అంతే తప్ప అతను జైలుకి పోవడం కాదు.
ఏమీ ఎరగనట్లు ఆశ్చర్యం నటిస్తూ పోలీసులవైపు చూసింది సితార.
"యస్ ఆఫీసర్?" అంది ప్రశ్నార్థకంగా.
911కి ఫోన్ చేసింది మీరేనా?'
"నేనా? లేదే!" అంది అమాయకంగా.
ఆ తర్వాత ఏదో గుర్తు వచ్చినట్లు, "వాట్ బేబీ! ఇందాక ఏదో ఫోన్లు చేశావ్ - ఒక నెంబరు బదులు ఇంకొక నెంబరు నొక్కావా ఏమిటీ?" అంది సన్నాయి నొక్కులు నొక్కుతూ.
"ఏమో! అయి వుండవచ్చును" అంది సునయన, అబద్ధానికి అతి తేలికగా అల్లిక వేస్తూ. తల్లి ఆ అమ్మాయికి ఇట్లాంటి విద్యలు చాలానే నేర్పింది.
"సారీ ఆఫీసర్! మీకు ఇబ్బంది కలిగించాం!" అంది సునయన.
"మిస్ యూనివర్స్ వల్ల మిస్టేక్స్ జరిగినా అదీ ఒక అందమే!" అన్నాడు పోలీసు, వంగి అభివాదం చేస్తూ.
కానీ-
అతను పూర్తిగా కన్విన్స్ కాలేడు. వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆనంద్ వైపు అనుమానంగా చూసి, "జాగ్రత్తగా ఉండండి సర్!" అన్నాడు.
భయకంపితుడయి వున్న ఆనంద్ వైపు విజయగర్వంతో చూసింది సితార.
ఆనంద్ అట్లా వానపాములా మెత్తగా ఉంటే ఆమెకి ఆనందం!
పోలీసులు వెళ్ళిపోగానే, తను కూడా లేవబోయాడు సూరజ్. అతనికి అక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది.
"అయ్యో! అప్పుడే వెళ్తావేం! కాసేపు కూర్చో! ఇంతకీ నీకు అరుణ తెలుసంటావు!" అంది సితార.
"మనిషి తెలుసు. మనసు ఇంకా తెలియదు" అన్నాడు సూరజ్, తనకి తనే చెప్పుకుంటున్నట్లుగా.
"ఓహో! మనసుల వ్యవహారమా! మనసు పడ్డావా దానిమీద?"
"నాకు ఇష్టం! అరుణకే కష్టంలాగా వుంది. బహుశా నా అర్హతలు ఆమెకి తగినవి కావనుకుంటాను" అన్నాడు సూరజ్ సాలోచనగా.
"ఏమిటి నీ క్వాలిఫికేషన్సు!" అన్నాడు ఆనంద్ అప్రయత్నంగా.
"కంప్యూటర్ సైన్సెస్ లో ఒక డిగ్రీ, వంశపారంపర్యంగా వస్తున్న వజ్రాల వ్యాపారం, ఒక వెయ్యి కోట్ల ఆస్తి. అంతే! అంతకుమించి నాలో ఇంకే క్వాలిఫికేషన్లూ లేవు. బహుశా అందుకే నేను అరుణకి తగనేమో! ఆ అమ్మాయి చాలా గొప్పది!" అన్నాడు సూరజ్.
అతను ఆ మాటలు ఆనంద్ తో చెప్పినా కూడా సితారనీ, సునయనీ ఉద్దేశించే అన్నాడు. వాళ్ళిద్దరి వాలకం సూరజ్ కి సుతరామూ నచ్చలేదు.
వింటున్న సితారకి ఊపిరాగిపోయినట్లయింది.
"వెయ్యికోట్ల ఆస్తా!" అంది కలవరిస్తున్నట్లుగా.
సునయన మనసులోనే అనుకుంది 'ఎంత అందగాడో! ఆ కళ్ళు చూడు! అజంతా గుహల్లోని చిత్తరువులకి ఉన్నట్లు! మొగుడంటే ఇట్లా వుండాలి! ఇట్లాంటి మొగుడు కావాలి తనకి!' అనుకుంది.
ఇంత ఎలిజిబుల్ బ్యాచిలర్ ని వద్దనేసిందా అరుణ! ఎందుకు?
వింటున్న సితార మొహం వికసించింది.
"నిజంగా వద్దనేసిందా?" అంది సితార ఆత్రంగా.
"అవును" అన్నాడు సూరజ్.
"ముదనష్టం వదిలింది! అది సరే అని ఉంటే నీ మెడకు ఉరే అయ్యేది. నువ్వేం బాధపడకు! అది కాకపోతే ఇది! ఆ అరుణా, నా సునయన ఇద్దరూ - ఇదిగో - ఈ తండ్రికి పుట్టిన వాళ్ళే! ఇద్దరూ ఒకే పోలిక! ఒకళ్ళని చూసి ఒకళ్ళని పొరపాటు పడుతూ వుంటారు జనాలు! అయినా సరే! నా సునయనతో పోలిస్తే ఆ అరుణ ఆరిపోయిన దీపపు సెమ్మెలా వుంటుంది. ఇది థౌజండ్ వాల్ట్ బల్బు - అది గుడ్డి దీపం! అంతా మన మంచికే! నువ్వు ఊ అను. ఇప్పుడే పెళ్ళి చేయించేస్తాను. ఇక్కడికి దగ్గరలోనే ఉంది ఫ్రేమింగ్ హామ్. ఆ వూళ్ళోనే వుంది లక్ష్మీదేవి టెంపుల్! సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి లాగే వుండే సునయనని వదులుకోకు! అరుణ దీనికి అక్క వరస! అది నిజంగానే పెద్దమ్మ. దద్దమ్మ కూడా! జ్యేష్టాదేవి! ఏమంటావ్?" అంది సితార గుక్కతిప్పుకోకుండా.
చివాలున లేచి నిలబడ్డాడు సూరజ్.
"నేను వెళ్ళాలి!" అని అసహనంగా సితారతో చెప్పి, "థాంక్స్ ఫర్ ద కాఫీ!" అని మాటవరసకు మర్యాదగా అన్నాడు సునయనతో.
తర్వాత ఆనంద్ వైపు తిరిగి - "వస్తాను సర్! టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్!" అన్నాడు సానుభూతి ప్రకటిస్తూ.
ఆ తర్వాత ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా విసవిస నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు.
వెంటనే ఆనంద్ వైపు తిరిగింది సితార.
"ఏం! మొదటి పెళ్ళాన్నీ, మొదటి కూతుర్ని తలుచుకుని తలుచుకుని మురిసిపోతున్నావా ఏమిటి? నువ్వు ఆస్తులు తగలేసింది చాలదూ? నీ కూతురు చేస్తున్న నిర్వాకం ఏమిటి? అదృష్టం తలుపు తడితే దొడ్డిదారిన పారిపోయాట్ట ఎవరో! అట్లా వుంది నీ కథ! దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంకాస్త దరిద్రం ప్రసాదించమని వేడుకున్నాట్ట నీలాంటి దరిద్రుడే ఎవరో! డబ్బు విలువ తెలియకుండా ఏం అహంకారాలూ! అసలు ఏం చూసుకుని అంత కన్నూ మిన్నూ కానని అహంకారం! అందమా చందమా! నా సునయనతో పోలిస్తే సూది మొన అంత చక్కదనం కూడా లేదు."
"నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను" అన్నాడు ఆనంద్ భయం భయంగా. ఆ తర్వాత మెల్లిగా అడిగాడు.
"డబ్బులేమన్నా ఉంటే ఇస్తావా?"
"నిన్న ఇచ్చిన డబ్బులు మిగిలి ఉండాలి. లెఖ్ఖ చెప్పలేదేం?"
"ఒక లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నా!" అన్నాడు ఆనంద్ జంకుతూ.
"ఏమిటీ! ఏమిటీ? లాటరీ టిక్కెట్టు కొన్నావా? ఎందుకూ?"
"నా అదృష్టం తిరుగుతుందేమోనని!" అన్నాడు ఆనంద్. ఆ తర్వాత ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ నిలవకుండా బయటికి వెళ్ళిపోయాడు.
సితారకి తెలియకుండా అతను చేసిన పని ఒకటి వుంది. నిన్న అర్థరాత్రి లేచి అతను తన పాస్ పోర్టును గుట్టు చప్పుడు కాకుండా తన జేబులో పెట్టేసుకున్నాడు.
తన ఇంట్లో తన పాస్ పోర్టుని తనే దొంగిలించవలసిన దుస్థితి! ఈ దొంగ బతుకు తను ఇంక బతకలేడు.
ఇక్కడనుంచి పారిపోవాలి.
ఇండియాకు వెళ్ళిపోవాలి!
ఇప్పుడే!
ఇప్పుడీ కుర్రాడు జాహ్నవీ అరుణల సంగతి గుర్తుతెచ్చాక ఇంక ఒక్కక్షణం కూడా ఇక్కడ వుండాలనిపించడం లేదు.
అమెరికా వదిలి వెళ్ళిపోవాలి!
అంతకు ముందుగా - ఈ దెయ్యాల కొంపని శాశ్వతంగా వదిలి వెళ్ళాలి.
తన పాస్ పోర్టు తన జేబులో పెట్టేసుకోగలగడంతో సగం పని పూర్తయినట్లే!
పాస్ పోర్టు తను సొంతం చేసుకోగలిగాడు!
పాస్ పోర్టు జేబులో పెట్టేసుకోగలిగాడు గానీ - జేబులో డబ్బులు ఉంటే కదా ఈ దేశం దాటి బయటపడేది!
అమ్మలాంటి ఇండియా!
కనీసం ఓ వెయ్యి డాలర్లు వుంటే గానీ ఇండియా చేరలేడు.
వెయ్యి డాలర్లు! ఎలా వస్తాయి తనకి?
వెయ్యిడాలర్ల మాట అటుంచు!
ఇవాళ తనకి అన్నం దొరికేదెలా?
ఏ పాటు తప్పినా సాపాటు తప్పదన్నారు గదా!
కండ పుష్టి లేదుగానీ తిండి పుష్టి వుంది తనకి!
వయసులో వున్నప్పుడు తన భోజన పరాక్రమం ప్రసిద్ధిపొందింది గదా!
మిర్చీ బజ్జీల బండి దగ్గరికెళ్ళి బుట్టెడు బజ్జీలు మంచినీళ్ళడక్కుండా తినేసేవాడు.
ఆకలి వెయ్యడం మొదలెట్టింది ఆనంద్ కి. ఆకలికి తాళలేడు అతను.
ఇవాళ తనకి అరవై నిండాయి.
ఇవాళ తన బర్త్ డే!
'హ్యాపీ బర్త్ డే!' అని గ్రీటింగ్సు లేవు.
అరుపులూ కేకలూ తప్ప కేకు కొయ్యడం లేదు. తెల్లారకముందే తిట్లతో తలంటు!
కాఫీ కూడా ఇవ్వలేదు తనకు తన పుట్టినరోజున!
అరవై నిండాయంటే అతిఘనంగా షష్టిపూర్తి చేసుకుంటారే -
తనకి ఈ రోజు అన్నమెట్లా అని ఆలోచించవలసిన దుస్థితి!
"అంకుల్!" అని వినబడింది ఒక పిలుపు.
ఆగి చూశాడు ఆనంద్.
