Previous Page Next Page 
మంచివాడు పేజి 45

గంట స్తంభం మీద గడియారం ఒకే గంట కొట్టింది. ఆరున్నర అయింది ఆవిడ ఇంకా రాలేదే! రాజుకు తను ఎక్కవలసిన బస్ కన్పించింది. బస్ వచ్చి ఆగింది. ఎక్కాలా వద్దా అని అనే మీమాంసలో పడ్డాడు.
బస్ ఎక్కి వెళ్లిపోతే? ఈ పిల్ల రోడ్డు మీదకు పరిగెత్తి దేనికిందో పడితే?
బస్ ఆగడం, వెళ్ళిపోవడం కూడా జరిగింది. రాజుకు చిరాకు ఎక్కువైంది. మరో పది నిముషాలు గడిచాయి.
ఇరవై గజాల దూరంలో వున్న కొట్టు నుంచి పాలు తేవడానికి ఇంతసేపా? అది - ఆ పిల్లతల్లి - ఆ ఆడది తనను మోసం చెయ్యలేదు కదా?
రాజుకు ముచ్చెమటలు పట్టాయి.
ఏమిటీ దారుణం! ఆ పిల్లను వదిలేసి వెళ్ళిపోయిందా! మాతృత్వం సాకారం అయిందా అన్నట్టున్న ఆ స్త్రీ ఇంత దారుణానికి ఒడి కట్టిందా! కన్న బిడ్డనే ఇలా వదిలేస్తుందా?
ఏం ఎందుకు కాకూడదూ! మోయలేని బరువును దించేయడం తప్పా? పాపం! వదిలెయ్యక ఏం చేస్తుంది! మోయలేక వదిలేసిన బరువును ఎవరు నెత్తికి ఎత్తుకుంటారు!
తను ఎవరి స్థితి చూసి జాలి చూపాడో ఆమే తనను మోసం చేసింది. తనకెందు కొచ్చిన న్యూసెన్సు!
రాజు రెండు అడుగులు ముందుకు వేశాడు.
"మామయ్యా?" బొంగురు గొంతు ఏడ్పు.
రాజు యాంత్రికంగా ఆగిపోయాడు.
"ఏం చెయ్యడం? పసి బిడ్డను వదిలేసి ఎలా వెళ్ళిపోవడం?
ఇంటికి తీసుకెళ్తే.
తనకు ఈ పిల్ల పెద్ద బరువు కాదు. తనకు ఇద్దరే పిల్లలు.
కాని ... దీని కులం ఏమిటి? కన్నబిడ్డనే వదిలేసిన దీని తల్లి ఎలాంటిదో. తన భార్య అంగీకరిస్తుందా?
తను ఈ పిల్లను తన బిడ్డలతో పాటు పెంచడానికి ఇష్టపడుతుందా? అసంభవం!
ఈ అమాయక ప్రాణి తన మనసులోని భావాలను అర్థం చేసుకున్నట్టు ఏడ్పు మానేసి బిక్కు బిక్కు మంటూ తన ముఖంలోకి చూస్తుంది.
రాజు చేతిలో వున్న బిస్కెట్ల పొట్లం విప్పి రెండు ఆ  పిల్ల చేతిలో పెట్టాడు. ఆ పిల్ల బిస్కెట్లు గబగబా తింటూ వుంది. మరో రెండు ఇచ్చాడు.
రాజు కళ్ళు పిట్టగోడ మీద కూర్చుని బీడీ పొగ వదులుతున్న గఫూర్ మీద పడ్డాయి. చటుక్కున ఓ ఆలోచన తట్టింది.
పిల్లను తీసుకొని గఫూర్ కు దగ్గరలో గోడ పక్కగా నిల్చున్నాడు.
"ఇదుగో భాయ్! సిగరెట్టు ప్యాకెట్ అయిపోయింది. తెచ్చుకుంటా. అందాకా ఈ పిల్లను చూసుకుంటావా?" అన్నాడు రాజు ఎదురుగా కన్పిస్తున్న సైకిల్ షాపుకేసి చూస్తూ.
గఫూర్ తల ఎత్తకుండానే బీడీ దమ్ములాగి పొగ వదుల్తూ "ఊ" అన్నాడు.
పిల్ల బిస్కెట్లు తింటూ వుంది.
రాజు ఎవరో తరుముతున్నట్టు వడివడిగా వెళ్ళిపోయాడు. మరో రెండు బిస్కెట్లు పిల్ల చేతిలో వుంచి.
ఎవరో లుంగీ పట్టి లాగినట్టు అయి గఫూర్ కిందకు చూశాడు. పిల్ల లుంగీ పట్టుకు లాగుతూ గఫూర్ చూడగానే చటుక్కున వదిలేసి ఏడుపు ప్రారంభించింది.
అంతవరకూ ఈ పిల్ల విషయమే మర్చిపోయి ఆలోచిస్తూ కూర్చుని వున్న గఫూర్ కు చటుక్కున ఏదో తోచి చేతి గడియారం కేసి చూసుకున్నాడు.
అరే ఏడున్నర అవుతూ వుందే! మరి ఆ పెద్ద మనిషి ఏడీ? ఈ పిల్ల అతని కూతురా? నమ్మటానికి వీల్లేదు.
ఇందులో ఏదో మోసం వుంది.
అనేక మోసాలు చేసిన తనకే మోసం జరిగింది. పిల్లని తేరిపార చూశాడు గఫూర్.
కనీసం మంచి దుస్తులు గానీ చిన్నమెత్తు బంగారం గానీ ఆ శరీరం మీద కన్పించలేదు. మురికి ఓడుతున్న దుస్తుల్లో వున్న ఆ పిల్ల రూపం ఇక సరే సరి! అమ్మినా ఎవడూ కొనడు.
థూత్! తనకెందుకీ గొడవ ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS