వాత్సల్యం
మండుతున్న జ్యోతి మీద మూకుడు బోర్లించి ఆకాశంలో వెలుగు ఆరిపోతున్నది.
చౌరాస్తాలోని మునిసిపాలిటీ గడియారం నగరం గుండెల మీద ఆరు దెబ్బలు కొట్టింది.
బస్ స్టాప్ లో నిల్చుని రోడ్డుమీది రద్దీని చూస్తూ నిలబడ్డ రాజు ఉలిక్కిపడ్డాడు.
ఆరు అయిపోయింది.
బస్ ఇంకా రాలేదు.
అసలే చిరాకుగా నిల్చుని వున్న రాజుకు పక్కనే కీచుగొంతు ఏడుపు కోపం వచ్చింది.
విసుగ్గా పిల్లకేసి చూశాడు.
ఆ పిల్లకు ఐదేళ్ళుంటాయో లేక మూడేనో చెప్పడం కష్టమే. పెద్ద పొట్టా, పులల్లాంటి కాళ్ళూ చేతులూ నల్లటి రంగూ ...
పసిపాపకు సహజమైన పాల బుగ్గలు లేవు. బోసి నవ్వులూ లేవు. ముక్కు నుంచి కారుతున్న చీమిడి మధ్య మధ్య ఎగబీలుస్తూ వుంది.
ఆ పక్కనే వున్న నిండు చూలాలిని చూసి, తల్లికాబోలు అనుకున్నాడు.
ఆమె ఆ పిల్ల నెత్తిమీద "పెటీ పెటీ" మని మొట్టికాయలు వేసింది సణుక్కుంటూ. పిల్ల ఏడుపు తారా స్థాయిని అందుకుంది.
రాజు ఆమెను పరిశీలనగా చూశాడు.
ఎముకల్లో మూలుగు సన్నగిల్లి, రక్తంలో జీవం చచ్చి, కళ్ళల్లో కాంతి మందగించినా, ఆమె ఇంకా మరో ప్రాణికి తనలో జీవంపోస్తూ వుంది. కాలం గీచిన ఆమె నొసటిమీది గీతాలూ, చీకట్లు ముసురుకుంటున్నట్టున్న ఆ కళ్ళూ, ఎముకలు కన్పిస్తున్న కాళ్ళూ చేతులూ తమ తమ గాథల్ని విన్పిస్తున్నాయి.
బస్ కోసం వేచి వుండటమే ఒక చిరాకు. పైగా పిల్ల కీచు గొంతు రొద ఒకటి చెవుల్లో! ఓదార్చడం పోయి పిల్లను బాదుతూ వుంది ఆ తల్లి.
"ఇదుగో! ఏమమ్మోయ్! బిడ్డను అలా కొట్టి ఏడిపించకపోతే పాలిచ్చి సముదాయించ కూడదూ?" రాజు మాటలు గొంతులో ఉంగిడి చుట్టుకు పోయాయి ఆ చూలాలిని చూస్తుంటే.
"పాలా?" అంటూ ఆమె తన పొట్టకేసి చూసుకుంది.
ఆ చూపుల్లో వుంది సిగ్గో, అసహ్యమో, జాలో, మాతృత్వమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు రాజు.
"పాలైతే ఆ కొట్లో వున్నాయి. పైసలే లేవు." చిన్నగా వణుకుతున్న గొంతుతో అన్నది ఆ చూలాలు.
రాజు పావలా తీసి విసురుగా ఆమె చేతిలో వేశాడు.
"ఈ పిల్లను కూడ మోసుకెళ్ళలేను. ఈ పక్క కొట్టు నుంచే పాలు తెచ్చేవరకూ కొంచెం చూస్తారా?" దీనంగా అడిగింది.
"అవును! పాపం! నిన్ను నువ్వే మోసుకో లేకుండా వున్నావు. ఇంకా పిల్లను కూడా ఎక్కడ మోస్తావ్?" మనసులోనే అనుకున్నాడు. పైకి అంగీకార సూచకంగా తల ఊపాడు.
సంచిలోని గిన్నె చేతిలోకి తీసుకొని డబుల్ డెక్కర్ బస్ లా భారంగా మెల్లగా కదిలింది.
"త్వరగా రా!" రాజు వెనకనుంచి అన్నాడు.
ఆమె విన్నదో లేదో కాని తిరిగి చూడలేదు.
"పోషించలేని వాళ్ళకు పిల్లలెందుకో? బుద్ధిలేకపోతే సరి!" నిండుగా బరువుగా మెల్లగా తిరిగి చూడకుండా వెళ్తున్న ఆమెను చూసి విసుక్కున్నాడు రాజు.
ఆలోచనా స్రవంతిలో పడి కొట్టుకుపోతున్న రాజుకు పేవ్ మెంటు మీద నుంచి ఏడుస్తూ రోడ్డుకేసి నడుస్తున్న పిల్ల కన్పించింది. చటుక్కున ముందుకెళ్ళి పిల్ల రెక్క పట్టుకొని తీసుకొచ్చి పేవ్ మెంటు మీద నిలబెట్టాడు. పిల్ల ఏడుపు పెద్దది చేసింది. ఆ పిల్ల ఏడ్పు ఎలా మాన్పించాలో తెలియక తికమక పడ్డాడు రాజు.
