Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 44


    ఫోనులో నవ్వు వినపడింది.


    పళ్ళు నూరుతూ మౌనంగ వుండిపోయాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    "నీకు చెప్పారా?"


    "ఎవరు? ఏంటి? చెప్పారా? అడిగారా! అంటే ఎలా తెలుస్తుంది? సరీగ మాట్లాడు లేకపోతే ఫోను పెట్టేయ్. మొండిగ మాట్లాడావంటే నేనే. ఫోను దించేస్తాను."


    "ఫోను దించితే ఎవరికి నష్టం?'


    "నీకే నష్టం. పోలీసువాడికి కష్టము వుండదు. మైండిట్!" ఫోనులో మరోసారి చాలా కఠినంగ మాట్లాడి వెంటనే మౌత్ పీస్ కి చేయి అడ్డంపెట్టి "బాస్ గాడు మాట్లాడుతున్నాడు" అని గుసగుసగ అహోబిలంతో చెప్పి మళ్ళీ మౌత్ పీస్ కి చేయి అడ్డం తొలగించాడు వర్ధనరావు.


    "జాగ్రత్తగా మాట్లాడండి" చెవి దగ్గర గుసగుసలాడాడు అహోబిలం.


    "జాగ్రత్తగా మాట్లాడాలన్నది నాకు తెలియదా?" గట్టిగ కేకలేశాడు వర్ధనరావు.


    "ఎవరిమీద ఎగిరిపడుతున్నారు?" అవతలనుంచి బాస్ నవ్వుతూ అడిగాడు.


    "ఈ స్టేషన్ కి ఇన్ స్పెక్టర్ ని నేనా! నీవా!"


    "నీవే యీ విషయంలో ఎందుకు అనుమానం వచ్చింది మహాశయా!"


    "మళ్ళీ ఏకవచన సంబోధన..." అని పళ్ళు నూరుకుని "ఫోను పెట్టేస్తున్నాను." అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    అవతల బాసు నవ్వాడేమో తెలియదు. శబ్దంమాత్రం వినిపించలేదు. "కోటీ యాభై లక్షల విలువైన వజ్రాలు" ముక్తసరిగ చెప్పి ఊరుకున్నాడు.


    "ఊ...ఊ... సాంతం చెప్పు. తడితడిగుడ్డలు పొడిపొడి మాటలు అంటే నాకు వళ్ళుమంట"


    "నాదగ్గర వున్న బందీలని నీవు పట్టుకున్నావు. వాళ్ళకి కోటీ యాభై లక్షల సంగతి తెలుసని వాళ్ళు ఉత్త దొంగ పీనుగలని అన్నం నీళ్ళు లేకుండా ఎండబెడితే ఆ వజ్రాలని వాళ్ళెక్కడ దాచింది చెపుతారని ఇప్పటికి మూడుసార్లు ఫోనుచేసి చెప్పాను. వాళ్ళని ఎండబెట్టావా? వాళ్ళా రహస్యం చెప్పారా! అది తెలుసుకోటానికే ఫోను చేశాను మిష్టర్ వర్ధనరావ్!" అవతలనుంచి బాస్ అడిగాడు.


    "వాళ్ళిద్దరినీ విడిచిపెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాయం అయ్యారు" అని చెప్పాలని వర్ధనరావు నోటిచివరిదాక వచ్చింది. ఎంతైన పోలీసు బుర్ర అలా చెప్పటం ప్రమాదం అని గ్రహించినవాడై వెంటనే తన తెలివినంతా ఉపయోగిస్తూ "వాళ్ళిద్దరిని ఆకలిదప్పులతో మలమల మాడ్చాను. ముక్కమ్మట నీళ్ళు నోటమ్మట రక్తము పడేలా చావచితక కొట్టాను. దాంతో వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి. వెంటనే చెప్పేశాను." అని గంభీర్యంగ ఫోనులో బాస్ కి చెప్పాడు.


    "ఏమని?" అవతలనుంచి బాస్ ఆతృతగ అడిగాడు.


    "కోటి యాభై లక్షల వజ్రాలు..."


    "కోటీ యాభయ్ లక్షలు నీదగ్గరే వున్నాయని నీవు నాటకం ఆడుతున్నావని...పుండాకోర్ వెధవ్వని...మాధర్ చేద్ నా కొడుకువని... నిన్ను పట్టుకుంటే వజ్రాలు దొరుకుతాయని చెప్పారు..."


    "అన్యాయం అబద్ధం" అవతలనుంచి బాసు అరిచాడు.


    "అలా కర్ణభేరి బద్దలయ్యేలా అరవకు. ఆ తర్వాత నీవు చెప్పేదేది నాకు వినిపించదు. నీమాట వినే అవసరం వుండదు. సావదానంగ మాట్లాడు. ఏది అన్యాయం? ఏది అబద్ధం?"


    "వాళ్ళిద్దరూ కూడబలుక్కుని అబద్ధాలు ఆడుతున్నారు. మరి నాలుగు తగిలించండి."


    "వాయగొట్టు తగిలించు అని పోలీసువారికి ఉచితంగ ఎవరూ సలహా యివ్వక్కర లేదు. కాకీ దుస్తులు తగిలించుకోగానే ఆ గుణాలు సహజంగా అబ్బుతాయి. అయినా వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని నీవు నిజం పలుకుతున్నావని సాక్ష్యం ఏంటంట?"


    "కోటి యాభయ్ లక్షల రూపాయల వజ్రాలు నాదగ్గర వున్న మాట నిజమే..."


    "నీ మమ్ము కడుపు కాల...!" వర్ధనరావు గట్టిగా తిట్టాడు.


    "సాంతం నామాట వినకుండానే తిట్టకు. తిట్టినతిట్టు తిట్టకుండ తిట్టటంలో నేను ఎక్స్ పర్ట్ ని. నేను చెప్పేది జాగ్రత్తగా విను... కోరి యాభై లక్షల రూపాయల విలువవేసే వజ్రాలు నా దగ్గరే వుండేవి. తర్వాత వాళ్ళు నా దగ్గరనుంచి కొట్టేశారు. వాళ్ళని నేను ఉపాయంగ పట్టుకుని బంధించి అసలు విషయం తెలుసుకునే వేళ, నీవు మా స్థావరంపై రైడ్ చేయటం...నేను పారిపోవటం...వాళ్ళు నీకు పట్టుబడటం... జరిగింది. ఆ వజ్రాలు ఎలాగూ నాకు దక్కవు. నీకయినా దక్కితే ప్రభుత్వానికి అప్పగిస్తావని...నీకు ఇంకో ప్రమోషన్ వస్తుందని చెప్పాను. నాకు దక్కని నిథి వాళ్ళకెందుకు దక్కాలి? ఆ కసితో చెపుతున్నాను. వాళ్ళ నోట్లోంచి నిజం కక్కించి మొనగాడిననిపించుకుంటావో కక్కించలేక వాజమ్మవి అవుతావో నీ ఇష్టం." అంతవరకే చెప్పి అవతల ఫోన్ పెట్టేశాడు బాస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS