రామానుజాచారికి ఆరుగురు ఆడపిల్లలు, ఆరుగురి తరువాత పుట్టిన ఒకే ఒక్క మగపిల్లవాడు, ఒక గయ్యాళి భార్య, అర ఎకరం పొలం, ఒక చిన్న పెంకుటిల్లు, వారసత్వంగా వచ్చిన గుళ్ళో పూజారిగిరీ వున్నాయి. వ్యక్తిగా కూడా ఆయన మంచివాడు. ఆ మంచితనం కూడా నోరు మెదపనంత మంచితనం.
రామానుజాచారికి, మోహనరావుకీ వయస్సులో చాలా తేడావున్నా, రామానుజాచారి అమాయకంగా తనయింటి కష్టాలు మోహనరావుతో చెప్పటం, మోహనరావు ఊరటగా తనకి తోచిన సలహాలు ఇవ్వటం అవసరానికి అయిదో పదో సర్దటం, దానా దీనా వాళ్ళిద్దరి మధ్యా స్నేహం లాంటిది ఏర్పడింది.
"ఏమిటయ్యా మోహనరావు! చేతికి ఈ కట్టు? ఎక్కడైనా జారిపడ్డావా ఏమిటి?" ఆత్రుతగా అడిగాడు రామానుజాచారి.
జరిగిన దుర్ఘటన వివరించాడు మోహనరావు.
"అరెరె! నీకు చాలా కష్టం వచ్చిందే!" బాధపడుతూ అన్నాడు రామానుజాచారి.
"మీరెందుకు వచ్చారు ఆసుపత్రికి?" మోహనరావు అడిగాడు.
ఆయన, ఆయన భార్యా, పెద్ద పిల్లా, కొడుకూ, పెళ్ళి చూపుల నిమిత్తం ప్రయాణమయ్యి వాళ్ళూ చంద్రం వున్న వూరే వెళుతున్నారు. పెళ్ళికొడుకు తాలూకా వాళ్ళు పిల్లని ఇక్కడికి తీసుకువచ్చి చూపించండి అనటంతో ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళికాని పెద్ద కూతురుని తీసుకుని ఆయన ప్రయాణం కావటం జరిగింది.
ఇదే ఆసుపత్రిలో ఆ వూళ్ళో తెలిసిన ఆయన ఆపరేషన్ నిమిత్తం చేరటం వలన, ఆయనని ఒకసారి చూసివెళితే బాగుంటుంది అని, ఉదయం బస్సు దిగి ఇటు వచ్చారు. ఆయనని చూడటం అయింది. రెండు రోజుల క్రితమే ఆపరేషన్ పూర్తయి కులాసాగానే వున్నాడు. ఆయనని చూడటం పూర్తయింది కాబట్టి, వీళ్ళు ఇకవెళ్ళి బస్సు ఎక్కి ప్రయాణం కావటమే.
రామానుజాచారి వివరంగా చెప్పాడు మోహనరావుకి. "ఒకసారి మీ వాళ్ళని కూడా చూసి వెళతాను." అన్నాడు రామానుజాచారి మోహనరావుతో.
మోహనరావుకి అప్పటికప్పుడే మంచి ఆలోచన వచ్చింది. చంద్రాని కొచ్చిన ఆపద వివరించాడు.
"మా వాళ్ళని తరువాత చూడవచ్చు. ఇక్కడ మేమే కాదు అక్కడ చంద్రం పరిస్థితి కూడా చాలా ప్రమాదంగా వుంది. మీరు ఎలాగూ వెళ్ళేది ఆ వూరే. మీరు బస్సులో బయలుదేరితే నెమ్మదిగా చేరతారు ఆ వూరు. టాక్సీకి, పై ఖర్చులకి అన్నింటికీ నేను డబ్బు ఇస్తాను. మీ యిష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోండి. వివరంగా రాసిన అడ్రస్ కాగితం ఇస్తాను. మీరు ముందుగా చంద్రం దగ్గరకి వెళ్ళి వాడిని రక్షించండి. ఆ తరువాత క్షేమంగా మీ పని పూర్తి చేసుకోండి. ఈ ఒక్క సహాయం చెయ్యండి రామానుజాచారి గారూ!" అంటూ రామానుజాచారి రెండు చేతులూ పట్టుకున్నాడు మోహనరావు.
"ఎంతమాట! ఎంతమాట! మీరింత ఆపదలోవుంటే నేను డబ్బును చూస్తానుటయ్యా! మేము ముందుగా చంద్రం దగ్గరకే వెళ్ళి ఆ తరువాతనే మా అమ్మాయి పెళ్ళి సంగతి చూస్తాను." మొహమాటంగా అన్నాడు రామానుజాచారి.
"ఆలశ్యం చెయ్యటానికి ఇది సమయంకాదు. మీ మంచితనం నాకు తెలియంది కాదు. ఈ ఐదు వందలూ వుంచండి. వీలయినంత తొందరగా టాక్సీ మాట్లాడుకుని వెళ్ళండి." అని చెప్పి మోహనరావు జేబులో నుంచీ ఐదువందలూ తీసి రామానుజాచారి చేతిలో పెట్టాడు.
రామానుజాచారి మొహమాట పడుతూనే, మోహనరావు ఇచ్చిన ఐదు వందలూ తీసుకుని, జేబులో పెట్టుకున్నాడు.
"మీరు సమయానికి దైవంలాగా నాకు కనపడ్డారు. క్షణం ఆలస్యం చెయ్యకుండా బయలుదేరండి." బెంచీ మీంచి లేస్తూ అన్నాడు మోహనరావు.
"ఇది కూడా ఒక సహాయమేరా! ఆ శ్రీరామ చంద్రుడు ఆ పసివాడిని రక్షిస్తే అంతే చాలు." అంటూ చంద్రం అడ్రస్ తీసుకుని మోహనరావు వద్ద శెలవు తీసుకుని అప్పటికప్పుడే అక్కడినుండి వెళ్ళిపోయాడు రామానుజాచారి.
"రామానుజాచారీ! నా మొర ఆలకించి ఆ భగవంతుడే నిన్ను నాకు కనపడేటట్లు చేశాడు. భగవంతుడా! చంద్రాన్ని రక్షించు." అనుకున్నాడు మోహనరావు.
