"మీరెన్ని విధాలా మభ్యపరచాలనుకున్నా, మీ రెన్ని కట్టుకథలు చెప్పినా అసలు సంగతేమిటో నాకు తెలుసు? ఆ చెడిపోయిన పిల్లను ఎవరు చేసుకొంటారు? మీ కంత ఆపేక్షగా వుంటే ఆ పిల్లను ఓ ఇంటిదాన్ని చేయాలని మీ కంత తహతహగా వుంటే మీ కొడుక్కు చిన్న భార్యగా చేసుకోండి. అంతేగాని, ఆ పిల్లను ఎవడూ చేసుకోడానికి ముందుకు రాడు. వస్తాను" రంగనాధం లేచి చరచరా వెళ్లిపోయాడు.
కోమలమ్మకు కోపంతో ఒళ్ళు తెలియలేదు. వెధవ! ఎన్ని మాటలు అనిపోయాడు? పిలిచి పిల్లనిస్తానంటే! వీడి పని చెప్తాను. రేపే ఇల్లు ఖాళీ చేయమని చెబుతాను! చిందులు వేయసాగింది.
మరునాటి ఉదయం ఊహించని విధంగా గిరిధర్ కోమలమ్మని కలుసుకొని పారిజాతను తను వివాహం చేసుకొంటానని చెప్పాడు. "నిన్న మీరు పిలిచి మాట్లాడిన సంగతి ఇంట్లో చెప్పగా విన్నాను. ఆయన నిరాకరించిన సంగతీ విన్నాను. ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. పారిజాత అంటే నాకు ఇష్టం. ఆమెమీద ఎన్ని కథలు ప్రచారంలో వున్నా నేను నమ్మను? నేను పారిజాతను పెళ్ళి చేసుకుని ఈ సంగతి ఇప్పుడే మా ఇంట్లో తెలియకూడదు! ఏ గుళ్ళోనో ఆ మూడుముళ్ళు పడ్డ తరువాత......... ఎవరికి తెలిసినా ఫర్వాలేదు."
"నువ్వు చాలా బుద్దిమంతుడిలా ఉన్నావు, బాబూ! కాని, చెప్పేవాళ్ళు చాలామంది వుంటారు!"
"పెళ్ళికి ముందా? పెళ్ళి తరువాతా?"
"పెళ్ళికి ముందు చెబితే నష్టంలేదు. పెళ్ళి అయ్యాక చెబితేనే కొంప మునుగుతుంది. కాపురం కూలుతుంది. ఆ పిల్ల జీవితం నాశనం అవుతుంది. అన్ని విషయాలూ ముందుగా మాట్లాడుకోవడం మంచిది."
"నాకన్ని విషయాలూ తెలుసు. నాకు పారిజాత మీద నమ్మకముంది. చెప్పుడు మాటలు చెవి ఒగ్గే మనిషిని కాదు. నేనెప్పుడూ నా స్వంత ఆలోచనమీదే నడుస్తాను. నాకిష్టమైతే నా తలిదండ్రుల్ని కూడా లెక్కజేయను!"
"నీలాంటి సహృదయుడు భర్తగా దొరకడం పారు అధృష్టం" కోమలమ్మ సంతోషంగా అంది.
"పారులాంటి అందమైన భార్య లభించడం నా అదృష్టం" అన్నాడు గిరిధర్.
17
మనోహర్ వివాహం వారం రోజుల్లోకి వచ్చేసింది.
పెళ్లి పనులన్నీ చకచకా పూర్తి అవుతున్న సమయంలో రజని నాయనమ్మ వైకుంఠయాత్రకు వెల్లిందన్న వార్త వచ్చింది! పెళ్లిపనులు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.
కర్మకాండ ముగిశాక మళ్ళీ ముహూర్తం కుదరలేదు. మరో మూడు నెలలదాకా మంచి లగ్నాలు లేవన్నారు బ్రాహ్మలు.
రజనీ మనోహరులు ఒకరింటికి ఒకరు రావడం, గంటలు తరబడి కబుర్లు చెప్పుకోవడం, భోజనాలకు ఓ పూట ఆగిపోవడం జరుగుతోంది. వాళ్ళమధ్య అనుబంధం కావలసినంత బలపడుతోంది.
ఒకరోజు మనోహర్ వెళ్ళేసరికి రజని పడుకొని వుంది. ప్రక్కనే స్టూల్ మీద మందులున్నాయి.
"ఏమిటి రజనీ? జ్వరమా?" అంటూ ఆత్రుతగా సమీపించాడు మనోహర్.
"ఊఁ" అని మూలిగి అటు తిరిగి పడుకొంది రజని.
అంతలో ఛాయ ప్రవేశించింది. "ఓ మనోహర్ గారా? క్షేమమా?" అంది హేళనగా.
ఈ పిల్లను చూస్తే మనోహర్ కి కారం రాచుకున్నట్టుగా వుంటుంది. దేనికో ఓ దానికి ఎత్తిపొడుపూ, హేళనా! ఎప్పుడూ బావగారూ అనేది. ఇప్పుడు మనోహర్ గారూ అంటూంది. ఏమిటో విశేషం!
"ఈ రోజు మా కాలేజీలో వరకట్నం సమస్యగురించి మీటింగు జరిగింది" అంటూ కుర్చీ భళ్లున లాక్కుని కూర్చుంది.
"తమరు పాల్గొన్నారా?" అంతే హేళనగా ఎదురు ప్రశ్నించాడు మనోహర్.
"పాల్గొన్నారా? మీలాంటి ఆశపోతు పెళ్లికొడుకు లకు దిమ్మతిరిగేలా ఉపన్యసించాను!" హాస్యంగా అంటున్నట్టు కాక సీరియస్ గా అనడం చూచి మనోహర్ చివ్వున తల త్రిప్పి చూశాడు.
"ఏం మరదలుపిల్లా? నేను ఆశపోతు పెళ్లికొడుకునా?"
"కాదా?"
"నువ్వు ఎప్పుడూ దెబ్బలాటకు వచ్చినట్టుగా మాట్లాడతావేం? నీ సంగతేమిటో ఈరోజు తేల్చుకుంటాను!" మనోహర్ కి కూడా కోపం వచ్చేసింది.
"మేమూ తేల్చుకోవాలనే అనుకుంటున్నాం."
