Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 43


    "నాకా సంగతి తెలుసు. నాన్నగారూ! నేనడిగింది డెబ్బైవేలలోంచే!"

    "డెబ్బైవేల లోంచేనా? ఇంకెక్కడున్నాయి ఆ డెబ్బైవేలు? నీ  పెళ్లి రెండు పూలదండలతో అయిందనుకొంటున్నావా? చుట్టాలందరినీ పిలిచి మూడు రోజుల పెళ్లి వైభవంగా చేశాం కదా? పెళ్లి కూతురికి చీరలు, నగల  కోసమే యాబైవేలు ఖర్చు చేసాం. మిగిలిన ఇరవై వేలు పెళ్లికి చాలనే లేదు అయిదు వేలు అప్పు అయింది. మీ మామగారు మిగతా ముప్పైవేలు ఇస్తాడేమో ఆ అప్పుు తీర్చాలని నేననుకుంటూంటే  నువ్వు స్కూటర్ కొనాలి డబ్బు పంపమని వ్రాస్తావా?"

    "డెబ్బైవేలు కట్నం తీసుకొని పెళ్లికి అప్పైందని చెబితే ఎవరైనా నవ్వుతారు. నాన్నగారూ!"

    "నవ్వుతారమోగాని. వున్న వాస్తవం అది!"

    "మరి ఎలా? నేను స్కూటర్ మాట్లాడి పెట్టాను. ఆఫీసుకి రావడం పోవడం చాలా కష్టంగా వుంది."

    "నీ పెళ్లాం మీది నగలు తీసి అమ్ముకో! నేనేం చేయను, మరి?"

    "పెళ్ళయి నెల తిరక్కుండా పెళ్లాం మీది నగలు ఒలిచి అమ్ముకోవడం ఏం మర్యాద, నాన్నగారూ?"

    "ఆడవాల్ల మీద నగలు పెట్టడం అవసరానికి ఉపయోగపడతాయనేరా!"

    ఈ సంభాషణ విన్నాక హరితకు కలిగిన మనస్తాపం అంతా ఇంతా కాదు! తనది వరకట్నం లేని ఆదర్శ వివాహం అన్న ఒకింత గర్వం మట్టిలో కలిసిపోయింది. కన్న తల్లిదండ్రులే ఎంత మోసం చేశారు తనను! వరకట్న రాక్షసిని హతమార్చాలని ఒక  ఆడపిల్ల కంకణం కట్టుకుంటే ఏమౌతుంది - ముఖ్యంగా కన్నవాళ్లే సహకరించలేక పోయాక!

    చాలామంది తలిదండ్రులు తమ పిల్లలను మంచి ఇంటికి ఇవ్వాలని తాపత్రయంలో శక్తికి మించిన కట్న కానుకలు తమ ఇష్టపూర్తిగానే చెల్లిస్తూంటే ఈ వరకట్న పిశాచి ఎప్పుడు అంతమౌతుంది! ఎలా అంతమౌతుంది?

    ఓ నెల్లాళ్లు ఇక్కడే వుండి వస్తానని సుబ్బమ్మ ఇక్కడే దిగబడిపోగా మామగారు రెండురోజుల తరువాత వెళ్లిపోయారు.

    నాలుగు రోజులు హరితకూ, కమలాకర్ కూ మాటలు లేకుండానే గడిచిపోయాక అయిదో రోజు అతడే మాటలు సాగించాడు.

    "కట్నం తీసుకొన్న విషయం నీకు తెలియనీయొద్దన్నాడు మీనాన్న కట్నం. తీసుకొని మేమేదో తప్పు చేసినట్టు నీ దగ్గర దాచి పెట్టదలచుకోలేదు! లోకంలో అందరూ చేసిందే మేమూ చేశాం. ఈ హరిత నాన్న లక్ష కట్నం ఇవ్వకపోతే మరో వినత నాన్న ఇచ్చేవాడు. నాకున్న క్వాలిఫికేషన్సుకి లక్షేమిటి? రెండు లక్షలు తీసుకోవచ్చు!"

    హరిత తిరస్కారంగా చూసింది.

    ఆమె చూపు పట్టించుకోకుండా తిరిగి కొనసాగించాడు. "మీ నాన్న లక్ష కట్నం ఇస్తానని చెప్పి డెబ్బైవేలే ఇచ్చాడు. మిగతా ముప్పైవేలకి రెణ్ణెల్ల గడువు పెట్టాడు.  కాని రెణ్ణెల్ల  దాకా ఆగేట్టు లేదు! స్కూటర్ బేరం చేసి పెట్టాను. అర్జంటుగా పదిహేను వేలు కావాలి! రేపు నువ్వే వెళ్లి అప్పో సప్పో చేయించి డబ్బు పట్టుకురా."

    "కట్నం తీసుకొనే వాళ్లంటేనే నాకు చెడ్డ అసహ్యం!   ఇక నేను వెళ్లి మా నాన్న పీకల మీద కూర్చొని మీకు కట్నం వసూలు చేసి పెడతానని ఎలా అనుకొన్నారు?"

    "అంత కట్నం లేకుండా పెళ్లిచేసుకోవాలనుకొన్న దానివి మరో మతం వాడిని ప్రేమించి పెళ్లాడలేకపోయావా?పెద్దలు చేసిన  సంప్రదాయపు పెళ్లిలో కట్న కానుకలు లేకుండా పోతాయని ఎలా అనుకొన్నావు? నీ ఆదర్శానికి బలికావడానికి అంత చచ్చు వెధవ ఎవరు దొరుకుతారనుకొన్నావు?"

    "కట్నం తీసుకోనివాడు చచ్చు వెధవ కాదు! సంతలో గొడ్డులా అమ్ముడు పోయేవాడు చచ్చు వెధవ."

    "అంటే నన్ను చచ్చు వెధవనని తిట్టినట్టా?" కమలాకర్ కోపంగా హరిత చెయ్యిపట్టి వడితిప్పాడు.

     మోచేతి దగ్గరా, భుజం దగ్గరా భగ్గున మండినట్టుగా అయింది హరితకు. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి! "వట్టి చచ్చు వెధవవే కాదు! పశువ్వి కూడా!  భార్యని కొట్టడం, హింసించడం నీ మగతనాన్ని వెల్లడించుకోవడం కాదు! నీ కుసంస్కారాన్ని, నీ అనాగరిక ప్రవృత్తినీ వెల్లడి చేసుకొంటున్నావు ఈ చర్యల వల్ల!"

    "కొట్టడం కాదు, చంపేస్తాను... వెర్రి వేషాలు వేశావంటే! రేపు వెళ్లి నీ బాబు నడిగి ముప్పైవేలు పట్టుకురా!"  లేకపోతే మగడూ, కాపురానికి నీళ్లు వదులు కోవలసిందేనని తెలుసుకో"

    "నేను వెళ్లను సరికదా, ఆ మిగతా ముప్పైవేలు ఇవ్వక్కరలేదని లెటరు  వ్రాస్తాను మా నాన్నకి."

    "వ్రాసి నువ్వు బ్రతికి వుంటానను కొంటున్నావా?"

    "ఏం? కిరోసిన్ పోసి తగల బెట్టేస్తారా? గొంతు నులిమి చంపేస్తారా?"

    "ఏం చేస్తానో చెప్పి చేస్తానా?"

    "మీరు చెప్పకపోయినా మీ చేతిలో ఒక కోడిలాగో, మేకలాగో చచ్చిపోతాననుకోకండి!"

    "ఆహాఁ? ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తావేం?"

    "ఏం చేస్తానో చెప్పి చేస్తానా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS