Previous Page
మంచివాడు పేజి 46

గఫూర్ రెండడుగులు ముందుకు వేశాడు.
 ఎవరో లుంగీ పట్టి లాగినట్టయింది. ఏడుస్తూనే ఒకసారి గఫూర్ ముఖంలోకి చూసి గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ పిల్ల.
గఫూర్ జాలిగా ఆ పిల్లకేసి చూశాడు. ఆ పిల్లను ఎత్తుకొని ఓదార్చాలనిపించింది.
ఇదేమిటి? ఎప్పుడూ ఎవరి మీదా కలగని జాలి ఈ బిడ్డ మీద ఎందుకు ?
తీసుకెళ్ళి పెంచుకుంటే ?
కాఫిరు బిడ్డను సాకటమా ?
గఫూరు మనసులోనే అల్లాను తల్చుకుంటూ చెంపలు వాయించుకున్నాడు.
కాని ఎలా ఈ బిడ్డను వదిలేసి వెళ్ళడం?
ఎంత భయపడుతూ తన లుంగీ పట్టుకుందో పాపం !
గఫూరు అటూ ఇటూ చూశాడు.
మోకాళ్ళ పైకి అంగవస్త్రం కట్టుకొని, షర్టు లేకుండా, చేతిలో పంచాంగం వగైరాలతో వస్తున్న శాస్త్రుల వారు కన్పించారు.
గఫూరు మనసులో ఆలోచన తళుక్కుమంది.
ఆ శాస్త్రుల వారికి తగిలిస్తే సరి!
"ఏమండోయ్ శాస్త్రులు ?"
శాస్త్రి ఉలిక్కిపడ్డాడు.
"దూరం? దూరం?" అంటూ దగ్గిరగా వస్తున్న గఫూర్ కు దూరంగా వెనక్కు అడుగు వేశాడు శాస్త్రి.
"ఎహే! భయపడకు. నిన్ను ముట్టుకోనులే. కాస్తంత ఈ పిల్లను చూడు. ఆ పక్కకెళ్ళి ఓ క్షణంలో కాలు మడుచుకొస్తా?" అని శాస్త్రి సమాధానానికి కూడా ఎదురుచూడకుండా "చూడమ్మా? తాత! ఇప్పుడే వస్తా!" అంటూ పిల్ల గుప్పెట్లో నుంచి లుంగీ వదిలించుకొని గబగబా వెళ్ళిపోయాడు గఫూర్.
తాతలంటే వుండే సర్దా పిల్లలకు మరెవరన్నా వుండదు.
శాస్త్రి మోకాళ్ళ పైకి వున్న ధోవతిని పట్టి లాగుతూ "తాత! తాత!" అంటూ బోసి నోటితో నవ్వింది.
శాస్త్రికి వళ్ళు జలదరించింది. ఏదో పురుగు వంటిమీద పాకుతున్నట్టు అనిపించింది.
"రామ! రామ!" వెనక్కు జరిగాడు.
 ఆ పిల్ల ముందుకు జరిగింది.
"తాత! తాత." మళ్ళీ అన్నది.
"హరి హరీ! ఈ తురక పిల్లకు నేను తాతనా? లబలబ లాడిపోయాడు శాస్త్రి.
ఎంతకు గఫూర్ రాలేదు. ఆ పిల్ల శాస్త్రిని వదలడం లేదు.
వాడు ఇంకా రాలేదేం!
మోసం చెయ్యలేదు కదా? అవును! అంతే జరిగి వుండాలి. లేకపోతే ఇంతసేపు ఎందుకు రాడూ?
శాస్త్రి అశాంతిగా అటూ ఇటూ చూశాడు.
ఈ పీడ వదిలించుకోవడం ఎలా?
నవగ్రహ శాంతి చేయించి వస్తున్న శాస్త్రులవారు పెద్ద అశాంతిలోనే పడ్డారు.
రాజు ఇంటి గడపలో కాలు పెడ్తూనే దేనికోసమో మారాం పెడుతున్న చిన్న ఏడుపు వినిపించింది రాజుకు.
రాజుకు ఆ ఏడుపును మింగేస్తూ బొంగురు గొంతు నుంచి వచ్చే ఏడుపూ "మామయ్యా!" అనే పిలుపూ వినిపించాయి. స్మృతి పథంలో ఆ పిల్ల ఏడుస్తూ రోడ్డుకు అడ్డం పడి నడుస్తున్నట్టు కన్పించింది.
గిర్రున వెనక్కు తిరిగాడు.
ఆ బిడ్డను ఆ రౌడీ ఏం చేశాడో? ఆ బిడ్డ దేనికిందయినా పడిపోయిందో. ఏడ్చి ఏడ్చి శోషవచ్చి పేవ్ మెంటుమీదే పడిపోయిందో? తను ఎంత నీచంగా ప్రవర్తించాడు?
ఆ పక్కగా పోతున్న ఆటో ఆపి ఎక్కాడు.
చౌరాస్తా దగ్గిరకు వస్తున్న రాజుకు మరో రోడ్డునుంచి పరుగు పరుగున వస్తున్న రౌడీ గఫూర్ కన్పించాడు!
వీడు తను అనుకున్నంతా చేశాడు.
బస్ స్టాండ్ లో జనం మూగివున్నారు.
అటునుంచి రాజూ, ఇటునుంచి గఫూర్ "పాపా!" అంటూ జనాన్ని తోసుకుంటూ వచ్చి అక్కడి దృశ్యం చూసి నిలబడిపోయారు.
పాప శాస్త్రులవారి కాళ్ళకు చుట్టుకొని వదలడం లేదు.
జనం తలొక మాటా అంటున్నారు.
"ఈ పిల్లకు నేను తాతను కాను బాబోయ్!" అంటూ లబలబలాడుతున్న శాస్త్రులవారి మాటను ఎవరూ వినిపించుకోవడం లేదు.
చుట్టూ మూగిన జనానికి నచ్చచెప్పడానికి తాతకు తాతలు దిగి వస్తున్నారు.
 రాజును చూసి ఆ పిల్ల "మామయ్యా!" అంటూ దగ్గిరకు వచ్చింది.
పక్కనే నిల్చున్న గఫూరును చూసి భయంతో కళ్ళు మూసుకుంది.
రాజూ, గఫూరు పిల్లను తాను తీసుకెళ్తానంటే, తను తీసుకెళ్తానని పోటీ పడటాన్ని జనం వింతగా చూస్తున్నారు.
లేగదూడ కోసం "అంబా" అంటూ రంకెలు వేస్తూ వచ్చిన ఆవులా, చిట్టీ అంటూ వచ్చింది ఓ నిండు చూలాలు.
వాత్సల్యం కట్టలు తెంచుకుంది.
తల్లీ బిడ్డా పెనవేసుకు పోయారు.
ఆ స్త్రీ రాజుకేసి చూడటానికి సిగ్గుపడింది.
జేబులో నుంచి పది రూపాయల నోటు తీసి పిల్లకు అందించాడు రాజు.
ఒక రూపాయి నోటూ, కొంత చిల్లరా తీసి పిల్ల చేతిలో పెట్టాడు గఫూరు.
శాంతి చేయిస్తే వచ్చిన సంభావన డబ్బులు బిడ్డ చేతిలో వుంచి కన్నీళ్ళతో కదిలిపోయాడు శాస్త్రి.
                                                 * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS