పక్కింటి అబ్బాయి - దేశీనే - ఇండియన్. పెద్ద అమెరికన్ కంపెనీలో పెద్ద ఉద్యోగం.
"ఒక్కసారి మా ఇంటికి వస్తారా!" అన్నాడు అతను.
మొహానికి నవ్వు పులుముకుని, "బావున్నారా?" అంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఆనంద్.
ఆ ఇంట్లో ఆ కుర్రాడూ, వాళ్ళ అమ్మా, నాన్నా, అతని భార్యా ఉంటుంటారు. తల్లి దండ్రులని పార్వతీ పరమేశ్వరులలాగా చూసుకుంటాడు అతను.
దేనికయినా పెట్టి పుట్టి వుండాలి!
"అంకుల్! ఇవాళ మీరు మా ఇంట్లోనే భోజనం చెయ్యాలి!" అన్నాడు అతను. "చిన్న ఫంక్షను చేసుకున్నాం"
ఆ కుర్రాడికి తెలుసు - ఆనంద్ ఇంటి పరిస్థితి! చిన్నపిల్లలకి తాయిలం పెట్టినట్లు అప్పుడప్పుడు పిలిచి ఏవో ఒకటి తినిపిస్తూ వుంటాడు.
అతని మాట పూర్తికాకుండా అతని భార్య గొప్పగా చెప్పడం మొదలెట్టింది.
"ఇవాళ మా మామగారికి 'భీమరథశాంతి' చేయిస్తున్నాం" అంది.
"అంటే?" అన్నాడు ఆనంద్.
ఆ అబ్బాయి చెప్పాడు. "అంటే డెబ్బయ్యవ పుట్టినరోజు పండగ అన్నమాట!" అని నవ్వి అన్నాడు. "పురాణాల ప్రకారం, భీముడికి ఒక రథసారధి ఉండేవాడుట. అతనికి అరవై ఏళ్ళు వచ్చాయి. కానీ భీముడి సేవలో పూర్తిగా మునిగిపోయి వుండడం వల్ల షష్టిపూర్తి పండగ చేసుకోవడం కుదరలేదు. డెబ్బయ్ నిండాక అప్పుడు కుదిరి షష్టిపూర్తి ఉత్సవం చేసుకున్నాడు. అప్పటి నుంచి డెబ్బయ్యవ పుట్టినరోజుని భీమరథశాంతి' అని వ్యవహరించడం మొదలయింది" అన్నాడు. వెంటనే అతని భార్య అందుకుని చెప్పడం మొదలెట్టింది. "మీకు తెలిసే వుంటుంది. సహస్ర చంద్రదర్శనం అంటే ఎనభై నాలుగేళ్ళు నిండడం అన్నమాట. అంటే అప్పటికి పౌర్ణమిని వెయ్యిసార్లు చూసి వుంటారు. అధికమాసాలు లెక్కేసుకుంటే ఎనభై ఒకటో ఏటే చేసేయవచ్చు. అప్పుడు కూడా మీరు మాతో కలిసి భోజనం చేయాలని ఇప్పుడే బుక్ చేసేస్తున్నాం. ఇప్పుడీ ఫంక్షను గ్రాండ్ గా చెయ్యడం కుదరలేదుగానీ సహస్ర చంద్ర దర్శనం మాత్రం వైభవంగా చేస్తాం" అంది. అలా అనడంలో అత్తా మామల మీద ఆపేక్షకంటే కూడా డాబుసరి ప్రదర్శించడమే ఎక్కువగా కనబడుతోంది.
కడుపులో దేవినట్లయింది ఆనంద్ కి.
ఈయనకి భీమరధశాతి! తనకేమో పుట్టినరోజున అన్నం పెట్టేవాళ్ళే లేరు. హఠాత్తుగా అతని ఆకలి చచ్చిపోయింది.
ఆకలి ఛస్తే చావనీ! కనీసం మనసు బతికి ఉందా?
మనసు బతికి లేకపోతే 'మనవాళ్ళు' అనేవాళ్లకోసం ఇంతగా ఎందుకు తపిస్తుందీ?
తనకి 'మనవాళ్ళు' అంటే అరుణా, జాహ్నవీ.
వాళ్ళు ఇండియాలో ఉన్నారు.
వెళ్ళాలంటే వెయ్యి డాలర్లు కావాలి.
ఎలా వస్తాయి తనకి? ఎలాగో అలాగ!
'బెగ్ - బారో - ఆర్ స్టీల్' అన్నారు.
దొంగతనంగానో, దొరతనంగానో - అప్పు చేసో - తప్పు చేసో - ఇక్కణ్ణుంచి తప్పించుకుని ఇండియాకి వెళ్ళిపడాలి.
వెళ్ళి జాహ్నవి కాళ్ళమీద పడిపోయి క్షమించమని అడగాలి.
అరుణని అక్కున చేర్చుకుని ముద్దు చేయాలి.
పెద్దదయిపోతేనేం. తనకి ముద్దుల కూతురే కదా! ఎంత వయసు వచ్చినా తనకి పసిపాపే!
తన కంటిపాప కూడానూ!
అరుణా, జాహ్నవీ ఇద్దరూ తనకి రెండు కళ్ళు. ఇకముందు తన జీవితాన్ని నడిపించబోయే రెండు కాళ్ళు.
వెళ్ళి తన రెండు కళ్ళనీ కళ్ళారా చూసుకోవడానికి వెయ్యి డాలర్లు కావాలి.
ఎలా వస్తాయీ? తలుచుకుంటే చాలా తమాషాగా అనిపిస్తుంది.
ఆఫ్టరాల్ అరలక్ష కోసం తను ఇంతగా ఆరాటపడిపోవడమా!
కోట్లకి కోట్ల ఆస్తి తగలేసినవాడు తను!
తనే దేవుడూ - తనే దెయ్యం కూడా అన్నట్లుగా బతికాడు.
తనమీద తనకే కంట్రోలు లేదు!
తరతరాల నుంచి వస్తున్న అగ్రహారం ఆస్తులని ఒక్క తరంలో హరింపజేశాడు తను.
అగ్రహారం ఆస్తులే కాదు - 'పట్నం' అని ఆ రోజుల్లో అందరూ పిలిచే మెడ్రాసు మహానగరం లోని ఆస్తులూ కర్పూరంలా కరిగించేశాడు.
తరాల క్రితం ఎవరో ఒక మహారాజు తమ కుటుంబంలో వున్న వేద విద్యలని మెచ్చి అగ్రహారం దానమిచ్చిన లెవెల్లో తనూ దానధర్మాలు చేశాడు.
ఓ రోజున ఓ మిరపకాయ బజ్జీల బండీ వాడి పాక నైపుణ్యానికి పరవశుడయి మెడ్రాసు మహానగరంలో మూడెకరాలు రాసివ్వలేదూ?
అప్పట్లో అది తనకి 'ముష్టి' మూడెకరాలు!
అంతే!
ఇప్పుడు ఒక్క వెయ్యి డాలర్లకోసం తను ముష్టెత్తే లెవెల్లో వున్నాడు.
"అమ్మా ధర్మం! అయ్యా ధర్మం! ఈ దీనుడు తన దేశం చేరుకోవడానికి తమకి తోచినంత దానం చేయండి. చేసిన ధర్మము చెడని పదార్థము - వచ్చును మీ వెంటా..."
తనకు తెలియకుండానే పైకి పాడేస్తున్నాడు ఆనంద్.
"వస్తా వట్టిది
పోతా వట్టిది
ఆశ ఎందుకంటా
చేసిన ధర్మము
చెడని పదార్థము
చేరును నీ వెంటా.."
పాట పాడుతుంటే వెక్కిళ్ళు వస్తున్నాయి.
పాతబడిపోయిన ప్యాంటూ షర్టూ వేసుకుని, ఏడుస్తూ వెళుతున్న ఆనంద్ ని కొందరు వింతగా, కొందరు సానుభూతిగా చూస్తున్నారు.
వెయ్యి డాలర్లు! ఎవరిస్తారు? ఎలా వెళ్తాడు తను ఇండియాకి?
"హై" అని ఉత్సాహంగా వినబడింది ఒక పిలుపు. స్త్రీ కంఠం.
వెయ్యి డాలర్లు వరంగా ఇవ్వడానికి ఏ దేవత అన్నా ప్రత్యక్షం అయిందా!
నిజం దేవత కాదు గానీ ఆనంద్ కళ్ళకి అచ్చం అట్లాగే కనబడే శృతి నిలబడి ఉంది అక్కడ - పక్కనే ఆమె కారు.
శృతి! పొడుగుకాళ్ళ సుందరి!
లాంగ్ లెగ్గ్ డ్ మోడల్ లాంటి శృతి.
విలాపంలో ఉన్న ఆనంద్ లో నుంచి విలాసపురుషుడు చటుక్కున బయటికి గెంతాడు.
"హై హనీ!" అన్నాడు. ఆమెవైపు తమకంగా చూస్తూ.
"మీ ఆరోగ్యం ఎలా వుంది?" అంది శృతి.
"నాకేం! పడుచువాళ్ళతో పోటీ పెడితే వాళ్ళే వెనకబడిపోతారు. అంత స్టామినా!" అన్నాడు ఆనంద్, పొట్ట లోపలికి లాక్కుని, ఛాతీ ఉప్పొంగిస్తూ.
నవ్వింది శృతి.
"మీకోసం ఒక డీల్ ఏర్పాటు చేశాను. రెగ్యులర్ గా డాలర్లు వస్తాయి" అంది వూరిస్తున్నట్లు.
'డాలర్లు' అనగానే అలర్టు అయ్యాడు ఆనంద్.
"డాలర్లా! ఎట్లా వస్తాయి?"
"వాలంటీర్ గా పని చేస్తే"
ప్రశ్నార్థకంగా చూశాడు ఆనంద్.
"కారెక్కండి. చెబుతాను" అంది శృతి.
కారు బోస్టన్ నగరం చేరింది.
అక్కడ వున్న ఛార్లెస్ నది ('ఛార్ల్స్ అని పలుకుతారు) దాటితే, ఆ పక్కనే వుంటుంది కేంబ్రిడ్జి నగరం. బోస్టన్, కేంబ్రిడ్జి రెండూ జంటనగరాలు.
కేంబ్రిడ్జిలో వుంది ఒక పెద్ద ఆరోగ్య వైద్య విజ్ఞాన సంస్థ. అక్కడ ఆపింది శృతి తన కారుని.
"ఇందులోనే నేను రిసెర్చి చేస్తోంది" అంది శృతి.
"అక్కడ ఇండియా కేఫ్ లో పార్ట్ టైం ఉద్యోగం - అది కేవలం నా చదువు కోసం మాత్రమే. ఇండియాలో మా డాడీ పెద్ద పొలిటీషియను. అక్కడ ఎంత పెద్ద పొలిటీషియన్ కూతుర్ని అయినా, ఇక్కడ జరుగుబాటు కోసం ఏదో ఒక పార్ట్ టైం చేయాల్సిందే! అది అందరికీ తెలిసిందే కదా!" అంది.
"తెలియకేం!" అన్నాడు ఆనంద్.
"ఎందుకోగానీ మిమ్మల్ని చూస్తే మా డాడీనే గుర్తొస్తారు. తండ్రిని గుర్తుతెచ్చే మగవాళ్ళనే ఆడపిల్లలు తమకి తెలియకుండానే ఇష్టపడతారని అంటారు. నా విషయంలో అది నిజమే!" అంది శృతి నర్మగర్భంగా.


