తలుపు తీసీ తీయకముందే -
జడివానలాగా కురుస్తున్న తిట్ల వర్షం తాలూకు తుంపరలు తనమీద పడి తడిపేస్తున్నట్లుగా ఫీలయ్యాడు సూరజ్.
మార్దవం అన్నమాటే లేని స్త్రీ కంఠం. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది ఎవర్నో.
ఆ ఇంట్లో -
పొద్దెక్కిపోతున్నా ఇంకా దుప్పటి ముసుగుతన్ని పడుకునే ఉన్నాడు ఆనంద్.
అతనికి లేవాలని లేదు. లేస్తే నిజజీవితంలో పడతాడు. అయితే - కళ్ళు మూస్తే చాలు పీడకలలు!
కానీ - తన నిజజీవితంతో పోలిస్తే పీడకలలే బెటరు. ఇవాళ ఇంట్లో ఏంగొడవ వుందో! కడుపుకి సాపాటు లేకపోయినా రోజు గడుస్తుందిగానీ, పోట్లాట లేకుండా పూట గడవదు సితారకి!
అతని భార్య కాని భార్య అయిన సితార గొంతు వినబడుతూనే ఉంది. ఆమె గతాన్ని త్రవ్వి తీసే విధానం చిత్రంగా వుంటుంది. ఏది గుర్తు వస్తే ఇంక దానితోనే దండకం మొదలూ-
"ఆనంద్ రాజ్ ఆనంద్ అన్న పేరు చూసీ, ముక్కున పెట్టుకుని మాట్లాడుతున్న ముష్టి మూడు ముక్కలు పంజాబీవి వినీ మావాడే అనుకుని దగ్గరయి జీవితం ముక్క చెక్కలు చేసేసుకున్నాను! తెలుగువాడని తెలియక తెలివితక్కువగా మోసపోయాను. ఇంకెంతమందిని ముంచేశాడో!"
అప్పుడు సూరజ్ తో బాటు ఇంట్లోకి అడుగుపెడుతున్న సునయన కూడా తల్లి మాటలు వినబడగానే ఇంక వివశురాలయిపోయి, తనకి తోడుగా ఇంకొక పరాయి మనిషి ఉన్నాడన్న స్పృహ కూడా లేకుండా తను కూడా తండ్రి మీద దాడి మొదలెట్టింది.
"పెళ్ళీడు కూతురు వుందన్న బుద్ధి కూడా లేదు. బోస్టన్ లో ఇండియా కేఫ్ లో ఒక పొడుగుకాళ్ళ పిల్లని పట్టుకుని 'నువ్వంత బావుంటావ్. ఇంత బావుంటావ్' అని భజనా? అదే చెప్పిందిలే! దాని పేరేమిటీ - శృతి! అదే గనక మిస్ యూనివర్స్ పోటీకి వెళితే నా బదులు అదే సెలెక్ట్ అయి ఉండేదని కాంప్లిమెంటు కూడానా!"
తక్షణం సునయన తల్లి సితార అందుకుంది వంత పాటలాగా.
"సర్ పే బుఢాపా హై మగర్ మన్ మే జవా హై" అని అదేదో సినిమాలో పాడాడు జోహార్. తలమీదికి ముసలితనం ముంచుకొచ్చినా, తల లోపల మాత్రం వలపు తలపులేట! జోహార్ పాడితే జోహార్లు అర్పిస్తాం. నువ్వు పాడితే జోకరువయిపోతావు. ఆ పిల్లదానితో మాటల్లో పడిపోయేవా. ఆరోజు ఎయిర్ పోర్టుకి ఆలస్యంగా వెళ్ళావూ? మాటల్లో పడడమేనా లేకపోతే మళ్ళీ ప్రేమలో పడిపోయావా? మారు మాట్లాడకుండా ముంగిలా ఉండిపోతావేం? కారు ఇచ్చి సునయనని ఎయిర్ పోర్టునుంచి ఇంటికి తీసుకురమ్మంటే ఆరోజున ఇంక అదే పోత పోతావా? పాపం పిల్ల క్యాబ్ లో రావలసి వచ్చింది. కారు ఉండి కూడా క్యాబ్ లో రావలసిన ఖర్మ దానికేమి పట్టిందీ? ఎంత ఖర్చూ! ఖర్చు సంగతి నీకేం పట్టింది? ఒక్క సెంటు సొమ్ము సంపాదించే మాట లేదుగానీ సెంటు పూసుకుని ఊరెంబడి ఊరేగమంటే మాత్రం మహా షోకు!"
"నా కళ్ళజోడు కనబడదేం?" అన్నాడు ఆనంద్, లేచి తడుముకుంటూ.
"ఇంకా కళ్ళజోడెందుకూ? ఇంకాసిని మంది కొత్త పిల్లల్లో కొత్త కొత్త అందాలు వెదకాలనా? చూపు మందగిస్తోందిగానీ, చూపులు పదునెక్కిపోతున్నాయే! నీ కూతురు కాకుండా అదెవత్తో మిస్ యూనివర్స్ అయి వుంటే బావుంటుందనుకున్నావా? బావుంది బావుంది! ఏళ్ళొస్తున్నాయ్ గానీ ఏం లాభం! ఇవాళ్టికి అరవై! అరవై నిండినా ఇంకా ఇరవయ్యేళ్ళ బాలాకుమారుడిననుకుంటే ఎట్లా! తలంటి పోసుకుని తగలడండి! తల లోపల వున్న మురికి వదుల్తుందేమో!"
తల్లీ కూతుళ్ళిద్దరూ తనని అలా నిలబెట్టి కడిగేసి, 'తలంటి పోయడం తరచుగా జరుగుతూనే వుంటుంది. కానీ -ఇవాళ- ఇతనెవరో కొత్త కుర్రాడు - ఇతని ముందు...
'అత్త తిట్టినందుకు కాదుగానీ తోటికోడలు నవ్వినందుకు...' అన్న సామెత చందంగా వుంది ఆనంద్ పరిస్థితి.
తల వంచుకుని గబగబ బాత్ రూంలోకి నడిచాడు.
"తలంటి అన్నాను గదా అని షాంపూ బాటిలంతా ఖాళీ చేసేస్తారేమో! జాగ్రత్త!" అంది సితార.
ఎర్రబడిన మొహంతో తలుపేసుకున్నాడు ఆనంద్. సితార తిట్ల వుధృతం తగ్గడానికి కాసేపు పట్టింది. ఆ తర్వాత ఆమె దృష్టి సూరజ్ మీద పడింది.
"ఐయామ్ సారీ! మాది మిజరబుల్ లైఫ్ యంగ్ మాన్! ఈ గొడవలు రొటీనే! మీరు...?" అని ప్రశ్నార్థకంగా సునయనవైపు చూసింది.
"ఇతని పేరు సూరజ్ మమ్మీ! అరుణ ఇతనికి తెలుసుట!" అంది సునయన.
"అరుణా!" అని చేదుగా మొహం పెట్టింది సితార. "ఎట్లా తెలుసూ?"
"అదే తెలియదు. తెలుసుకుందామనే తీసుకువచ్చాను" అంది సునయన.
"కూర్చోండి సూరజ్. కాఫీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది.
"అరుణ ఎట్లా తెలుసూ?" అంది సితార, పోలీసు అధికారి ప్రశ్నిస్తున్నట్లు.
"హైదరాబాద్ లో నేను వాళ్ళ ఇంట్లో కొద్దిరోజులు అద్దెకి ఉన్నాను."
"అది వాళ్ళ ఇల్లు కాదు. మా ఇల్లు" అంది సితార కరుస్తున్నట్లుగా.
"అవును!" అన్నాడు సూరజ్ ఇంకేమనాలో తోచక.
"మావి అని మేం అనుకునేవన్నీ అదీ, దాని అమ్మా కలిసి దోచుకున్నారు. దేవుడనే వాడే వుంటే వాళ్ళు పురుగులు పట్టి పోవాలి" అంది సితార అక్కసుగా.
ఆశ్చర్యంగా చూస్తున్నాడు సూరజ్.
అరుణా, వాళ్ళ అమ్మ జాహ్నవిగారూ తమకి ఉన్నదంతా దోచి లేనివాళ్ళకు పెట్టే మనుషులు.
అట్లాంటి వాళ్ళు - ఈ గండా గొండి మనుషులని మోసం చేసి దోచుకోవడమా! ఇంపాజిబుల్...
తన ధోరణిలో ఏదేదో చెప్పుకుపోతూనే ఉంది సితార.
కాఫీ తెచ్చింది సునయన.
అదే టైంలో - మొహం టవల్ లో దాచేసుకుంటూ, బయటికి వచ్చాడు ఆనంద్.
కొలంబియన్ కాఫీ సువాసన ఆనంద్ నాసికా పుటాలకు సోకింది.
"కాఫీ తీసుకోండి" అంది సునయన సూరజ్ తో. ఒక కప్పు అతనికి అందించింది. ఒక కిప్పు సితారకి ఇచ్చింది. ఇంకో కప్పు తను తీసుకుని సోఫాలో కూర్చున్న తర్వాత "చెప్పండి" అంది సూరజ్ తో.
అంతే తప్ప, తల్లీ కూతుళ్ళలో ఎవ్వరూ కూడా ఆనంద్ కి కాఫీ ఆఫర్ చేయలేదు.
టవల్ లోనే మొహం దాచుకుంటూ గబగబ తన గదిలోకి వెళ్ళిపోబోయాడు ఆనంద్.
"ఎక్కడికా ఉరుకులూ పరుగులూ - మీ మహత్యం గురించే మాట్లాడుకుంటున్నాం! రండి! దయచేయండి! అంది సితార.
నెమ్మదిగా వచ్చి కూర్చున్నాడు ఆనంద్.
"కాఫీ మీరు తీసుకోండి" అని తన కప్పు ఆనంద్ కి అందించబోయాడు సూరజ్.
"వద్దు! నేను కాఫీ టీలు తాగడం మానేశాను" అన్నాడు ఆనంద ఇబ్బందిగా.
"ఒకప్పుడు రోజుకి అరవై కప్పులు తాగినవాడేలే! పీపాలతో విస్కీతో బాటుగా! ఇప్పుడు షుగర్, బీ.పీ. వచ్చి సూకరాలు గానీ...ఊ...ఇంతకీ అరుణా, దాని అమ్మా నీకు తెలుసన్నమాట!" అంది సితార.
చటుక్కున తలెత్తి చూశాడు ఆనంద్.
అరుణ, జాహ్నవిగారూ...
"అరుణా...వాళ్ళ అమ్మగారూ వీళ్ళకి తెలుసా? ఎలా తెలుసు?
అరుణ అన్న పేరుని పలకడంలోనే అపహాస్యం పలికిస్తున్న సితారని చూస్తే చిరాకనిపించింది సూరజ్ కి.
"వాళ్ళిద్దరూ నాకు తెలుసు. చాలా మంచి మనుషులు" అన్నాడు స్థిరంగా.
గయ్ మని లేచింది సితార.
"అంత మంచోళ్ళు కావడం వల్లేగా ఈ మొగమహారాజు ఇంకా వాళ్ళని వదలలేకుండా ఉన్నదీ! చదువుకున్నవాడివి. నువ్వయినా చెప్పు బాబూ! ఒక పెళ్ళాం వుండగా ఇంకో దాని వెంట పడడం ధర్మమేనా? నా వెంటపడి నాకొక కూతుర్ని కన్నా కూడా నన్ను కట్టుకోకపోవడం తప్పా ఒప్పా? నువ్వే చెప్పు?" అంది సితార - హఠాత్తుగా ఆ సీన్ ని ఒక 'పంచాయితీ' గా మార్చేస్తూ. అది ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.
"నీతో కలవడమే ఒక తప్పు. నిన్ను చేసుకోవడం రెండో తప్పు అవుతుంది గదా!" అన్నాడు ఆనంద్ అతి కష్టంమీద గొంతు పెగుల్చుకుంటూ. ముక్కూ మొహం తెలియని సూరజ్ ముందు అవమానం జరగడం అతనిలో ఎప్పుడో అణగిపోయి వున్న పౌరుషాన్ని అతి కొద్దిగా లేపింది.
"ఏమంటున్నావ్?" అంది సితార గొంతు చించుకుని అరుస్తూ. "మాటకి మాట చెప్పడం మొదలెట్టావా! బేబీ! 911 కి రింగ్ చెయ్!" అంది సితార అఘాయిత్యంగా.
తక్షణం 911 నెంబరుకి ఫోన్ చేసింది సునయన.
అమెరికాలో 911 నెంబరుకి చాలా ఇంపార్టెన్సు వుంది. అది నేరుగా పోలీసులని అలర్టు చేస్తుంది. ఎవరైనా సరే - అత్యవసర పరిస్థితులలో 911కి ఫోన్ చేస్తే, అతి త్వరగా వచ్చేస్తారు పోలీసులు.
ఆనంద్ మొహంలో ప్రాణభయం కనబడింది.
తనమీద కంప్లయింట్ ఇస్తుందా సితార?
ఇప్పుడు ఈ పోలీసులు తనని అరెస్టు చేసేస్తారా?
ఇక్కడ - ఈ అమెరికాలో - భార్యలని వేధించడం అంటే అది చాలా చాలా సీరియస్ విషయం!
కాళ్ళు ఒణకడం మొదలెట్టాయి ఆనంద్ కి.
అది గమనించింది సితార.
ఆమెకి కావలసింది అదే!
అతను తనని చూసి భయంతో గజగజలాడిపోతూ వుండడం! తను తిట్టినా, తన్నినా, తగలేసినా కూడా తిరుగు మాట లేకుండా మాట పడిపోయినట్లుగా పడి వుండడం.
