రోజు రోజంతా చాలా చికాకుగానే గడిపేసింది.
"భారతి మంచి పిల్లే కాని కాస్తంత దుడుకు స్వభావం" అనుకొంది అవంతి.
సాయంత్రం మనోహర్ హాస్టల్ కి వచ్చాడు.
అవంతి అతనికి చెప్పింది.
అతను నవ్వేశాడు.
"నువ్వా విషయం మర్చిపో" అన్నాడు.
"అంటే?"
"భారతికొచ్చిన భయం ఏమీలేదని హామీ ఇస్తున్నాను."
"నువ్వలాగే అంటావు. అదేమో నా మీదనుండి పోతోంది. దానికి నువ్వంటే అస్సలిష్టంలేదు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా?" అంది.
"ఏమనిపిస్తోంది?"
"వెనకటికెవడో వెంట రావద్దంటే ఎత్తుకోమని ఏడ్చాడట అలా వుంది" అవంతి మాటలకు అతను మెల్లగా నవ్వాడు.
"అవును మనోహర్ అదంత ఈసడించుకొంటుంటే వెంటబడ్డానికి సిగ్గేయడం లేదు" అంది.
అవంతి మాటలకి మనోహర్ మల్లగా సమాధానం చెప్పాడు.
"ప్రేమంటే తెలీని మనిషినని ఆ రోజు నన్ను సవాల్ చేశావు గుర్తుందా?"
"ఆ......"
"ఆ ప్రేమంటే నాకు సరైన నిర్వచనం తెలుసన్న సంగతిని నీలాంటి వాళ్ళకి చాటి చెప్పడానికే నేను భారతిని ప్రేమిస్తున్నాను."
"నీది వన్ వే ట్రాఫిక్ ప్రేమ" అంది అవంతి.
"అఫ్ కోర్స్! ఇప్పటి వరకు నువ్వనేదే కరెక్ట్. నా గతం తెలిసిన ఏ ఆడదీ నన్ను నమ్మలేదు కానీ నేను మారిన మనిషిని. కేవలం నేను తనకోసమే మారానని భారతి తెలుసుకున్ననాడు గెలుపునాదే" అన్నాడు మనోహర్.
"ఏమో బాబూ అసలు మీ మధ్యకి నేనెందుకొచ్చానా అని బాధపడుతున్నాను. ఓ పక్కన పరీక్షలొచ్చినాయి."
"అందుకే అన్ని విషయాలనీ వదిలేసి బుద్ధిగా చదువుకో!" అన్నాడు.
"ఓ.కె." అంది.
"ఓ.కె. అంటే ఏమిటో తెలుసా?"
"ఓ.కె. అంటే ఓ.కె.నే!"
"కాదు. ఓ అంటే 'వన్' కె అంటే 'కిస్' టోటల్ గా వన్ కిస్ అన్నమాట" నవ్వుతూ చెప్పాడు మనోహర్.
అవంతి చెక్కిళ్ళు ఎర్రబడినాయి ఆ మాటలకి.
"నే వెళతాను హాల్ టికెట్ కూడా వచ్చేసింది కనక జాగ్రత్తగా చదివి పాస్ కావడం నీవంతు. ఆ పై సంగతి నాకొదిలెయ్" అన్నాడు లేచి నించుంటూ మనోహర్.
"ఓ.కె." అని నాలిక కరుచుకొంది అవంతి.
అది చూసి చిలిపిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మనోహర్.
అవంతికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.
పరీక్షలు పూర్తయినాయి. స్నేహితురాళ్ళు బాగానే రాశారు. పరీక్ష ఖచ్చితంగా పాస్ అవుతామని రూఢిగా చెప్పుకోగలిగారు.
ఇంతకాలం ఒకింట్లో ఓ తల్లి కడుపున పుట్టిన అక్క, చెల్లెల్లా మసిలారు. ఒకళ్ళని విడిచి ఒకరు వెళ్ళిపోవాలంటే చాలా దిగాలుగానూ, బాధగానూ వుంది.
ఒకరికేసి ఒకరు నిర్లిప్తంగా చూసుకుంటున్నారే తప్ప నోరువిప్పి మాట్లాడుకోవాలంటే గొంతు పూడుకుపోతోంది.
ఆ రోజే హాస్టల్ ఖాళీ చెయ్యాలి. ఇంకా కొన్ని గంటలు వ్యవధి మాత్రమే వుంది.
మళ్ళీ జీవితంలో తిరిగి ఆ నలుగురు ఒక్కసారిగా కలుసుకునే అవకాశం ఉందో లేదో తీలీదు.
తలా ఓ దిక్కుకి ఎవరో బలవంతంగా విసిరి కొడుతున్నట్టుగా వుంది వాళ్ళకి.
రమణి దీనంగా తలెత్తి......
"అక్కా!" అని పిలిచింది అవంతిని.
అవంతికి కళ్ళనీళ్ళ పర్యంతంగా వుంది. రమణి తలపైన ఆప్యాయంగా చేత్తో నిమిరింది.
"ఏదో ఒకరోజు మనం ఇలా విడిపోవాల్సివస్తుందని మనకి తెలుసు. ఇప్పుడా రోజు రానే వచ్చింది. ఇది మన గుండెల్ని పిండేస్తున్నా తప్పనిసరిగా మనింటికి పోక ఎన్నో కష్టాల్ని బాధల్ని ఎదుర్కొంటూ, ప్రతిక్షణం చచ్చిపోతున్న మనసుకి తిరిగి ఊపిరిని పోస్తూ మనం గడిపిన క్షణాలన్నీ మీకు గుర్తుండే ఉండాలి. మనం ఎందుకోసం, ఏం చేశామన్నది మనలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అదంతా ఓ పీడకలగా మరిచిపోండి. భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ మనం విడిపోతున్న ఈ క్షణాన్ని మీకు గుర్తుచేస్తుందొక్కటే. ఓటి పడవలో ప్రయాణంచేస్తూ మన బతుకుల్ని దృష్టిలో పెట్టుకొని, ఆడదానికి జరుగుతోన్న విశృంఖల అన్యాయాన్ని అరికట్టడానికి ఆవేశంతో మనం కొన్ని నిర్ణయాలు చేసుకున్నాం. ఆ ఆశయాలని ఆచరణలో పెట్టడానికి, ఆ మహా యజ్ఞంలో మన బతుకుల్ని సమిధలుగా అర్పించాలి. పిరికి తనంతో వెనుకంజ వెయ్యమని నాకు మాటివ్వగలరా?" గాద్గద స్వరంతో అవంతి అడుగుతుంటే శ్యామల, కుసుమ, రమణి బావురుమన్నారు.
"నిజమే. నాకూ మీతో కలిసి కరువుతీరా ఏడవాలనే ఉంది. కానీ నేను కూడా ఏడిస్తే మిమ్మల్నెవరు ఓదారుస్తారు చెప్పండి. నాకూ ఆ అవకాశం కూడా లేకుండా చేసేవారు కదూ!" అంది అవంతి పమిట చెరగుతో కళ్ళొత్తుకుంటూ.
"నాలో ఊపిరి వున్నంతవరకు నీమాటల్ని నేను మరచిపోనక్కా" అంది రమణి జీరపోతున్న గొంతుతో.
"మా అక్క బతుకేమయిందో కళ్ళారా చూశాక కూడా ఇంకా ఊబిలో చిక్కుకుంటాననుకోవద్దు. మంచికో చెడుకో అనుకొన్నాం. అంతే జరుగుతుంది!" అంది కుసుమ.
"నేనూ మీ తోటి దాన్నే. ఇంకా చెప్పేదేముంది?" అంది శ్యామల.
అవంతి తృప్తిగా చూసింది వాళ్ళకేసి.
"మీరు నాకు సొంత చెల్లెళ్ళుగా పుట్టి వుంటే నేనెంత గర్వించేదాన్నో తెలుసా? నౌ అయాం వెరీ హాపీ డియర్స్" అంది.
