దెయ్యం పట్టినట్టు వున్నట్టుండి అ కారు రాకెట్ లా దూసుకుపోయింది.
ఇప్పుడు వాళ్ళ మధ్య దూరం తరిగిపోవడంతో రివాల్వర్ తో కాల్పులు మొదలయ్యాయి. బుల్లెట్లన్నీ అయిపోతుండగా కెవ్వున ఆర్తనాదం ప్రతిధ్వనించింది అక్కడ.
అతని చేతిలోని వీడియో కెమేరా వాలీబాల్ లా ఎగిరి రోడ్ మధ్యన పడిపోయింది.
జయచంద్ర, సత్యమోహన్.... వికృతంగా నవ్వూతూ కారుదిగారు.
వాళ్ళ అనుచరులు ఆవ్యక్తిని చుట్టు ముట్టి ఇనుపరాడ్లతో దేహశుద్ధి చేయసాగారు.
బాధతో కూడిన అరుపులు అతని నోటి వెంట వెలువడుతున్నాయి.
వీడియో కెమేరాలోని కేసెట్ ను తీసి రోడ్ మీద పగల కొట్టి దాని టేప్ ను బయటకు లాగి అగ్గిపుల్ల వెలిగించాడు. జయచంద్ర ఆ టేప్ భగభగమని మండే మంటల్లో కాలి బూడిదైపోయింది.
ఆ వీడియో కెమేరాను కూడా ఎందుకూ పనికి రాకుండా గుల్లగుల్లగా చేశాడు సత్యమోహన్.
పైకి లేచి ప్రతిఘటించే ఓపిక లేక అలానే పడివుండిపోయాడు ఆ వ్యక్తి. అతనని కసిగా కత్తులతో పొడిచారు. రక్తం మడుగు క్షణ క్షణానికి పెద్దది అవుతుంది.... అతనిలో అరిచే ఓపిక కూడా నశించి పోయింది.
ఆ గూండాలు ముక్కు దగ్గర వేలుపెట్టి చూశారు.
అప్పటికే అతను తల వేలాడవేశాడు. శ్వాస ఆగిపోయినట్టు అర్ధం కావడంతో అందరూ వెనుదిరిగారు.
క్షణాల మీద జయచంద్ర కారు ఆ ప్రదేశంలో నుంచి అదృశ్యమైపోయింది.
ఇది జరిగిన ఓ ఐదు నిమిషాలకు....
ఏసిపి వీరేష్ ఆత్రుతుగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఒక్క అంగలో కారుదిగి అతని తలను తన ఒడిలోకి తీసుకున్నాడతను. ఆ స్పర్శ ఎవరిదో అర్ధం అయినట్టు అతనిలో కదలిక ఆరంభమయింది. పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్టయ్యాయి కనురెప్పలు బలవంతముగా తెరిచాడు అతను.
ఏదో చెప్పాలని ప్రయత్నించడం అర్ధం అవుతూనే వుంది. కానీ పెదవులు దాటి అతని మాటలు రాలేకపోతున్నాయి.... ఏదో ఆలోచన స్పురించి తన చెవిని అతని పెదవుల దగ్గర వుంచాడు వీరేష్.
"కుషాయిగూడా.... పదో నంబర్... రేకు డబ్బా... కాసెట్..."
అంత వరకే వినిపించాయి....ఆపై అతను తల వాల్చేశాడు.
తన విశ్వాస పాత్రుడు, అంతేకాదు నమ్మిన బంటులా పని చేసిన ఓ సిన్సియర్, కానిస్టేబుల్ తన వడిలో చలన రహితంగా వున్నాడు.
అతను పూర్తిచేయకుండా మిగిలిపోయిన కార్యాన్ని తను చేపెట్టే వుద్దేశంతో కారువైపు నడిచాడు వీరేష్.
అతని కారు ఇప్పుడు కుషాయి కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ వైపు శరవేగంతో దూసుకుపోతుంది.
* * * *
"భౌ... భౌ..."
ఉన్నట్టుండి ఆల్సేషియన్ మొరిగింది.
"కౌన్ హై..." గూర్ఖా కదిలాడు.
కాంపౌండ్ లో ఎవరూ కనిపించక పోవడంతో గూర్ఖా యధా ప్రకారం మెయిన్ గెట్ దగ్గరకు వెళ్ళిపోయాడు.
అయినా అల్సేషియన్ మొరగడం ఆపలేదు.
రజని ఉలిక్కిపడి లేచింది.
ఆమె గదిలో చీకటి పరుచుకుని వుంది. అప్పుడే బాల్కనీలో ఏదో ఆకారం కదిలినట్టు అనిపించడంతో దిగ్గున లేచి కూర్చుంది. తడబడుతున్న అడుగులతో వచ్చి ఆమె గది తలుపులకు తట్టడంతో ఉలికి పడుతూ బయటలైటు వేసింది.
అయినా తలుపులను తడుతూనే వున్నారెవరో....ఒక నిమిషం ఆగి తలుపు తెరిచింది. మరుక్షణం రవితేజ లోనికి వచ్చి చట్టుక్కున తలుపుని మూసివేశాడు.
ఎదురు చూస్తున్న మనోవల్లభుడు ఎదుట పడడంతో అతనిని చుట్టుకుపోయింది.
"ఎస్. ఐ. శక్తి వెంట పడ్డాడు. ఎలాగో తప్పించుకు వచ్చాను. మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు రజనీ..."
"రవీ... ఫోలీసుల కళ్ళుగప్పి యిలా ఎంతకాలం తిరుగుతావు"
"తప్పదు రజనీ... ఏ నిమిషంలోనయినా పోలీసుల చేతిలో నేను చనిపోవచ్చు. అందుకే చివరిసారిగా నిన్ను చూసి వెళదామని వచ్చాను. మళ్ళీ జన్మంటూ వుంటే నిన్నే నా భార్యగా చేసుకుంటాను" అన్నాడు రవితేజ ఆర్తిగా.
"అలాంటి మాటలు చెప్పవద్దు. నువ్వు నిర్దోషిగా గుర్తింపబడే రోజు దగ్గరలోనే వుందని నా మనసు చెబుతుంది." రజని కనులు చెమ్మగిల్లాయి.
శత్రువులు చాలా బలవంతులు. తెలివయిన వాళ్ళుకూడా... నా చుట్టూ పధకం అల్లిన వ్యక్తి నీ తండ్రే.... అందుకేనా నా నిర్దోషిత్వాన్ని రుజువు పరుచుకోవావలంటే యీ పోరాటంలో నీ సహాయ సహకారాలు కావాలి."
"తప్పకుండా... తండ్రి మీద మమకారం నాలో ఎప్పుడో చచ్చిపోయింది. కన్నాబిడ్డ శ్రేయస్సు అవసరంలేని కసాయి తండ్రి వున్నా ఒకటే..."లేకపోయినా ఒకటే..." రజని ఈసడింపుగా అంది.
రవితేజను డైనింగ్ హాలుకు తెసుకు వెళ్ళింది.
అతనికి ఇష్టమయిన పదార్దాలను కొసరి కొసరి తినిపిస్తుండగా సత్యమోహన్ వచ్చిన కారు బయట ఆగిన చప్పుడు స్పష్టంగా వినిపించింది
అతనని తన ఇంటిలో చూసిన వెంటనే ముందు అవాక్కయి పోయిన క్షణాలమీద తేరుకున్నాడు సత్యమోహన్.
అప్పటికప్పుడు పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తే పోయేది తన పరువే కాబట్టి బలవంతాన ముఖాన చిరునవ్వును తెచ్చుకున్నాడు.
"హల్లో రవితేజా... హౌ ఆర్ యూ..."
పలకరిస్తూనే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడతను.
"తమరి దయవల్ల ఇలా వున్నాను."
"బేబీ! కాసేపు పైకివెళ్ళు, రవితేజతో నేను మాట్లాడాలి"
అయిష్టంగానే వెళ్ళిందామె.
"నా బిడ్డ ఒక అనామకుడిని ప్రేమిస్తే నేను ఎలా సహించగలననుకున్నావు?
దాని సుఖంకోసం ఎలాంటి ఘోరం అయినా చేయడానికి వెనుకాడను. జయచంద్ర ఇంటికోడలిగా చేస్తున్న నా ప్రయత్నంలో ఏ అడ్డంకులు ఎదురయినా నా నిర్ణయం మాత్రం మారదు."
"నీ కూతురుమీద నీకు ప్రేమ వుందనేది ఒట్టి ట్రాష్... నిజంగా ప్రేమే వుంటే ఆమె మనసు ఎరిగి మసులుకునేవాడివి. నీకు కావలసింది ఆస్థి, అంతస్థు, అధికారం.... అంతే తప్ప నీ కూతురి సుఖంకాదు."
"నేను నిర్దోషినని నువ్వు చదివిన న్యాయానికి తెలుసు హంతకుడు ఎవరో నీ లా పుస్తకాలకు తెలుసు. దోషిని నిర్దోషిలా.... నిర్దోషిని దోషిలా జైలుకు పంపగల నీ మేధస్సుకు చెయ్యెత్తి నమస్కరించివలసిందే..." రవితేజ ఎకస్కెంగా అన్నాడు.
