అనూష ఏదో ఆలోచిస్తూ వుండిపోయింది.
ఏంటి ఆలోచిస్తున్నావు?" మృదువుగా అడిగింది వీణ .
నిట్టూర్చింది...." ఏం లేదు వీణా! అమ్మ గుర్తొచ్చింది. నా పెళ్ళి కోసం కలవరించింది పిచ్చి అమ్మ. అమ్మ, మణి కూడా నా పెళ్ళి గురించి మాట్లాడుతూ చనిపోయారు. వాళ్ళిద్దరి ప్రాణాలు తీసిన నేను పెళ్ళి చేసుకోకపోతే ఏం? అనిపిస్తోంది."
"నీకేం పిచ్చా? వాళ్ళ ప్రాణాలు నువ్వు తీయడం ఏంటి? ఆయుషు తీరింది. పోయారు. పిచ్చిపిచ్చిగాఆలోచించకు. రేపు సాయంత్రం గురుడు షాపింగ్ కి తీసికెళ్ళి నీకు చీరలు, నగలు కొంటాట్ట... రెడీగా వుండు."
నవ్వింది అనూష...
"ముందు ఆ పేపరు సంగతి చూసుకోమను. సంకురాత్రికి, శివరాత్రికి తీసికోస్తున్నాడు. అమరి ఏం సంపాదిస్తూన్నాడో! ఎలా గెట్ అన్ అవుతున్నాడో?"
"నువ్వు చూసుకుంటావుగా ఇహనుంచీ.... అ దైర్యంతో వుండి వుంటాడు."
"నో!నో! అలాంటి ఆలోచనలకు ఛాన్స్ ఇవ్వద్దు. నామీద ఆధారపడితే, కష్టపడటం మానేస్తాడు. నాకలాంటి లేజీఫేలోన్ మీద గౌరవం లేదు."
"అబ్బ! ప్రిన్సిపుల్ పక్కన పెట్టు కాసీపు... ఆ మొహంలో పెళ్ళి కూతురి లక్షణాలు చూపించు."
"అంతే, సిగ్గుపడుతూ తలవంచుకుని కూర్చోమంటావా?"
వీణ నవ్వింది ఆ మాటలకి.... నిన్ను పెళ్ళికూతురు గెటప్ లో చూడాలని మహా ఆరాటంగా వుందిరా..."
"చూద్దువుగానిలే....రా బోంచేద్దాం."
ఇద్దరూ కలసి, కిచెన్ వైపు నడిచారు
"ఇవాళ వంట నేనే చేశాను...." అన్నది ప్లేట్లు సర్దుతూ అనూష.
"పెళ్ళి చేసుకుంటూన్నావుకదా! అని వంట ప్రాక్టీసు చేస్తున్నావా?"
"నాన్సెన్స్! వంట ప్రాక్టిస్ చేయడం ఏంటి? నాకు రాదా? వంతావిడ ఊరెళ్ళింది. పదిహేను రోజుల దాక రాదు."
"అలాగా! ఏమోలే... మొగుడికి గుండెల్లోకి, కడుపుద్వారా వెళ్ళాలని పెద్దవాళ్ళు అన్నారుకదా అని, ఎమన్నా కొత్త కొత్త వంటలు నేర్చు కుంటున్నావేమో అని....
"అంటే! ఉద్యోగం మానేసి, వంటలు చేస్తూ బతక మంటావా?"
"అవసరంలేదు. ఆ పని భరణి చేస్తాడు"
ఇద్దారూ గట్టిగా నవ్వుకున్నారు.
ప్లేట్లలో వడ్డించిన ఆలూ ప్రై, మామిడికాయ పప్పు, "ఓ! మామిడికాయ పప్పు?చాలా కాలమైంది... త్వరగా అన్నం పెట్టు" అన్నది వేళ్ళతో పప్పు తీసుకుని రుచిచూస్తూ.
అనూష అన్నం వడ్డించింది.
ఇద్దారూ బోజనం చేశాక, వీణని కోర్టు దగ్గర దింపి, హాస్పిటల్ వైపు వెళ్ళింది అనూష.
* * * *
మర్నాటి ఉదయానికల్లా భరణి తల్లీ తండ్రులు దిగారు.
"ఏరా? ఇంత హటత్తుగా నీకు నచ్చిన అమ్మాయెవరో? ఇంతకాలం నుంచీ ఎవరూ నచ్చలేదు."
భరణి గర్వంగా నవ్వాడు. "చాలా ఎక్ స్తార్దినరీ లేడీ నాన్నా... చూస్తె మీరే ఆశ్చర్యపోతారు." అన్నాడు.
"అదిసరే.... ఎవరమ్మాయి? ఏం కులం? ఎలా వుంటుంది? ఏం చేస్తోంది? గోత్రాలు కలిసాయా? వగైరా విషయాలు తెలిసికోవద్దూ" ఆత్రంగా అడిగింది తల్లీ లక్ష్మి.
"అవన్నీ నాకు తెలియదమ్మా.... అమ్మాయి చాలా అమ్ఫ్డంగా వుంటుంది. డాక్టరు."
"డాక్టరా? ఎవరమ్మాయి? వల్ల నాన్నా గారి పేరేమిటి? ఏం తెలుసుకోకుండా ఎలా ఒప్పుకున్నావు?"
"నేను ఒప్పుకోవడం ఏంటి నాన్న! ఆవిడే ఒప్పుకున్నారు. నేను ప్రపోజ్ చేశాను...."
భార్యాభర్తలిద్దరూ మోహమొహాలు చూసుకున్నారు. "కుటుంభం, పరువు, ప్రతిష్ట చూసుకున్నావా?"
"హు.... ఆవిడ నా భార్య అయాక, నా పరువు, ప్రతిష్టా పెరుగుతాయి నాన్నా.... ఫలానావారి అమ్మాయికన్నా, డాక్టర్ అనూష గా ఆవిడ పేరు ప్రతిష్టలేక్కువ."
డాక్టర్ అనూషా! అంతే... కార్డియాలజిస్టు... పెద్ద సర్జన్.... పేపరులో చూశాను. అ అమ్మాయి?" విభ్రాంతిగా అడిగాడు అయన.
"యస్..." గర్వంగా అన్నాడు భరణి.
"ఏంటి? ఆ అమ్మాయితో నీకు పెళ్ళా? చిన్నదేనా, వయసెంత? ఆమెకి పెళ్ళికాలేదా?" లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది.
"కాలేదమ్మా... నలబై ఏళ్ళుంటాయి."
"నలబై ఎళ్ళా? అదేంట్రా? నీకన్నా పెద్దదికదా?" లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది.
"వయసులో సరేనే.... ఆ అమ్మాయి వీడికన్నా అన్ని విషయాల్లో వున్నత స్ధానంలో వుంది. వీడితో పెళ్ళిలో ఒప్పుకుందా? అని ఆశ్చర్యంగా వుంది నాకు. ఒరేయ్ నాకేదో అనిమానంగా వుంది. నేనోసారి ఆ అమ్మాయిని చూడాలి."
"వేళదాం నాన్న...! ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకుంటాను."
"అపాయింటమెంట్ తీసుకుంటావా? చూశావా లక్ష్మి! ఆమెని కలుసు కోడానికి అపాయింట్ మేంటు లేకుండా వెళ్ళాడానికిలేదు. అలాంటి పిల్లని వీడు పెళ్ళిచేసుకుంటానన్నాడు.... అంటే! ఆమె స్థితి ఏమిటో నీకు అర్ధంకాలా?"
"అదిసరేనా... రేపు పెళ్ళయ్యాక కాపురం చేయాడానిక్కుడా అపాయింట్ మెంట్ తీసుకుంటావా?" ఆవిడ అడిగింది.
"అబ్బా ఏంటమ్మా మీ గొడవ.... అనూషగారూ మీ కోడలు ఆవబోతున్నారంటే ఎగిరిగంతెయాలి... ఇన్ని సందేహలెంటి?" విస్సుగా అన్నాడు.
సందేహాలుకాదురా భయాలు. పిల్ల నిచ్చేటప్పుడు మనకన్నా ఉన్నత కుటుంభంలో ఇవ్వాలని, పిల్లను తెచ్చుకునేటప్పుడు తక్కువస్థాయి పిల్లను తెచ్చుకోవాలని పెద్దలు చెబుతారు. ఆవిడా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సినవాళ్ళం, కాళ్ళకు నమస్కరిస్తుంటే దీవించే అర్హత మాకుందా? అని ఆలోచిస్తున్నాను" అన్నాడాయన.
