సుమిత్రాదేవి ముఖం ప్రశ్నార్ధకంగా అయింది.
"ఏమైంది వర్ధనీ! ఎందుకలా పరుగెడుతున్నావు?"
"అమ్మగారూ! కొంపలంటుకున్నాయి. ఎన్నడూ లేదు ఈ ఇంటి మీదికి అపవాదు వచ్చింది అమ్మగారూ! గ్రామంలో జనం అంతా గుంపులుగాచేరి చెప్పుకుంటున్నారు" అంది వర్ధని! గాయత్రి సుమిత్ర నిర్ఘాంత పడిపోయారు.
"ఏం జరిగింది? మన పేరు ఎందుకు బయట పడింది?"
"అమ్మగారూ! అన్ని పనులు అందరికి అచ్చి రావండి! ఎన్నడో నిలిచిపోయిన ఆచారం మళ్ళీ తీసుకురావాలని అనుకున్నారా?"
"అవును. అనుకున్నాం, ఇప్పుడేమయింది?"
"గాయత్రిమ్మగారు నిన్న సీమంతానికి వెళ్ళివచ్చారా?"
"వారు పిలిచారు కదా? వెళితే తప్పేముంది?"
"ప్రపంచానికి పాపం పుణ్యం అంటూ ఉండవండి అమ్మగారు! సీమంతం చేయించుకున్న అమ్మాయికి రాత్రి అయిదో నెల గర్భం రాలిపోయింది, అబార్షన్ అయింది. అందరూ మనల్నే ఆడిపోసుకుంటున్నారమ్మా!" అంది వగర్చుతూ! నిలబడిన చోటున కుప్పగా కూలిపోయింది సుమిత్ర!
"మనకేమిటి సంబంధం?" అంది గాయత్రి కంగారుగా!
"అవును అమ్మగారూ! పెళ్ళి అయి రెండు సంవత్సరాలు కావస్తున్నా మీకు అలాంటి సూచనలు లేవు కదా! మీరు ముందు అక్షంతలు వేయకూడదా? పూవు పూచిందా? ఆ కడుపున కాయకాచిందా?
ఆమెచేత అక్షతలు వేయించటం తప్పు కాదా? అని ఆ తల్లిదండ్రుల్ని చివాట్లు పెడుతున్నారు. కడుపు పండకపోతే ఆ ఇల్లాలి కళ్ళు దిష్టి కళ్ళు అవుతాయట! అలాంటి వారిని శుభకార్యాలకు పిలిస్తే దృష్టి దోషంవల్ల ఆ పనులు చెడిపోతాయట! ఎంత విడ్డూరమండి?
దాని ఖర్మం చాలక కడుపుపోవటం ఏమిటి?
ఆ తప్పు అంతా అమ్మాయిగారి మీద విరుచుకుపడటం ఏమిటండీ?
ఈ ప్రపంచానికి పాపం పుణ్యం ఏమయినా ఉన్నాయా?
దుర్మార్గులు గుంపులు గుంపులుగాచేరి ఆడిపోసుకుంటున్నారండి. నేరకపోయి చేశాం! పెద్ద యిల్లు చలువ కలిగిన చేతులు అని పిలిచాం.
ఈ పట్టుచీరల కోసం మొహం వాచామా?
చిన్నావిడకి తెలియకపోతే పెద్దావిడకయినా తెలియాలి కదా!? వెడతానంటే వద్దమ్మా అని చెప్పి ఆపాలి కదా! అదేమీ లేకుండా వచ్చింది!
ఇంతకూ ఒకర్ని అనటం ఏమిటిలే మా ఖర్మకి అనుకోవాలి!
ముందా పట్టుచీర యింటిలోంచి తొలగించండి!" అంటోంది ఆ అమ్మాయి తల్లి, అందరూ అదే ఆడిపోసుకుంటున్నారండి.
నేడు వీధి వెంబడి వస్తూ ఉంటే వెర్రిగొడ్డని చూచినట్టు చూచారండి! నాకు తల భూమిలోకి దిగిపోయిందండి!" అంటూ వర్ణించి మరీ చెప్పింది.
వర్ధని మాటలు విన్న తరువాత ఎప్పుడు హుందాగా గర్వంగా కన్పించే సుమిత్ర ఎన్నడూలేని విధంగా అక్కడే గార్డెన్ లోనే కూర్చుని ఏడవటం ప్రారంభించింది.
గాయిత్రి ఇంక అక్కడే నిలబడేందుకు ముఖం చెల్లలేదు. అడుగు తీసి అడుగువేయాలంటే శక్తి చాలలేదు.
ఆమె ఎలాగో శక్తిని సమీకరించుకుని ఇంటిలోపలకు పరుగులు తీసింది! గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది.
గంటల తరబడి ఏడుస్తూ అలా ఉండిపోయింది.
ఈ వంశంలో ఎవరికి రాని చెడ్డపేరు తనకి వచ్చిందా?
ఇంకా ఎందుకు బ్రతకాలి? చనిపోవటం తప్ప ఈ స్థితిలో మరొక దారేముంది? భగవంతుడా? ఎందుకింత శిక్ష విధించావు?
ఈ యింటికి ఏదో పాపం చుట్టుకుంది. ఎలా బయట పడాలి!
చాలాసేపు దుఃఖించి బరువు అంతా దిగిపోయిన తరువాత ఆలయంకు వెళ్ళింది సుమిత్ర! బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి శాంతి జపాలు చేయించింది. సాయంత్రం వరకూ ఆలయం విడిచి రాలేదు.
చీకటి పడిన తరువాత పెద్దలు కొందరు ఆలయం దగ్గరకు వచ్చారు.
"అమ్మగారూ! ఇలా జరిగిందన్న విషయం మాకు ఆలస్యంగా తెలిసింది. వాళ్ళు తెలివితక్కువ వాళ్ళు! తొందరపడ్డారు.
మీరు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు! ఈ గ్రామానికి పెద్దదిక్కు మీరు, అందరికి మేలుకోరి ఎన్నో సహాయాలు చేసినవారు.
మీ వంశం చాలా పవిత్రమయింది. మంచి తప్ప ఆ యింటి మనుషులమనసుల్లోకి మరొకలాంటి ఆలోచనలు రావు. ఆ సంగతి అందరికి తెలుసు. నష్టపడి పోయామన్న బాధతో వాళ్ళు ఏదో వాగారట! ఆ విషయం మాకూ తెలిసింది. క్షమాపణలు చెప్పుకుందామని వచ్చాం.
"మీరు వారిని క్షమించాలండి అమ్మగారూ!" అని అర్ధించారు గ్రామపెద్దలు!
"అందరిని చూచేవాడు ఆ జగదీశ్వరుడున్నాడు! నాకెవరిమీద కోపం లేదు" అంది సుమిత్ర!ఆమె మనసులో అగ్నిగోళం అయిఉంది.
బాధతో కాదు. కోపంతో కాదు! వంశానికే మచ్చ వచ్చిందంటే ఏమిటి? తాను జీవిత కాలమంతా చేస్తూ వచ్చిన మంచి పనులకి అర్ధమేమిటి? తాత్పర్యమేమిటి? వాటి వాటికి ఫలితాంశమేమిటి?
"భగవంతుడా ఎందుకు ఇంత అగ్ని పరీక్ష కల్పించావు" ఆమె ఆంతర్యం సుడులుతిరిగి పోయింది.
ఆ ఇంటివారు కూడా వచ్చారు. ఆమె పాదాలమీద పడిపోయారు.
"ఎందరో నిర్భాగ్యులకు అన్నం పెట్టి ఆదరించిన చేయి. భగవంతుడా మా నోటితో ఈ వాక్కు ఎందుకు పలికించావు.
బాధలో ఉన్నప్పుడు నోరు వశం తప్పింది.
అనకూడని మాట అనేశాం! అమ్మగారూ మీరు ఏ శిక్ష విధించినాసరే భరిస్తాం. కాని క్షమించాం అని మీరు అనేంతవరకూ మీ పాదాలు చుట్టుకుపోతాం. విడిచి పెట్టం" అంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు.
"బాబూ! ఈ ప్రపంచ రీతిలో ఉన్నమాటే మీరు అన్నమాట! ఎవరికి వేస్తాం శిక్షలు! అందరిని శిక్షించినా రక్షించినా ఆ దేవుడు! మీరు బాధ పడకండి! మీరు చేసిన తప్పేమీ లేదు.
దాన్ని పంపించటం నాదే తప్పుబాబూ! సవరించుకోలేని నష్టం జరిగింది కదా! మీకు నేను ఏ విధంగానూ నష్టపరిహారం చెల్లించలేను. ఆ బిడ్డను తెచ్చి మీకు యివ్వలేను. మీరే నన్ను క్షమించాలి" అన్నదామె.
ఈ మాటలవల్ల ఆమె మనసు ఎంత గాయపడిందో పెద్దలు గ్రహించి ఆలయంలోనే చర్చించి ఆ పుకారు పుట్టించిన నోటిదురుసు మనిషి ఎవరో విచారించారు. గ్రామంలో ఆ మనిషి పేరు తేలుకొండి!
గాయత్రి సీమంతం దగ్గరనుంచి ఇంటికి వెడుతూ ఉండగా ఆమె అన్న మాటలు వర్ధని వారికి అందించింది. తమ యింటి దగ్గర ఖర్మ చాలక జరిగిపోయిన అనిష్టం గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటే మొదటిసారిగా ఆ ప్రస్థావనని తెచ్చిందికూడా ఆ తేలుకొండి అని తేలిపోయింది!
దారిన పోతున్న ప్రతిఒక్కరిని మాటలలో కుట్టడం ఒక్కటే పనిగా పెట్టుకున్న ఆవిడని పిలిపించారు. గ్రామంలో పుకారు పుట్టించి ఇంత మంది బాధకు కారణం అయిన ఆవిడకు అయిదురూపాయలు జరిమాన విధించారు. సుమిత్ర ఎదుట నిలిచి చెంపలు వేసుకోమన్నారు.
ఆమె మనసులో పుట్టిన దురుద్ధేశాన్ని చల్లార్చేందుకు తమకు తాతనయినంతా చేశారు. కాని సుమిత్ర మనసు కొలిమిలాగే మండుతోంది.
ఎవరేమి చేసినా ఈ అపవాదు ఎలా పోతుంది?
జరిగిన ఈ అవమానం ఎలా చెరిగిపోతుంది? భగవంతుడు విధించిన శిక్షగా దాన్ని స్వీకరించి చాలా ప్రొద్దుపోయిన తరువాత పూజలు ముగించి ఇంటికి చేరుకుందామె.
అప్పటికి ఇంకా గాయత్రి తలుపులు తీయలేదు.
తానే స్వయంగా వెళ్ళి పిలిచింది. తలుపులు తెరుచుకున్నాయి.
"పిచ్చిదానా! మన మనసులో కల్మషం లేదు. భగవంతుని దృష్టిలో మనం చేసింది తప్పుకాదు. అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారని మనం బాధపడటం ఏమిటి! భోజనం చేద్దాంరా!" అంటూ చెంపలు తుడిచింది.
చారికలు కట్టిన చెంపలమీద తల్లి చేతులు తగలగానే మరింతగా దుఃఖం పొంగి వచ్చింది. తల్లి వెంట నడిచింది గాయత్రి.
పగలంతా ఆమె ఎంత దుఃఖానికి గురి అయిందో తనకీ తెలుసు. కాని తాను భోజనం చేయకపోతే తల్లికూడా తినదు. ఆమె ఆరోగ్య రీత్యా అలా రోజుల తరబడి పస్తులు పడి ఉండటం మంచిది కాదు.
ఇద్దరూ ఒకరి కోసం ఒకరు భోజనం చేశారు.
"గాయత్రీ! ఇలాంటి విషయాలేమీ మనసులో పెట్టుకోకు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా! భగవంతుడు ఐశ్వర్యమిచ్చాడు. ఆ సమయం వచ్చినపుడు బిడ్డల్ని మాత్రం ఎందుకివ్వడు?
ఆ తరువాత వీళ్ళందరూ నోళ్ళు మూసుకుంటారు.
"అంతేనండి అమ్మగారూ! నాకేమీ బాధలేదు. ఒకసారి పెదవి దాటిన మాట పృధివి దాటిపోతుందంటారు. అదొక్కటే నా బాధ!"
"కాని ఈ విషయం అల్లుడిగారికి చెప్పకుండా ఉండటమే మంచిదనుకుంటాను."
"అవునండి! నేను కూడా అదే ఆలోచించాను. ఇలాంటి మాటలకు వారు రియాక్ట్ అవుతారు. ఒకరిమీద కోపగించుకోవటం అనవసరం. వారు చెప్పిన మాటలో నిజం కూడ ఉంది కదా! పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. దానికి ఎవరో అన్నారని నేరం వారిమీద ఎందుకు వేయాలి, ఆ మంచి రోజు కోసం ఎదురుచూడాలి. అంతే!" అంది గాయత్రి.
ఒకరికొకరు ఏడ్చుకున్నా ఓదార్పు మాటలు చెప్పుకున్నా దుఃఖించినా ఉపశమనం చేసుకున్నా వారిద్దరే ఒకరికి ఒకరు.
భోజనాలు పూర్తి అయి పైకి వెళ్ళిన తరువాత ఆమనికి ఉత్తరం వ్రాయడం మొదలెట్టింది గాయత్రి. ఆమెకు చెల్లి నించి వచ్చిన ఉత్తరాలు చదవటమే కాని వ్రాయటం ఎన్నడు అలవాటు లేదు.
మాటలు ముందుకు సాగలేదు ఎలాగో ముగించింది.
చాలా ప్రొద్దుపోయిన తరువాత లైట్లు తీసి వేసింది.
మనసులోని బాధ పుండులా తొలుస్తుంది.
* * *
