వెంకయ్య అమితోత్సాహంతో!
"నాన్న సోములుతో వెళుతున్నాడేమిటమ్మా?"
వరండాలోనే నిలబడివున్న సీతమ్మను అడిగింది సుబ్బులు!
"నువ్వు చాలా అదృష్టవంతురాలివే సుబ్బులూ! చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిప్పింది కొడుక్కి ఎవరయినా పిల్లని ఇస్తారేమోనని! ఎవరూ యివ్వకపోయేసరికి మీనాన్నకోసం కబురుచేసింది ఆ కామాక్షమ్మ! ఇదే జరగనివ్వు! ఆ తల్లీ కొడుకు సంగతి చెప్పుతాను!" కోపంతో అంది సీతమ్మ.
"నీకే కాదు! నాకూ కోపంగానే వుందమ్మా! ఆ కావేరీని సైకిల్ మీద ఎక్కించుకుని స్కూలుదగ్గిర దింపేవాడు. దానికి స్నోలు పౌడర్లు పుస్తకాలు కొనుక్కు వచ్చి చాటుగా యిచ్చేవాడు. నేనున్నానని కూడా లేక ఇద్దరూ సరసాలాడుకునేవారు! రెండవ ఆట సినిమాకి కూడా సైకిల్ మీదనే వెళ్ళేవాళ్ళట! బోలెడంత బంగారం పెట్టిందట! అదంతా ఎత్తుకుపోయిందట! అ అమహాతల్లికి అలాగే కావాల్సిందే?" కసిగా పళ్ళు నూరుకుంది సుబ్బులు!
"ఆ తల్లీ కొడుకుల జాడ్యం ఎలా వదిలించుతావో? మనం తన అంతస్థుకి తాగమని ఎత్తి పొడిచింది. యిప్పుడేమయిందో ఆ అంతస్థు? కావేరి పారిపోతూ పట్టుకెళ్ళిందేమో?"
"ఆ కామాక్షమ్మ కబురు చేసింది అందుకే అయితే మాత్రం నువ్వేమీ చెప్పనవసరం లేదు! ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను!"
కూతురు ఎంతో నమ్మకంతో చెప్పేసరికి ఆ తల్లికి వూరట కలిగింది. సుబ్బులు లోపలికి వెళ్ళి చేతిలోని పుస్తకాలు గూటిలోకి నిర్లక్ష్యంగా విసిరేసింది "యింక మీ అవసరం లేదన్నట్లుగా!"
వళ్ళు విరుచుకుంది! చేతులు జాపుకుంది! వేళ్ళు సాగతీసుకుంది! కావేరి పారిపోవటం తనకి ఎంతో మేలు కలిగింది. దానికి సినిమా హీరోయిన్ అవ్వాలన్న పిచ్చి తప్ప పెళ్ళి చేసుకోవాలని లేకపోవటం వలనను....ఆ రోజున తను ఉబ్బేయటం వలనను అలా చేసిందనిపించింది. అదీ ఒకందుకు మంచిదే!....వినాయకాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి!...తను ఆడించినట్టల్లా అతను ఆడాలి! లేకపోతే కావేరితో అతను తిరిగినవి, చాటుచాటుగా తెచ్చిచ్చినవి అడపాతడపా గుర్తుచేసి తను ఫలితం పొందాలి!...
అలా అనుకుంటున్న సుబ్బులు పెదాల మీద పెద్దగా నవ్వువెలిసింది.
