Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 44


    "సారీ డాక్టర్! అటువంటిదేం లేదు."
    "కనీసం జ్యూస్ అయినా తీసుకుంటారా, లేక డ్యూటీలో హానెస్ట్ అంటూ_" సందేహంగా వస్తున్న నవ్వును పెదాల మధ్య బిగపట్టింది డాక్టర్ లత.
    "థాంక్యూ డాక్టర్!" జ్యూస్ తీసుకున్నాడు.
    రవికుమార్ లాకప్ డెత్ కేసులో అతను మానసికంగా గాయపడటం, ఆఫీసర్లు అతన్ని సస్పెండ్ చేయడం అంతా తనకు తెలుసు. కానీ జరిగిన విషయాల గురించి చర్చించి అతనిని బాధపెట్టడం ఇష్టంలేక ఆ ఊసు ఎత్తలేదు డాక్టర్ లత.
    అంతేకాదు. ఏదో విధంగా అతని మనసును మామూలు విషయాల మీదకు మళ్ళిద్దామనుకుంది. కాని అతనిముందు ఆమె ప్రయత్నం విఫలమయింది.
    "వీరేష్! మీరు వచ్చినప్పటినుంచీ గమనిస్తున్నాను. ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉంటున్నారు."
    "సారీ డాక్టర్! నా మనసేమీ బాగోలేదు. దర్యాప్తు అధికారిగా నేను ఓడిపోయాను." అతని స్వరంలో నిరుత్సాహం చోటుచేసుకుంది.
    "ఇన్ స్పెక్టర్ వీరేష్! మీరింకా ఆ కేసుల గురించే ఆలోచిస్తూ మనసు పాడుచేసుకుంటున్నారా? అయినా, మీ సర్వీసులో ఇటువంటివి యెన్నో చూసి వుంటారు. ఇప్పుడు వాటికి అంత ప్రాముఖ్యాన్నివ్వడం అనవసరమేమో! కేసులలో సాక్ష్యాధారాలు ఉంటే శ్రమకు ఫలితం ఉంటుంది. కాని సాక్షులెవరూ ముందుకు రానప్పుడు, తగిన ఆధారాలు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు?" అంది సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తూ.
    "సారీ డాక్టర్! ఆత్మహత్య పెద్ద నేరం కాకపోవచ్చు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో పొడిచి చంపితే అది హత్య అవుతుంది. అతను హంతకుడవుతాడు. సురేఖ, గౌతమి, కళ్యాణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తులను ఏమనాలి?"
    "న్యాయశాస్త్రం అటువంటి చావులకు వేరే నిర్వచనం ఇస్తే ఇవ్వవచ్చు కాని, నా దృష్టిలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో పొడిచి చంపడం కంటే, పరోక్షంగా ఏ వ్యక్తి అయితే మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతాడో అతడే అసలైన నేరస్థుడు. కనిపించిన హంతకుడికుంటే కనిపించని ఈ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కి ఏ శిక్ష విధించినా చాలదు. అటువంటి వ్యక్తులను చట్టంలోని కొన్ని లోపాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అలా అవి అటువంటివారిని ఊరికే వదిలేస్తే ఇంకెందరి జీవితాలతో ఆటలాడతారో ఆలోచించండి?"
    "అలా అయితే ప్రస్తుత చట్టాలు ఎప్పటికీ మిమ్మల్ని మెప్పించలేవు. మీరన్నట్టు ఆత్మహత్యకు ప్రేరేపించడాన్ని హత్యానేరం కంటే హీనమైన నేరంగా పరిగణించాలంటే మన చట్టంలో మార్పు తేవలసిందే. అప్పటివరకు మీరు ఈ కేసులలో న్యాయం జరగడంలేదని ఆవేశపడడం వలన ఉపయోగం లేదు."
    "ఎస్ డాక్టర్! ప్రస్తుత చట్టాలలో మార్పు రానంతవరకు నేరస్థుడు తెలివిగా తప్పించుకుంటూనే ఉంటాడు. అందుకనే నేను వేరే మార్గాన్ని యెన్నుకున్నాను."
    "వీరేష్! మీరు ఆవేశపడుతున్నారు. మీరొక పోలీసు ఆఫీసరని మరచిపోవద్దు. పోలీసు ఆఫీసర్లకు ఆవేశంతోపాటు ఆలోచన, దానికి తగ్గట్టు ఓర్పు, సహనం యెంతైనా అవసరమని నేను మీకు గుర్తుచేయనవసరం లేదనుకుంటాను."
    "ఔను డాక్టర్! మీరన్నదానితో నేను నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తాను. కాని ప్రస్తుతం నేను పోలీసు అధికారిని కాదని అటు ప్రభుత్వం, యిటు ప్రజలు నిర్ణయించినప్పుడు నాకు మరో దారి ఏది? అందుకే ఒక పౌరునిగా నేరస్థుల ఆట కట్టిస్తాను." ఇప్పుడతని స్వరంలో స్వీయ వ్యక్తిత్వం ప్రతిధ్వనిస్తున్నది.
    "బై ది బై _ డాక్టర్! నేనొకసారి గౌతమి, కళ్యాణి శవపరీక్షా నివేదికలను చూడవచ్చా?" క్షణం ఆమె జవాబు కోసం ఆగాడు.
    డాక్టర్ లత అప్పటివరకు పోస్టుమార్టం రిపోర్టులను సంబంధిత అధికారులకు పంపలేదు. ఆమె ఆలోచనలో పడింది.
    "సారీ డాక్టర్! ప్రస్తుతం నేను సస్పెన్షన్ లో ఉండవచ్చు. ఒక పోలీసు అధికారిగా అడగటం లేదు. జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతేనే...."
    అతనికి పోస్టుమార్టమ్ రిపోర్టులను చూపడానికి తనకేమీ అభ్యంతరం లేదు కాని అవి చూసి అతను మరింత ఆవేశానికి గురవుతాడేమోననే భయంతో రిపోర్టులను చూపాలా, వద్దా అన్న మీమాంసలో పడింది డాక్టర్ లత.    
    ఇవ్వకపోతే అతను తనను అపార్థం చేసుకోవచ్చు. అతని మనసును మరింత కష్టపెట్టడం జరుగుతుంది. క్షణం ఆలోచించింది డాక్టర్ లత.
    డ్రాయరు సొరుగు లాగి రిపోర్టులను తీసి అతని చేతికిచ్చింది. తనూహించినట్టు వాటిని చదువుతున్న అతనిలో ఏ ఆవేశమూ కలగలేదు.
    "థాంక్యూ డాక్టర్!" చదివిన నివేదికలను తిరిగి ఇచ్చివేస్తూ అన్నాడు వీరేష్.
    తుఫాను రావడానికి ముందు ఉండే వాతావరణంలా అతనిలో కోపాగ్ని ప్రజ్వరిల్లనున్నదా! అందుకేనా అతనిలో ఆ క్షణంలో స్తబ్దత ఏర్పడింది...?


                             *    *    *    *


    బిందుమాధవి కళ్ళకింద నల్లని చారలు ఏర్పడ్డాయి.
    సాహితి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నది. సాహితి గడప దాటనీయకుండా తను ఆంక్షలు విధించడం వల్లనే అసలు ఆమె భవిష్యత్తు అంధకారంలో పడిందేమో?
    అపస్మారక స్థితిలో ఉన్న సాహితిని హాస్పిటల్ లో చేర్పించింది బిందుమాధవి.
    సాహితి ఆత్మహత్యకు ప్రయత్నించిందేమోననే అనుమానంతో మొదట ప్రైవేటు నర్శింగ్ హోమ్ లో చేర్పించడానికి డాక్టరు అభ్యంతరం తెలిపాడు.
    కాని, సాహితి డ్రగ్ ఎడిక్ట్ అని డాక్టరు పరీక్షలో తేలింది.
    సమాజం అన్నివిధాలా కలుషితమైపోయింది. వెర్రి మొర్రి వ్యామోహాలతో బలహీనతలకు లోబడి యువతీ యువకులు నాశనమైపోతున్నారు.
    మనిషికి కావలసిన స్వేచ్చ ఇచ్చినప్పుడు, అది చాలా సందర్భాలలో చెడుకే దారి తీస్తున్నది. మానసిక బలహీనతలతో నేటి యువత చివరకు మత్తు మందులకు బానిసలై పోతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS