"రమణ పెళ్ళి మాటేమిటంటారు? ఇప్పటికే ఈ సంబంధం నిశ్చయమై ఏవో అవాంతరాలలో ఆగిపోయింది.
నిశ్చయమైన సంబంధానికి అతిగా కాలయాపన జరుగడం బాగుండదు. ఏమంటారు? నేనడుగుతున్నానని అన్యధా భావించకండి. పిల్లవాడి మంచి చెడ్డలు చూచే బాధ్యత నా మీద పడినట్లేకదా?"
"ఇప్పుడెలా? సంవత్సరీకం కాకుండానే ముహూర్తం ఎలా పెట్టుకోగలం?" అన్నారు ఆశ్చర్యంగా, సూర్యదేవులు.
"దానిదేముంది? పెళ్ళి ఇప్పుడు జరిపించాలనే అనుకొంటే శాస్త్రంలో ఏదో ఒకమార్గం ఉండకపోదు. బ్రాహ్మణ్ణి అడిగితే విముఖమో ఏదో చెబుతాడు."
"ముసలి నక్కలకు జిత్తులెన్నో" అనుకొన్నారు సూర్యదేవులు. ఆయన తొందరలో ఆంతర్యం అవగతంకాగా మరదల్ని చేసుకొంటానని భార్గవరామ్ తిరిగి వచ్చినప్పటినుండి సూర్యదేవుల ఆలోచనలు మరోవిధంగా సాగుతున్నాయి. అక్కా బావా పోయారు. భార్గవుడిని తను దగ్గరికి తీయకుంటే వాడి గతేమిటి? అక్కకు పిచ్చిపట్టి ఇదివరకే కొంత అన్యాయం చేసిపోయింది కన్న కొడుక్కు, భార్గవుడు పరివర్తన పొందిన హృదయంతో తిరిగివచ్చిన ఈసమయంలో అక్కే ఉంటే అతడికి కాక దత్తపుత్రుడికి చేసుకొనేదా మేనకోడలిని? దేవతను భార్గవుడికి ఇచ్చివేసి ఒక ఇంటివాడిని చేస్తే స్వర్గంలో ఉండే అక్కా, బావా సంతోషించక ఏం చేస్తారు? దేవతకు బావను చేసుకోవడమే ఇష్టం ఆ పిల్లతల్లికీ అదే ఇష్టం. వారిద్దరి ఇష్టమే తన ఇష్టం.
"చూద్దాం లెండి" అని లేచిపోయారు సూర్యదేవులు అప్పటికేమీ తన మనోభావాలు బయల్పరచకుండా.
నాడు పదమూడోరోజు. ఇంటి దీపం చూడకూడని వచ్చి చుట్టుపక్కాలు ప్రయాణం కడుతున్నారు. దేవదాసి తలిదండ్రులతో వెళ్ళిపోతూంది. తోటలో మామిడి చెట్టు కొమ్మకు వ్రేళ్ళాడగట్టిన కుండలో పావురం పిల్లలు పెట్టిందని రాఘవుడు చెబుతే వెళ్ళింది దేవదాసి. చిన్న పావురం పిల్లలు రెండు కువకువలాడుతున్నాయి కుండలో తల్లి పావురం వచ్చి దేవదాసి భుజంమీద వాలింది.
"దేవతమ్మా!"
ఉలిక్కిపడి చూచింది దేవదాసి. బోడిగుండు అందవికారం కనిపించకుండా తుండు ఒకటి తమాషాగా తలకుచుట్టి పల్లె యువకుడివలె కనబడుతున్నాడు రమణ.
ఎన్నడూ లేనిది రమణ తనను పలకరిస్తున్నాడు! ఏం మాట్లాడాలో తోచక తత్తరపడింది దేవదాసి. పావురం రెక్కలు నిమిరి వదిలేసింది. పిల్లలు చెంతకు ఎగిరిపోయిందది.
"నీతో ఒక మాట చెప్పాలని...."
"చెప్పండి."
మామిడి చెట్టు చుట్టూ వేసిన తిన్నెమీద కూర్చొన్నాడు రమణ. "ఇతడు నాతో ఈ మాటలు చెప్పాల్సినవసరమేమిటని నవ్వబోకు." లజ్జతో కూడిన దరహాస మొకటి అతడి పెదవులమీద క్షణకాలం నర్తించిపోయింది.
దేవదాసి తలెత్తి మెల్లని స్వరాన అన్నది. "నవ్వను చెప్పండి."
"ఇక్కడికి నేనుదత్తు వచ్చిననాడే కన్నవారికి దూరమయ్యాను. దత్తుతీసుకొన్న వాళ్ళు కూడా పోయారు. ఎందుకో ఈ ప్రపంచంలో నేను ఏకాకినన్న భావం కలుగుతున్నది" నిర్వికారం ప్రారంభమైన ఆ గొంతులో క్రమంగా ఉద్వేగం చోటు చేసుకొంటున్నది.
"అదేమిటి? మీరు ఏకాకి ఎలా అవుతారు?" చిన్నగా నవ్వింది దేవదాసి. "దత్తు వచ్చారు. నిజమే మీ తలిదండ్రులింకా వున్నారు. మీ మంచి చెడ్డలు వారు చూడగలరు!"
"చూడగలరు బరువుగా నిట్టూర్చాడు" ఈ వయసులో కలిగే ఊహలూ, ఆలోచనలూ, అనుభూతులూ ఎంత ఆత్మీయులైనా కన్నవారితో చెప్పుకోలేం. ఈ వయసులో అనభవాలకంటే అనుభూతుల ప్రభావమే అధికంగా ఉంటుంది ఏమంటావు?"
"ఉఁ."
"నా మనసువచ్చి నీ ముందు పెడుతుంటానంటే నువ్వు నాకెంత దగ్గరయ్యావో చెప్పలేదు. నీకంటే ఆత్మీయులు లేరనిపిస్తుంది. నా దిగులునూ, ఆవేదనూ వెళ్ళబోసుకోవడానికి, ఇందులో నేను చేసిన నేరమేమీలేదు. దేవతమ్మా! పెద్దలు నిన్ను నా వధువుగా నిర్ణయించి చేసిన తప్పు. ధర్మ బద్ధమైన న్యాయమైన విధంగానే నేను ప్రేమించాను, ఆశలు అల్లుకొన్నాను కాని. ఈనాటి పరిస్థితులు నన్ను వెక్కిరిస్తున్నాయి."
"పరిస్థితులు మిమ్మల్ని వెక్కిరిస్తున్నాయా?"
"నేను కవిని కాదు, దేవతమ్మా! భాషా సౌందర్యం గురించి నాకు తెలియదు. మనసును నాకు తెలిసిన విధంగా మాటల్లో వ్యక్తపరుస్తున్నాను" కొద్దిగా చిన్నబుచ్చుకొన్నాడు రమణ.
